కొణతాల ఇప్పటికీ మా పార్టీ నేతే: పద్మ
హైదరాబాద్: కొణతాల రామకృష్ణ ఇప్పటికీ తమ పార్టీ నేతే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. ఆయన వెళ్లిపోతారన్న విషయంపై తాను ఇప్పటికీ నమ్మడం లేదని తెలిపారు. పార్టీకి కొణతాల రామకృష్ణ రాజీనామా అంటూ మీడియాలోనే తాను చూశానని వెల్లడించారు. ఈ అంశంపై తనకు సమాచారం లేదన్నారు. ఓ వేళ పార్టీలో ఏదైనా ఇబ్బంది ఉన్న టీ కప్పులో తుపానులా సమస్య తీరిపోతుందని చెప్పారు. మంగళవారం హైదరాబాద్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ పార్టీకి రాజీనామా చేశారని మీడియాలో కథనాలు వస్తున్నాయని విలేకర్ల ప్రశ్నంచగా అందుకు ఆమెపై విధంగా స్పందించారు.
ఈ సమావేశంలో వాసిరెడ్డి పద్మ ఇంకా ఏం మాట్లాడారంటే... అదనంగా మద్యం దుకాణాలు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తుందిని ఆమె ఆరోపించారు. ఈ ఆలోచనను విరమించుకోవాలని పద్మ... టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆలోచనను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. అదనపు మద్యం దుకాణాల ఏర్పాటుతో పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు చిన్నాభిన్నమవుతాయని ఆమె అవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే బెల్టుషాపులు ఎత్తేస్తామన్న చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శించారు. మద్యం ద్వారా ప్రజల జీవితాలతో చెలగాటమాడి ఖజానా నింపుకోవడానికి చేసే ప్రయత్నాలను తమ పార్టీ చూస్తూ ఊరుకోబోదని టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.