కాసేపట్లో కిరణ్ కొత్త పార్టీ ప్రకటన?
హైదరాబాద్: తాజా మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నారా? ఇటీవల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన ఈ విషయంపై కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశముంది. గురువారం సాయంత్రం 6 గంటలకు కిరణ్ మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. కొత్త పార్టీ గురించి ప్రకటన చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఆమోదించడాన్ని నిరసిస్తూ కిరణ్ ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణను వ్యతిరేకించిన మరో ఆరుగురు ఎంపీలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. బహిష్కరణకు గురైన ఎంపీలు గురువారం కిరణ్తో సమావేశమయ్యారు. వీరిలో లగడపాటి రాజగోపాల్, హర్ష కుమార్, సబ్బం హరి ఉన్నారు. కిరణ్ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులతో పాటు విద్యార్థి, ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్నారు. పార్టీ పెడితే ఎంతమంది అండగా ఉంటారు, పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాలపై చర్చించినట్టు సమాచారం. కాగా ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ నాయకులు ఆయన వెంట రాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.