తెలుగువారి ఆత్మగౌరవమే అజెండాగా కొత్త పార్టీ: కిరణ్
హైదరాబాద్: తెలుగువారి ఆత్మగౌరవమే అజెండాగా కొత్తపార్టీ పెట్టనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మాదాపూర్ ఇమేజ్ హాలులో ఈ సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగువారి గుండెచప్పుడే తమ విధానంగా పార్టీ అని చెప్పారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన, రాజీనామా చేసిన కొందరు నేతలతో కిరణ్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కొత్త పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నెల 12వ తేది గురువారం సాయంత్రం 4 గంటలకు రాజమండ్రిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆ సభలో పార్టీ పేరు, పార్టీ విధివిధానాలు, ఇతర అంశాలు ప్రకటిస్తామన్నారు. పదవుల కోసం కాదని, ప్రజల కోసం పార్టీ పెడుతున్నట్లు చెప్పారు.
రాష్ట్ర విభజన జరిగిన విధానం - ముసాయిదా బిల్లు - పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తీరు - ఆంధ్రప్రదేశ్ ఎంపిల బహిష్కరణ - తెలుగు జాతికి చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా రాజీనామా చేసినట్లు చెప్పారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరిగిందన్నారు. పార్లమెంటరీ వ్యవస్థకు సిగ్గుచేటు కలిగించే విధంగా విభజన జరిగిందన్నారు.
తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతం అనుసరించిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడుకు ఇప్పటికి కూడా స్పష్టతలేదన్నారు. రాష్ట్రాన్ని కలిసి ఉంచాలని ఆయన ఇప్పటికీ చెప్పడంలేదన్నారు. రాజకీయ లాభం కోసం వారు ప్రవర్తించిన తీరు బాధ కలిగించిందన్నారు. శాసనసభలో కూడా చంద్రబాబు అభిప్రాయం చెప్పలేదని గుర్తు చేశారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి కలిసి తెలుగు జాతికి అన్యాయం చేశాయన్నారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పురుడుపోసి తల్లిని చంపారని అన్నారు. అధ్వానీ ఇటువంటి బిల్లు పార్లమెంటు చరిత్రలో ఎప్పుడూ పెట్టలేదన్నారు. సుష్మాస్వరాజ్ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టలేదన్నారు. ఉభయ సభలలో సభ్యులు ప్రవర్తనకు బాధ కలిగిందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారని విమర్శించారు. కలిసి ఉండాలన్న తెలుగు ప్రజల భావనను ఎవరూ వ్యక్తీకరించలేకపోయారని చెప్పారు.
తెలుగుజాతి ఆత్మగౌరవం కాపాడటానికి, వారి ఆలోచనల మేరకు నడిచేందుకు పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. ప్రపంచంలో ఉండే తెలుగువారందరి ఆత్మగౌరవాన్ని, వారి గుండెచప్పుడుని అర్ధం చేసుకునే విధంగా తమ పార్టీ ఉంటుందని చెప్పారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలపై విచారణ విషయం విలేకరులు ప్రస్తావించగా, తాను భయపడే వ్యక్తిని కాదని చెప్పారు. విచారణ చేసుకోవచ్చని తెలిపారు. గవర్నర్కు తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. తన ముఖ్యమంత్రి పదవి తెరిచిన పుస్తకం అని చెప్పారు.
విలేకరుల సమావేశంలో లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, హర్షకుమార్, శాయిప్రతాప్ పాల్గొన్నారు.