సమైక్య ముసుగులో సీఎం కిరణ్ మోసం
సమైక్య ముసుగులో సీఎం కిరణ్ మోసం
Published Mon, Oct 21 2013 2:33 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
కుర్చీ కాపాడుకోడానికే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యవాదం ముసుగులో రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ విమర్శించారు. విశాఖ విమానాశ్రయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజనను సజావుగా న డిపించడానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు వత్తాసు పలుకుతూ సీఎం ఓ అస్త్రంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. విభజన పక్రియ సజావుగా సాగిపోవడానికి ప్రజాప్రతినిధులతో రాజీనామాలు ఇవ్వనీయకుండా, రాజకీయ సంక్షోభం రానీయకుండా సీఎం అడ్డుపడుతున్నారన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శాసనసభలో తీర్మానానికి కిరణ్ సర్కారు ప్రయత్నించడంలేదని ధ్వజమెత్తారు. విభజనపై కేంద్రం ముందుకు వెళుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన చందంగా తాపీగా కూర్చున్నారని విమర్శించారు. సోనియాను ఎదిరిస్తుంటే సీఎం పదవీత్యాగం చేస్తారని గతంలో చాలామంది భావించారని, కానీ ఇపుడు ఆయన నిజస్వరూపం బయటపడిందని చెప్పారు. సమైక్యవాదాన్ని అణచివేసే ప్రయత్నాలు చేస్తున్న కిరణ్ చరిత్రహీనులుగా మిగులుతారన్నారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేసే పరిస్థితి లేకుండా చేసి సోనియాగాంధీ ప్రజాస్వామ్యాన్ని నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యసభకు హరికృష్ణ చేసిన రాజీనామాను, మంత్రి విశ్వరూప్ చేసిన రాజీనామాను ఆమోదించినా, మిగతా మంత్రుల రాజీనామాలు, వైఎస్సార్ సీపీ రాజీనామాలు ఆమోదించకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీకి మసి పూయాలని చూస్తున్నారన్నారు. రాజీనామాలపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామన్నారు. చంద్రబాబు సమైక్యాంధ్ర ముసుగులో ఒక మాదిరిగా.. ముసుగు తీసి మరొకలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సేవియర్ ఆఫ్ కాంగ్రెస్ (రక్షకుడు)గా చంద్రబాబు మారారని ఎద్దేవా చేశారు. సోనియా నేతృత్వంలో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి పని చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై సీబీఐ కేసులు లేకుండా, సమైక్యాంధ్రకు జగన్ సీఎం కాకూడదన్న లక్ష్యంతో కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులు కలిపారని ఆరోపించారు.
Advertisement
Advertisement