సాక్షి ప్రతినిధి, కడప : ఊగిసలాట నడుమ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఆయన వెంటే ఉండాలని ముందుగా నిర్ణయించినా ఎందుకో స్తబ్దత ఆవహించింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జిల్లా నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్న తరుణంలో కొత్త పార్టీ ప్రకటన చేశారు. కిరణ్‌తో జత కట్టలా.. వద్దా అని జిల్లా నేతలు తర్జన భర్జన పడుతున్నారు.
రాష్ట్ర విభజన అంశం కాంగ్రెస్ పార్టీ నాయకులను అతలాకుతలం చేసింది. ఆ పార్టీని వీడేందుకు జిల్లా నేతలంతా సన్నద్ధమయ్యారు. ప్రత్యామ్నాయ రాజకీయం కోసం ఎదుటి పార్టీల వైపు చూస్తూ ఎవరి దారిన వారు వెళ్లేందుకు సంసిద్ధులయ్యారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో కొత్త పార్టీ పెడతారని భావించారు. అందులో చేరి తమ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెట్టే దిశగా అడుగులు కనిపించకపోవడంతో పలువురు నాయకులు పక్క పార్టీల వైపు చూస్తుండిపోయారు. అయితే ఉన్నట్లుండి కొత్త పార్టీ పెడుతున్నట్లు కిరణ్ ప్రకటించడంతో డైలమాలో పడిపోయారు. ప్రజలను ఏ మేరకు కిరణ్ ఆకట్టుకోగలరు.. ఆ పార్టీలో కొనసాగితే ఏ మేరకు ఉపయోగముంటుందని చర్చల్లో జిల్లా నేతలు నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది.
కిరణ్‌పార్టీకి జిల్లాలో సారధ్య బాధ్యతలు వహించేందుకు మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి సంసిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
డైలమాలో కాంగ్రెస్ నేతలు
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రత్యామ్నాయ పార్టీని ఏర్పాటు చేయలేరనే అంచనాకు వచ్చిన కాంగ్రెస్ నేతలు రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీ పంచన చేరేందుకు సంసిద్ధులయ్యారు. ఆ మేరకు వారివారి స్థానాలను ఖాయం చేసుకునేందుకు రాజకీయ ఎత్తుగడలను ప్రారంభించారు. అందులో భాగంగా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి టీడీపీ టిక్కెట్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడు రమేష్ ద్వారా కొంతమేర సఫలీకృతమైనట్లు తెలుస్తోంది. ఈ దశలో కిరణ్ పార్టీ ప్రకటన రావడంతో డైలామాలో పడినట్లు సమాచారం. ఎమ్మెల్సీ బత్యాల సైతం ఇదే రకమైన ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
రాజంపేట బరిలో సాయిప్రతాప్
రాజంపేట పార్లమెంట్ స్థానానికి కిరణ్ పార్టీ నుంచి సాయిప్రతాప్ పోటీ చేసేందుకు దాదాపు రెడీ అయినట్లు తెలుస్తోంది. కిరణ్ పార్టీ ప్రకటన లేకపోతే టీడీపీ నేతలతో సయోధ్య కుదుర్చుకునేందుకు తీవ్ర మంతనాలు చేసిన ఆయన మనసు మార్చుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సాయిప్రతాప్‌తోపాటు రమేష్‌రెడ్డి, తులసిరెడ్డి, కమలమ్మ పయనించనున్నారు. మిగతా నేతలు ఊగిసలాటలో ఉన్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
నిరాశలో తెలుగుదేశం పార్టీ
ప్రజా మద్దతు అపారంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నేతల మైత్రిని కొనసాగించాలని టీడీపీ భావించింది. ఆ మేరకు జిల్లాలోని కాంగ్రెస్ నేతలందరికీ ఏదో ఒక రీతిలో ఎరవేస్తూ టీడీపీలో చేర్చుకునేందుకు ఆపార్టీ నేతలు సమాయత్తమయ్యారు. ఈదశలో కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తగా పార్టీ పెట్టనుండడంతో జిల్లాలోని కొందరు నేతలు కిరణ్ వెంట నిలవనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలు జతకడితే ఎంతో కొంత ప్రయోజం ఉంటుందని భావించిన టీడీపీ నేతలకు చేదు అనుభవం ఎదురైందని పరిశీలకులు పేర్కొంటున్నారు.
వెళ్లాలా... వద్దా
Published Fri, Mar 7 2014 3:39 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement