కేట్యాక్స్‌ ఖాతాలో రిజిస్ట్రార్‌ కార్యాలయం | Kodela Siva Prasad Rao Irregularities In Narasaraopet | Sakshi
Sakshi News home page

కేట్యాక్స్‌ ఖాతాలో రిజిస్ట్రార్‌ కార్యాలయం

Published Fri, Aug 30 2019 9:07 AM | Last Updated on Fri, Aug 30 2019 9:07 AM

Kodela Siva Prasad Rao Irregularities In Narasaraopet - Sakshi

నూతన రిజిస్ట్రార్‌ కార్యాలయ భవనం 

సాక్షి, నరసరావుపేట(గుంటూరు) : ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబ ధనదాహానికి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యాయి. కాంట్రాక్టర్‌ నుంచి వచ్చే కమీషన్‌ల కోసం జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయ భవనాన్ని ముంపు ప్రాంతం అయిన వాగు పోరంబోకు స్థలంలో నిర్మించారు. ఎటువంటి అనుమతులు లేకున్నా అప్పటి అధికార పార్టీ నాయకుల ఒత్తిడి కారణంగా అధికారులు నిబంధనలను కాలరాశారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందన్న సాకు చూపి నిర్మాణ పనులు పూర్తి కాక ముందే భవనాన్ని ప్రారంభించారు. కోట్ల రూపాయలతో నిర్మించిన రిజిస్ట్రార్‌ కార్యాలయ భవనాన్ని నేడు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

వివాదాల కేంద్రం..
నరసరావుపేట జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయ శాశ్వత భవనం మొదటి నుంచి వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ప్రస్తుతం ప్రకాష్‌ నగర్‌లోని అద్దె భవనంలో జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంతో పాటు రెండు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. అయితే శాశ్వత భవనంలో రిజిస్ట్రార్‌ కార్యాలయం నిర్మించాలన్న ఉద్దేశంతో పట్టణ శివారు స్టేడియం వెనుక భాగంలో భవన నిర్మాణానికి నాలుగేళ్ల కిందట స్థలాన్ని కేటాయించారు. వాగు పోరంబోకు స్థలంలో సుమారు రూ.3 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించారు. వాస్తవానికి ప్రభుత్వ వాగులు, చెరువులు, కుంటలు తదితర వాటిలో ఎటువంటి భవన నిర్మాణాలు చేపట్టరాదని దేశ ఉన్నత న్యాయస్థానం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఒక వేళ నిర్మించాలంటే ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అనుమతి తీసుకొని జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదించాలి.

ప్రభుత్వం ప్రత్యేక మైన జీవో ద్వారా అనుమతులు ఇవ్వాల్సి ఉంది. దీంతో పాటు ఒక శాఖ నుంచి మరో శాఖకు భూమి బదలాయిస్తున్నట్లు ఉత్తర్వులు అందించాలి. దీనికి సంబంధించి మార్కెట్‌ విలువను అవసరాల కోసం భూమి తీసుకున్న శాఖ చెల్లించాలి. అదే విధంగా పట్టణ పరిధిలో భూమి ఉన్న కారణంగా భవన నిర్మాణానికి మున్సిపల్‌ అనుమతులు అవసరం. అయితే అవేమి జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయ భవన విషయంలో చోటు చేసుకోలేదు. అంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనేది జగమెరిగిన సత్యం. కేవలం మాజీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు డాక్టర్‌ శివరామ్‌ అవినీతి ముందు నిబంధనలు అన్నీ నలిగిపోయాయి. 

పొంచి ఉన్న ముప్పు..
భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ముంపు ప్రాంతం కావటంతో పక్కనే ఉన్న వాగు పొంగి నూతనంగా నిర్మించిన జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం నీటమునిగే ప్రమాదం ఉంది. గతంలో కురిసిన భారీ వర్షాలకు కార్యాలయ పరిసరాలు నీట మునిగి ఆ ప్రభావం రెండు మూడు రోజుల వరకు ఉండేది. దీంతో పాటు నిత్యం కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు ఉన్న కారణంగా పట్టణ శివారు ఏర్పాటు చేసిన కార్యాలయంతో ప్రజల సొమ్ముకు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ముందస్తు అనుమతులు లేకుండా ముంపు ప్రాంతంలో నిర్మించినందున పర్యావరణ పరిరక్షణ శాఖ ఏ క్షణంలోనైనా కార్యాలయాన్ని కూల్చివేసే అవకాశం లేకపోలేదు.

స్వలాభం కోసం కార్యాలయ నిర్మాణం.. 
రిజిస్ట్రార్‌ కార్యాలయం నిర్మించిన కాంట్రాక్టర్‌ నుంచి కోడెల శివరామ్‌ కమీషన్‌ రూపంలో రూ.50 లక్షల వరకు కే ట్యాక్స్‌ వసూలు చేసినట్లు సమాచారం. కేవలం తన కమీషన్‌ కోసం ముంపు ప్రాంతం కార్యాలయాన్ని ఏర్పాటు చేయించాడు. అప్పటి అధికారులు కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేసినా బెదిరించి నిర్మాణ పనులు చేయించినట్లు తెలిసింది. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్‌లకు సుదూర ప్రాంతంలో నిర్మించిన రిజిస్ట్రార్‌ కార్యాలయానికి క్రయ, విక్రయదారులు సేవల కోసం వెళ్లాలంటే ఆర్థిక భారాన్ని మోయాల్సి ఉంది. పట్టణ నడిబొడ్డున అనేక ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో రిజిస్ట్రార్‌ కార్యాలయం నిర్మాణం చేపట్టలేదు. నూతన రిజిస్ట్రార్‌ కార్యాలయానికి సమీపంలో కోడెల శివరామ్‌కు చెందిన వందలాది ఎకరాల భూములు ఉన్న కారణంగా వాటి విలువను పెంచుకోవాలన్న ఉద్దేశంతో ముంపు ప్రాంతంలో నిబంధనలకు వ్యతిరేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు విమర్శలు లేకపోలేదు. 

మార్పుకు అనేక చిక్కులు..
ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని నిర్మాణం పూర్తి అయిన నూతన భవనంలోకి మార్చాలంటే అనేక చిక్కులు తలెత్తుతున్నట్లు సమాచారం. భూమిని రిజిస్ట్రేషన్‌ శాఖకు బదలాయిస్తున్నట్లు గత టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో పాటు భవన నిర్మాణానికి మున్సిపల్‌ శాఖ అనుమతులు తీసుకోలేదు. ముఖ్యంగా లోతట్టు వాగు పోరంబోకు భూమికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రత్యేక జీవో విడుదల కాలేదు.  ఈ సమస్యల కారణంగా కార్యాలయ మార్పులో జాప్యం చోటు చేసుకుంటున్నట్లు ఉద్యోగ వర్గాల ద్వారా తెలియవచ్చింది. అయితే జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయ వ్యవహారంలో జరిగిన అక్రమాలపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కోడెల శివరామ్‌ పుణ్యామా అంటూ కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా అయ్యిందని పలువురు చర్చించుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement