
కొలిక్కిరాని కేసు
సాక్షి, గుంటూరు : రాజధాని ప్రాంతంలోని పంట పొలాల్లో దుండగులు కార్చిచ్చు పెట్టిన ఘటనపై విచారణ ఓ కొలిక్కి రాకపోవడంతో పోలీస్ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. తుళ్ళూరు, తాడేపల్లి మండలాల్లోని ఆరు గ్రామాల్లో పంటపొలాల్లో వెదురు బొంగులు, పాకలు, డ్రిప్ పైపులు, నెట్‌లు వంటి సామగ్రిని దుండగులు దహనం చేసిన విషయం విధితమే. గత ఏడాది డిసెంబర్ 29వ తేదీనజరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఈ విషయం తెలుసుకున్న గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు రాజేష్‌కుమార్, పీహెచ్‌డీ రామకృష్ణలు హుటాహుటిన సంఘటనా స్థలాలను పరిశీలించి నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. పది ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేసినా ఉపయోగం లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని సెల్ టవర్‌ల వివరాలు సేకరించారు. ఘటన జరిగిన ప్రాంతాల్లో ఆ సమయంలో వెళ్లిన కాల్‌లిస్ట్‌లను పరిశీలించారు. వీటి ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పోలీసుల అదుపులో పెనుమాక వాసులు..
నిందితుల సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షలు రివార్డు ఇస్తామని ఐజీ సునీల్‌కుమార్ ప్రకటించినా ఎటువంటి సమాచారం లేకపోవడంతో పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఓవైపు ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగానే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో బందోబస్తు ఏర్పాట్లు తలనొప్పిగా మారాయి.
ఇది రాజకీయ కోణంలో ఏమైనా జరిగిందా అనే అనుమానంతో రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల ఫోన్‌లను సైతం టాప్ చేస్తున్నట్లు తెలిసింది. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని తుళ్ళూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
రంగంలోకి దిగిన ఐజీ..
నిందితులెవరో తేలకపోవడంతో గుంటూరు రేంజి ఐజీ పి.వి.సునీల్‌కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. శనివారం తన కార్యాలయంలో ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలతో కేసు విషయమై సమావేశమయ్యారు. అనంతరం తుళ్ళూరు పోలీస్‌స్టేషన్‌కు వె ళ్లి దర్యాప్తు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేసినట్లు తెలిసింది.
ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న గ్రామాల్లో ముందుగానే పరిస్థితిని గమనించి బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు ఎస్పీలతో కలసి త్వరలో ఆయన గ్రామాలను సందర్శించనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఐజీ మాట్లాడుతూ పంటల దహనం కేసుకు సంబంధించి తమ వద్ద కొంత సమాచారం ఉందని, దర్యాప్తు దశలో ఏమీ చెప్పలేమని అన్నారు.