ప్రతిపాదనలు లేకుండా ప్రశ్నావళా? | Kishan reddy takes on central government over letter | Sakshi
Sakshi News home page

ప్రతిపాదనలు లేకుండా ప్రశ్నావళా?

Published Fri, Nov 8 2013 1:24 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

ప్రతిపాదనలు లేకుండా ప్రశ్నావళా? - Sakshi

ప్రతిపాదనలు లేకుండా ప్రశ్నావళా?

కేంద్రం తీరుపై కిషన్‌రెడ్డి మండిపాటు

రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం (జీవోఎం) 11 అంశాలపై స్పందనలు కోరుతూ రాజకీయ పార్టీలకు లేఖ రాయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తప్పుపట్టారు. ‘‘పార్టీల అభిప్రాయాలు కోరే ముందు కేంద్రం తన ప్రతిపాదనలేమిటో బయటపెట్టాలి. కానీ ఏ ప్రతిపాదనలు మా ముందు పెట్టకుండా... పాఠశాలలో పిల్లలకు ప్రశ్నపత్రం ఇచ్చినట్టు రాజకీయ పార్టీలకు ప్రశ్నావళిని ఇచ్చి అభిప్రాయాలను కోరింది. ఈ ప్రశ్నావళి ఏదో ముందు సీఎంకు, పీసీసీ అధ్యక్షుడికి పంపి వారి నుంచి అభిప్రాయాలు అందిన తర్వాత మిగతా పార్టీలను అడిగి ఉంటే బాగుండేది’’ అని ఆయన అన్నారు.  ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు తమ ముందు పెడితే తాము పరిష్కారాలు సూచిస్తామని, అసలు ప్రతిపాదనలే పెట్టకుండా అభిప్రాయాలు కోరడం అసమంజసమని బదులిచ్చారు.

గురువారమిక్కడ పార్టీ సీనియర్ నేత సీహెచ్.విద్యాసాగర్‌రావుతో కలిసి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందని, హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల తెలంగాణ తప్ప మరేదీ తమకు సమ్మతం కాదని, ఇతర పార్టీల్లాగా బీజేపీ మాట మార్చబోదని స్పష్టంచేశారు. ‘‘తెలంగాణ ఉద్యమం జరుగుతున్నా సోనియా నోరు తెరవరు. సీమాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్నా మాట్లాడరు’’ అని విమర్శించారు. తమ పార్టీ ప్రాంతాల విభజననే తప్ప ప్రజల మధ్య విభజనను కోరుకోవడం లేదన్నారు. ఓట్లు, సీట్ల కోసం రాజకీయ దృష్టితో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న పార్టీల వ్యూహాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. హైదరాబాద్, ఉద్యోగాలు, నీళ్లపై సీమాంధ్రులకు అనుమానాలున్నాయని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ వీటిని నివృత్తి చేసి తీరాలన్నారు. రాయలసీమ నాలుగు జిల్లాలను విడదీయరాదన్న సెంటిమెంట్ ప్రజల్లో ఉందని, దాన్ని తాము గౌరవిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులు విభజన తర్వాత కూడా ఇక్కడే ఉండవచ్చన్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు బీజేపీ కృషి చేస్తుందన్నారు. విద్యాసాగరరావు మాట్లాడుతూ.. పార్టీలను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, అందుకే తాము కాంగ్రెస్‌ని ఇరకాటంలో పెట్టే దిశగా ఆచితూచి అడుగులేస్తున్నామని చెప్పారు.
 జీవోఎంకు నేడు నివేదిక
 జీవోఎంకు బీజేపీ తరఫున నివేదికను శుక్రవారం పంపిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలోని కమిటీతో చర్చించి నివేదికను సిద్ధం చేశామని, పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడి శుక్రవారం దీన్ని హోంశాఖకు పంపుతామని వెల్లడించారు. ఈ మేరకు హోంశాఖను సమయం కూడా కోరామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement