పోర్టు వద్ద ఎగుమతి పనుల్లో మత్స్యకారులు
సాక్షి, మచిలీపట్నం: కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న మత్స్యకారులకు మంచిరోజులొచ్చాయి. గంగమ్మ తల్లినే నమ్ముకున్న వారి బతుకులు బాగుపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే సముద్రంలో వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు వేటనిషేధ భృతిని రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచడమే కాకుండా డీజిల్ సబ్సిడీని లీటర్‌కు రూ.6.03 నుంచి రూ.9లకు పెంచింది. తాజాగా మైదాన ప్రాంతాల్లో చెరువుల్లో చేపలు పట్టుకునే మత్స్యకారులకు కిసాన్ క్రిడెట్ కార్డులివ్వాలని నిర్ణయించింది.
జిల్లాలో ఇన్‌లాండ్ మత్స్యకార సంఘాలు 211, మెరైన్ మత్స్యకార సంఘాలు 43, మహిళా మత్స్య కార సంఘాలు 81 ఉన్నాయి. వీటి పరిధిలో 38,914 మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. మత్స్య కారులకు ఇచ్చే కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా బహుళ ప్రయోజనాలున్నాయి. ప్రధానంగా మైదాన ప్రాంతాల్లో ఉంటూ చెరువుల్లో చేపల పెంపకం చేపట్టే మత్స్యకారులు తగిన ఆర్థిక స్థోమత లేక అవస్థలు పడుతున్నారు. రొయ్యలు చెరువులు సాగు చేసే మత్స్యకారులైతే దాణా, మందులు కొనుగోలు చేయడానికి అప్పులు చేయాల్సి వస్తోంది. అలాంటి వారికి కిసాన్ క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ సౌకర్యం గతంలో ఉండేది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంతకాలం నిలుపుదల చేశారు. కాగా కేంద్రం మళ్లీ ఈ పథకాన్ని పునరుద్ధరింపజేసింది. ప్రస్తుతం సొసైటీల పరిధిలో యాక్టివ్‌గా ఉన్న మత్స్యకారులకు ఈ కార్డులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
చేప రైతుల(వ్యక్తిగతంగా, గ్రూపులు, భాగస్వాములు, కౌలుకు సాగు చేసే వారు)తో పాటు సెల్ఫ్‌హెల్ప్, జాయింట్ లైబలిటీ, మహిళా మత్స్యకార గ్రూపులు ఈ కార్డులు పొందేందుకు అర్హులుగా నిర్ణయించారు. అలాగే వర్కింగ్ కాపిటల్ కాంపొనెంట్‌తో సాగు చేసే మత్స్యకారులకు కూడా ఈ కార్డులు పొందేందుకు అర్హులు. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం సీడ్, ఫీడ్, ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, హార్వస్టింగ్స్, మార్కెటింగ్ చార్జీలు, ఆయిల్, విద్యుత్ చార్జీలు, ఐస్, ల్యాండింగ్ చార్జీలు లేబర్, లీజ్‌ల కోసం ఈ కార్డుల ద్వారా రుణ సౌకర్యం పొందవచ్చు.ఈ కార్డుల ద్వారా బ్యాంకుల నుంచి రూ.2లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంటుంది. చేపల పెంపకం, వేట, విక్రయాలకు అవసరమైన పరికరాల కొనుగోలుకు వినియోగించవచ్చు. అర్హులైన వారిని గుర్తిస్తున్నామని, జనవరి 1వ తేదీ నుంచి వారికి మత్స్యశాఖ తరఫున కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నట్టు మత్స్యశాఖ డీడీ రాఘవరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment