సాక్షి, అమరావతి బ్యూరో: అరచేతిలో పట్టేంత కత్తితో ప్రాణాలు తీయవచ్చా... అంటే అవును సాధ్యమే అని చరిత్ర చెబుతోంది. పోలీసు శిక్షణ తరగతుల సిలబస్ సైతం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అరచేతిలో పట్టేంత చిన్న విచ్చుకత్తి విష సంస్కృతికి సుదీర్ఘ చరిత్ర ఉంది. అప్పట్లో భారతీయ రాజులను అంతమొందించేందుకు బ్రిటీష్ పాలకులు వీటిని భారత్‌లోకి తీసుకువచ్చారు. బ్రిటీష్ పరిపాలన అంతమైనా ఆ విష సంస్కృతి అవశేషాలు ఇంకా దేశంలో మిగిలే ఉన్నాయి.
విచ్చు కత్తుల విష సంస్కృతికి పుట్టినిల్లు మధ్య ఆసియా దేశం ఆర్మేనియా. అరచేతిలో పట్టేంత చిన్న కత్తులతో ప్రత్యర్థి ప్రాణాలు సులువుగా తీయడంలో ఆర్మేనియాలోని ఓ తెగ ప్రజలు సిద్ధహస్తులు. కేవలం నిమిషంలో 70 కత్తులను విసరగలడం వారి నైపుణ్యానికి నిదర్శనం. బ్రిటీష్ పాలకులు ఆర్మేనియా నుంచి పెద్ద సంఖ్యలో విచ్చుకత్తుల నిపుణులను దేశంలోకి తీసుకువచ్చారు. ప్రధానంగా మెడపైన దాడి చేసి సులువుగా ప్రాణాలు తీసేవారు. ఉత్సవాలు, జాతరలు జరుగుతుండగా చడీ చప్పుడు కాకుండా వచ్చి హత్య చేసి వెళ్లిపోయేవారు. ఎవరు హత్య చేశారో.. ఎలా చేశారో కూడా అంతుబట్టకుండా ఉండేది.
నేర పరిశోధనలో...
బ్రిటిష్ పాలనలోనే దేశంలో ఈ విచ్చుకత్తుల విద్య బాగా వెళ్లూనుకుంది. ఆ తర్వాత కూడా ఆర్మేనియా వాసులు కొందరు ఇక్కడే స్థిరపడ్డారు. వారిలో ఎక్కువమంది దారిదోపిడీ దారులుగా, నేరస్తులుగా మారారు. తూర్పు తీరం వెంబడి అనేక హత్యలు, ఇతర నేరాల్లో ఈ విచ్చుకత్తులతో దాడి ప్రధానంగా ఉండేది. దాంతో అప్పటి మద్రాసు ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. వీటి గురించి మద్రాసు రాష్ట్ర మినిస్టీరియల్, పోలీసు గైడ్‌లో ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం. నేర పరిశోధనకు సంబంధించి పోలీసు అధికారులకు శిక్షణలో కూడా విచ్చుకత్తులతో దాడులు, హత్యల గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తారు. మెడపైనా, మెదడుకు సమీపంలో ఉండే నాడీ వ్యవస్థపైనా విచ్చుకత్తితో దాడి చేయడం ద్వారా అంతమొందించేవారు.
ఇలాంటి కేసులను ఎలా విచారించాలన్న దానిపై పోలీసులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు కూడా. తాజాగా రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగినహత్యాయత్నంతో విచ్చుకత్తుల అంశం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. వై.ఎస్.జగన్‌పై జరిగింది విచ్చుకత్తి దాడేనని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. నిపుణులైన కిరాయి హంతకుల ప్రణాళిక ప్రకారమే పకడ్బందీగా ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని స్పష్టమవుతోందని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. ఈ హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావు వెనుక పెద్ద శక్తులే ఉన్నాయని తెలుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని వెనుక ఉన్న కుట్ర కోణాన్ని ఛేదిస్తేనే అసలు సూత్రధారుల పాత్ర బట్టబయలు అవుతుందన్నారు. అయితే రాజకీయ ఒత్తిడికి తలొగ్గే పోలీసు శాఖ అంతటి పారదర్శకంగా దర్యాప్తు కొనసాగించగలదా అని కూడా ఆయన సందేహం వ్యక్తం చేశారు.
విచ్చుకత్తితో క్షణాల్లో ప్రాణాలు హరీ...
Published Mon, Oct 29 2018 4:23 AM | Last Updated on Mon, Oct 29 2018 4:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment