పాలకొల్లు :మూడో పంటకు సైతం పుష్కలంగా సాగునీరు అందిస్తామన్న ప్రభుత్వం దాళ్వా నారుమడుల దశలోనే చేతులెత్తేసి రైతులను నట్టేట ముంచుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ధ్వజమెత్తారు. ముందు గా ప్రకటించిన ప్రకారం దాళ్వాకు పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా చేయాలని.. లేదంటే రైతులతో కలసి పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డెల్టాకు పూర్తి స్థాయిలో నీరివ్వాలనే డిమాండ్‌తో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పాలకొల్లు టాక్సీ స్టాండ్ సెంటర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన రైతు సదస్సుకు అన్నదాతలు పోటెత్తి వచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్తపల్లి మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంతో జిల్లాను ఎడారిగా మార్చడం అన్యాయమన్నారు. రైతులకు నిత్యం అండగా ఉండాలని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నాయకులను ఆదేశించారని చెప్పా రు. ఆ నేపథ్యంలోనే పాలకొల్లు నీటిపారుదల శాఖ కార్యాలయం వద్ద రైతులు చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ మేకా శేషుబాబుపైన, పార్టీ నాయకులపైన కేసులు పెట్ట డం దారుణమన్నారు.
డెల్టా ప్రాంతంలో ఎన్నడూలేని విధంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఇందుకు ప్రభుత్వ విధానాలే కారణమని ధ్వజమెత్తారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల రైతులకు నష్టమే తప్ప ఏమాత్రం ప్రయోజనం లేదని వైఎస్సార్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్, లోక్‌సత్తా పార్టీలతోపాటు రైతు సంఘాల నాయకులు మొరపెట్టుకున్నా చంద్రబాబు పెడచెవిన పెట్టారన్నారు. రైతుల ప్రయోజనాలను గాలికొదిలి ముడుపుల కోసం పట్టిసీమ పథకం నిర్మించారని విమర్శించారు. ఎత్తిపోతలు నిర్మిం చకపోతే నీటికోసం ఒడిశా రాష్ట్రాన్ని ప్రాధేయపడాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు.
రైతుల్ని గాలికొదిలేస్తారా : శేషుబాబు
ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ దాళ్వాకు పుష్కలంగా నీరందిస్తామన్న ప్రభుత్వం రైతుల్ని గాలికొదిలేసిందని దుయ్యబ ట్టారు. భారీ వర్షాల కారణంగా సార్వా పంట నష్టపోయిన వారికి ఇన్‌పుట్ సబ్సిడీ, సబ్సిడీపై విత్తనాలు అందిస్తామన్న ప్రభుత్వం మొహం చాటేసిందన్నారు. పూర్తిగా నీరిస్తామని ప్రగల్భా లు పలికిన ప్రజాప్రతినిధులు నారుమడులు ఎండిపోతున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతుల ఇబ్బందులపై అసెంబ్లీలో చర్చించలేదని, సమస్యలను గాలికొదిలి అన్నివర్గాల వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీతోపాటు అన్ని కుంభకోణాల్లోనూ టీడీపీ నాయకులు పీకల్లోతు కూరుకుపోయారని, అధికారులపై దౌర్జన్యాలకు దిగుతున్నారని దుయ్యబట్టారు.
రుణమాఫీ పేరుతో అప్పుల ఊబిలోకి నెట్టారు
ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ హామీ నెరవేర్చకపోగా.. కొత్త రుణాలు కూడా ఇవ్వకుండా దగా చేశారన్నారు. దీనివల్ల రైతులు ప్రైవేటు అప్పుల ఊబిలో కూరుకుపో అష్టకష్టాలు పడుతున్నారన్నారు. లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్లే డెల్టాలో సాగునీటి ఎద్దడి తలెత్తిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి జపం చేయడం తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ రైతులందరికీ పూర్తిస్థాయిలో సాగునీరందించే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ నాయకులు ధనార్జనకు పరిమితమై ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. ముం దుగా ప్రకటించిన ప్రకారం దాళ్వాకు పూర్తిస్థాయిలో నీరందించాలని డిమాండ్ చేశారు.
సీపీఐ నాయకుడు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ దాళ్వాకు పూర్తిగా నీరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం నాట్ల సమయంలోనే రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. పైరు పెరిగిన తరువాత పరిస్థితి మరెంత దుర్భరంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు కొయ్యే మోషేన్‌రాజు, చెల్లెం ఆనందప్రకాష్, నడపన సత్యనారాయణ, పాతపాటి సర్రాజు, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, వందనపు సాయిబాలపద్మ, తలారి వెంకట్రావు, గుణ్ణం నాగబాబు, యడ్ల తాతాజీ, గుణ్ణం సర్వారావు, బీసీడీఎఫ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మేకా పార్వతి, జిల్లా అధ్యక్షురాలు కటిక శ్రీదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేకా శ్రీనివాస్, దాసరి అంజిబాబు, చినిమిల్లి గణపతిరావు పాల్గొన్నారు.
ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు నివాళి
అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడిన డెల్టా రైతులు చేగొండి నాగబాబు, చినిమిల్లి చంద్రరావుకు వైఎస్సార్ సీపీ నాయకులు నివాళులు అర్పించారు. సభా వేదికపై వారి చిత్రపటాలను ఉంచి ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
దాళ్వాకు నీరిస్తే సరి.. లేదంటే పోరే మరి
Published Thu, Dec 31 2015 12:48 AM | Last Updated on Tue, May 29 2018 4:23 PM
Advertisement