ఆశించిన స్పందన లేక కిరణ్ వెనుకంజ
మాజీ మంత్రులు, సన్నిహిత నేతలు దూరం
బహిష్కృత ఎంపీల్లోనూ భిన్నాభిప్రాయాలు
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. కొత్త పార్టీ యోచనలో ఉన్నట్టుగా ప్రచారం చేసినా ఆశించిన స్థాయిలో నేతల నుంచి స్పందన రాకపోవడంతో వెనుకంజ వేసినట్లు సమాచారం. సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే కిరణ్ కొద్దిరోజులుగా పార్టీ ఏర్పాటుపై బహిష్కృత ఎంపీలు, ఇద్దరు మాజీ మంత్రులతో నిరంతరం మంతనాలు జరిపారు.
కొత్త పార్టీ దాదాపు ఖాయమైందని, జెండా, ఎజెండా కూడా సిద్ధమైందని వారం రోజుల క్రితం సీఎంతో సమావేశమైన తర్వాత కాంగ్రెస్ బహిష్కృత ఎంపీలు బయటకు వచ్చి మీడియా ముఖంగా ప్రకటించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారా? లేక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? అనేది తేలిన తర్వాత అధికారికంగా కొత్త పార్టీని ప్రకటిస్తారన్నారు. రాష్ట్రపతి పాలన విధిస్తే మంత్రులంతా మాజీలవుతారని, వారితోపాటు మెజారిటీ కాంగ్రెస్ శాసనసభ్యులు తన వద్దకు వస్తారని కిరణ్ భావిం చారు. రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ కాంగ్రెస్ నేతలెవరూ కిరణ్ వద్దకు వెళ్లలేదు. ఆయనతో మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. మొదటినుంచీ సన్నిహితంగా మెలిగిన వారు సైతం ముఖం చాటేశారు.
కొందరు నేతలకు ఫోన్లు చేసి పిలిచినప్పటికీ రావడం లేదు. పార్టీ పెట్టాల్సిందేనని నిన్నటివరకు పట్టుబట్టిన కాంగ్రెస్ బహిష్కృత ఎంపీలు సైతం ఇప్పుడు మెత్తపడినట్టు సమాచారం. వారిలో కొందరు కొత్త పార్టీ అనవసరమని చెబుతుంటే, లగడపాటి, ఉండవల్లి వంటి నేతలు కొత్త పార్టీ పెట్టినా తాము మాత్రం ఈసారి పోటీ చేయబోమని తేల్చిచెప్పినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఆదివారం కొందరు మిత్రులతోపాటు కుటుంబసభ్యులతో సమావేశమైన కిరణ్ కొత్త పార్టీ పెట్టడం వల్ల లాభం ఉండదన్న భావనకు వచ్చినట్లు తెలిసింది. ఆదివారం కొందరు బంధువులు కలిసినప్పుడు ఒకటి, రెండ్రోజుల్లో ఏ విషయం చెబుతానని పేర్కొన్నట్టు సమాచారం.