ఆపరేషన్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ (ఫైల్)
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో 20 రోజులుగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు జరగటం లేదు. ఆపరేషన్ థియేటర్ కొరత వల్ల ఈ ఆపరేషన్లు నిలిపివేసినట్లు వైద్యులు చెబుతున్నారు. సుమారు 500 మంది రోగులు ఆపరేషన్‌ల కోసం పేర్లు నమోదు చేయించుకుని సిద్ధంగా ఉన్నారు. కొంత మంది కీళ్ల బాధితులు తమ పేర్లు నమోదు చేయించుకుని ఆరు నెలలు గడిచినా తమకు ఆపరేషన్ చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. రెండేళ్లుగా ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్స్ సమస్య ఉన్నా ఆస్పత్రి అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కిడ్నీ, మోకీళ్ల మార్పిడికి ఒకటే థియేటర్!
డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లో నాలుగు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. సుమారు రూ.3 కోట్లతో నిర్మించిన ఈ థియేటర్స్‌లో రెండు ఆపరేషన్ థియేటర్స్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు. ఒక ఆపరేషన్ థియేటర్‌లో న్యూరోసర్జరీ ఆపరేషన్లు చేస్తున్నారు. ఒక ఆపరేషన్ థియేటర్‌లో మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు, కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నారు. ఒకే ఆపరేషన్ థియేటర్‌లో కిడ్నీ, మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయటంతో ఇన్‌ఫెక్షన్లు వస్తాయని కిడ్నీ ఆపరేషన్లు లేదా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు నిలిపివేస్తున్నారు. ఇలా 20 రోజులుగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు నిలిపివేయటంతో కీళ్ల నొప్పుల బాధితులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ప్రభుత్వ నిధులు కోసం ఎదురుచూపులు...
ప్రభుత్వం ఆపరేషన్లు చేసేందుకు జీజీహెచ్‌కు అదనంగా నిధులు మంజూరు చేయలేదు. దీంతో వైద్యులు ఆపరేషన్ల కోసం పేర్లు నమోదు ప్రక్రియ కూడా నిలిపివేశారు. రాష్ట్రంలో ఉచితంగా గుంటూరు జీజీహెచ్‌లో మాత్రమే మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయి. దీంతో ఇతర ప్రాంతాలకు చెందిన రోగులు సైతం గుంటూరుకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వం గుంటూరుతోపాటుగా కర్నూలు, విశాఖపట్నం ప్రభుత్వ ఆస్పత్రులకు 2017 మే నెలలో నిధులు విడుదల చేసింది. కాని నేటి వరకు ఆ రెండు ఆస్పత్రుల్లో ఆపరేషన్లు ప్రారంభం కాలేదు. వారికి కేటాయించిన నిధులను గుంటూరుకు జీజీహెచ్‌కు ప్రభుత్వం బదిలీ చేయటం ద్వారా పేద రోగులకు ఇబ్బంది లేకుండా గుంటూరు వైద్యులు ఆపరేషన్లు చేసే అవకాశం ఉంటుంది.
సాక్షి కథనంతో ఆపరేషన్లు ప్రారంభం...
జీజీహెచ్‌లో 2015 ఆగస్టులో ఎలుకల దాడిలో పసికందు మరణంతో ఆస్పత్రి ప్రతిష్ట మసకబారింది. ఆస్పత్రిపై పేదలకు నమ్మకం కల్పించేందుకు మాజీమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గుంటూరు జీజీహెచ్‌లో 2016 జనవరి 23న మోకీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. కేవలం ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగిందన్న పేరు తప్ప వైద్యులు, వైద్యపరికరాలన్ని ప్రైవేటు వైద్యులు సహకారంతో సమకూరాయి. దీనిపై ‘సాక్షి’ విమర్శనాత్మకంగా కథనాలు ప్రచురించడంతో ‘ తనకు జరిగిన ఆపరేషన్, కార్పొరేట్ వైద్యాన్ని ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు కూడా ఉచితంగా అందేలా చేస్తాను’ అంటూ డాక్టర్ కామినేని వాగ్దానం చేశారు. చాలా మంది పేద రోగులు ఆసుపత్రికి ఆపరేషన్ల కోసం క్యూ కడుతున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటంతో సాక్షి వరుస కథనాలు ప్రచురితం చేయటంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి 2017 మే నెలలో రూ.65 లక్షల నిధులను విడుదల చేసింది. ప్రభుత్వ నిధులతో 26–7–2017 నుంచి సర్జరీలను నిర్వహిస్తున్నారు.
ఉన్నతి ఫౌండేషన్‌తో ఉచితంగా ఆపరేషన్లు....
గుంటూరు బీఎంఆర్ మల్టీస్పెషాలిటీ హాస్పటల్స్ అధినేత, ప్రముఖ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి జీజీహెచ్‌కు వచ్చే పేద రోగులకు ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారు. ఆపరేషన్‌లు చేయడంతోపాటుగా సుమారు రూ.20 లక్షల ఖరీదు చేసే ఇంప్లాంట్లను సైతం జీజీహెచ్‌కు విరాళంగా ఇచ్చి 20 మందికి తన సొంత ఖర్చుతో ఆపరేషన్లు చేశారు. బీఎంఆర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్టుకు చెందిన ఉన్నతి ఫౌండేషన్ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారు. దాత వచ్చి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నా ప్రభుత్వం నిధులను మంజూరు చేయకుండా, ఆస్పత్రి అధికారులు ఆపరేషన్ థియేటర్ నిర్మాణం చేయకుండా జాప్యం చేస్తూ రోగులు ఇబ్బంది పడేలా చేయటం విమర్శలకు తావునిస్తుంది.
కిడ్నీ ఆపరేషన్ల వల్ల నిలిపివేశాం
గత 20 రోజులుగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తూ ఉండటంతో మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు నిలిపివేశాం. ఆస్పత్రిలో విజయవంతంగా 74 మందికి ఆపరేషన్లు చేశాం. మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ నిర్మాణం చేసేందుకు నాట్కో ఫార్మా కంపెనీ వారు ముందుకొచ్చారు. ఆపరేషన్ థియేటర్ నిర్మాణం జరిగితే నిరంతరంగా ఆపరేషన్లు చేస్తాం. మోకీళ్లనొప్పుల బాధితులు 500 మంది తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. ఆస్పత్రిలో మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు బుధవారం, శనివారం చేస్తున్నాం. ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అదనంగా బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశాం.– డాక్టర్ గంటా వరప్రసాద్,ఆర్థోపెడిక్ వైద్య విభాగాధిపతి
Comments
Please login to add a commentAdd a comment