సరైన ఫలితాలు సాధించలేకపోయాం: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోడీ అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ తాము తీసుకున్న కొన్ని నిర్ణయాలవల్ల రాష్ట్రంలో సరైన ఫలితాలు సాధించలేకపోయామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారమిక్కడ బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అవినీతి, అక్రమాల పాలనతో విసుగెత్తిన ప్రజలు ఈ ఎన్నికల్లో సరైన ప్రజాతీర్పును వెల్లడించారని అన్నారు.
ఈ ఎన్నికల్లో తెలంగాణలో తాము ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని అంగీకరించారు. ఓటమికి దారితీసిన అంశాలపై చర్చిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఎన్నికలను గమనిస్తే తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ అధికంగా ఉందని, అది టీఆర్‌ఎస్‌కు బాగా అనుకూలించిందని ఆయన అభిప్రాయపడ్డారు. 2019లో బలమైన శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం లభించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.