అధికారముందని మిడిసిపడొద్దు: కొణతాల
సాక్షి, హైదరాబాద్: చేతిలో అధికారముందని ముఖ్యమంత్రి చంద్రబాబు మిడిసి పడుతున్నారని, నియంతలాగా పాలించిన వారు ఎందరో చరిత్రలో కలిసి పోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యానికి పాతర వేసి ఆటవిక పాలన సాగిస్తున్నారని అన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల్లో అధికారులు, పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడటం, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ముస్తఫా, సీనియర్ నేత అంబటి రాంబాబుపై పట్ట పగలే దాడి చేయడం వంటి సంఘటనలు బీహార్, యూపీ తరహా మాఫియా రాజకీయాలను తలపిస్తున్నాయని చెప్పారు.
గుంటూరు జిల్లాలో శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నియోజకవర్గ పరిధిలోని మహిళా ఎంపీటీసీల పట్ల టీడీపీ గుండాలు దురుసుగా వ్యవహరించి ఎత్తుకెళ్లారని, రాజకీయాల్లోకి తామెందుకు వచ్చామా అని ఆ మహిళలు బాధపడేలా చంద్రబాబు పాలన సాగుతోందని దుయ్యబట్టారు. ఈ చర్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అడుగడుగునా పోలీసులు, ప్రభుత్వాధికారులు టీడీపీ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నారని, వారి సమక్షంలోనే జెడ్పీటీసీలను ఎత్తుకెళ్లడాలు, దౌర్జన్యాలకు దిగడాలు జరుగుతున్నాయని చెప్పారు. పోలీసులు, అధికారులకు టీడీపీ యూనిఫాంను తొడిగించి పనులు చేయించుకుంటే సరిపోతుందని అన్నారు.