శ్రీపర్రు పరిసరాల్లో అభయారణ్యంలో తవ్విన అక్రమ చెరువులు
కొల్లేరుపై కొంగలకు బదులు దొంగలు వాలుతున్నారు. దొంగజపం చేస్తున్నారు. యథేచ్ఛగా అక్ర మాలకు పాల్పడుతున్నారు. గత ఐదేళ్లూ కొల్లేరు ప్రాంతాన్ని ఇష్టారాజ్యంగా దోచుకున్న టీడీపీ నేతలు ఇంకా చెరువులను అక్రమంగా తవ్వేస్తున్నారు.
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : దోపిడీని అడ్డుకుంటే దొంగలు ఏం చేస్తారు? సామ దాన, భేద దండోపాయాలు ఉపయోగిస్తారు. ఏదేమైనా తాము అనుకున్నది సాధించాలనుకుంటారు. సరిగ్గా ఇలాగే ఇప్పుడు కొల్లేరులో చెరువులు అక్రమంగా తవ్వేందుకు టీడీపీ నేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. ఐదేళ్ల పాటు కొల్లేరును కొల్లగొట్టి వేలాది చెరువులు తవ్విన వారు ఇప్పుడు సొసైటీ జపం చేస్తున్నారు. ఆ పేరుతో అభయారణ్యం పరిధిలో యథేచ్ఛగా చెరువుల తవ్వకాలు సాగించేస్తున్నారు. సొసైటీ సభ్యులను మభ్యపెట్టి అదే చెరువులను లీజుకు తీసుకుంటూ ఒప్పందాలు రాయించుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకపక్క అటవీశాఖ అధికారులు కొల్లేరులో అక్రమ చెరువులు కొట్టేస్తుంటే, మరోపక్క టీడీపీ నేతలు అడ్డదారుల్లో చెరువులు తవ్వేస్తున్నారు. అధికారం చేజారినా వారి అరాచకాలు ఆగడం లేదు.
వంద ఎకరాల విస్తీర్ణంలో చెరువుల తవ్వకం
తాజాగా పది రోజుల కిందట ఏలూరు మండలం శ్రీపర్రు పెట్రోల్ బంకు పక్క రోడ్డు శివారు 2 కిలోమీటర్ల దూరంలో 100 ఎకరాల విస్తీర్ణంలో రెండు పెద్ద చెరువులను ఓ టీడీపీ నేత తవ్వేశారు. తవ్వకాలకు ముందురోజు గుట్టు చప్పుడు కాకుండా, పొక్లెయిన్లు, బ్లేడ్ ట్రాక్టర్లు అభయారణ్యంలో మోహరించారు. సరిగ్గా ఇదే సమయంలో అటవీశాఖ అధికారులు తమ సిబ్బందితో కలిసి మొండికోడు పరిసరాల్లో అక్రమ చెరువులకు గండ్లు కొడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు తమ అనుచరులతో కలిసి శ్రీపర్రులో అక్రమ తవ్వకాలు ప్రారంభించారు. ఏకబిగిన మూడు రోజులపాటు గుట్టు చప్పుడు కాకుండా పగలు, రాత్రి వేళల్లో యథేచ్ఛగా తవ్వకాలు సాగించారు.
సుమారు 200 మీటర్ల మేరకు పెద్ద ఎత్తున గట్లు వేసి విశాలమైన రెండు భారీ చెరువులు తవ్వేశారు. కొల్లేరు ప్రక్షాళన సందర్బంగా 2007లో అప్పటి కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు ఈ చెరువులను ధ్వంసం చేశారు. అయితే సొసైటీ పేరుతో ఇప్పుడు వీటిని టీడీపీ నేతలు మళ్లీ తవ్వేశారు. ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల చొప్పున చేపల వ్యాపారులకు లీజుకు కట్టబెట్టేందుకు యత్నాలు చేపట్టారు. ఇదే మాదిరి టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఏలూరు మండలంలో మొండికోడు, శ్రీపర్రు, కలకుర్రు, మానూరుతోపాటు భీమడోలు, ఉంగుటూరు, పెదపాడు మండలాల పరిధిలో ఉన్న అభయారణ్యంలో వేలాది ఎకరాల్లో చెరువులు తవ్వేశారు. ఇటీవల అటవీశాఖ అధికారులు చేపట్టిన సర్వేలోనూ సుమారు 9 వేల ఎకరాల్లో అక్రమ చెరువులు తవ్వినట్టు నిర్ధారణ అయింది.
తిరగబడుతున్న కొల్లేరు ప్రజలు
ఇటీవల లీజు ఒప్పందం పేరుతో కోమటిలంకలో చెరువులు కబ్జా చేసేందుకు యత్నించిన టీడీపీ మండల నాయకుడు నేతల రవి, ఆయన అనుచరులను గ్రామ యువకులు అడ్డుకున్నారు. తమ చెరువుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. కొద్దిరోజుల క్రితం నేతల రవి కోమటిలంక పెద్దలను కైకులూరులోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కు తీసుకెళ్లాడు. మద్యం, విందుతో పెద్దలను మచ్చిక చేసుకుని గ్రామంలో చెరువులను తనకు లీజుకు ఇచ్చినట్టు రాయించుకున్నాడు. ఎకరం రూ.లక్ష లీజు పలికే చెరువును కేవలం రూ.25 వేల చొప్పున ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోమటిలంక యువకులు టీడీపీ నేతలను నిలదీశారు. అధికారం పోయినా తమ గ్రామాన్ని పీడిస్తూనే ఉంటారా అంటూ ఎదురు తిరిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ రేగడంతో కొట్లాట జరిగింది. యువకులు టీడీపీ నేతలను ఊరు నుంచి తరిమికొట్టారు. ఈ ఘటన ఇతర గ్రామాల ప్రజలకూ తెలిసింది. దీంతో కొల్లేరు వాసులు టీడీపీ నేతలను గ్రామాల్లోకి రానీయకూడదని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment