కలెక్టర్ ఇంతియాజ్
సాక్షి, విజయవాడ: గ్రామ వలంటీర్ల నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ వలంటీర్ల నియమకాలు పారదర్శకంగా జరిగాయని, జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ‘మండల కేంద్రాలలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. జులై 1న ప్రారంభమైన స్పందన కార్యక్రమంలో ఇప్పటి వరకూ 600 -7000 వరకు అర్జీలు వచ్చాయి. ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం సాధ్యమవుతుంది. దీనికి సంబంధించిన డేటాను సాధికారిక సర్వే, స్పందన, గ్రామ వలంటీర్ల ద్వారా తీసుకుంటామ’ని ఆయన తెలిపారు.
‘సాధారణ ఎన్నికల్లో జిల్లా సిబ్బంది పూర్తి సహకారం అందించారు. స్పందన, నవరత్నాల అమలులో జిల్లా యంత్రాంగం ముందంజలో ఉంది. ‘నేను సైతం కృష్ణమ్మ శుద్ధి’ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ‘మన విజయవాడ’ పేరుతో యాంటీ ప్లాస్టిక్ డ్రైవ్ చేపడుతున్నాము. విజయవాడను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. నేను సైతం ప్రోగ్రాం ద్వారా 23 రైతు బజార్లలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించామ’ని పేర్కొన్నారు.
నగరంలోని సమస్యలపై ఇంతియాజ్ స్పందిస్తూ.. ‘బెంజి సర్కిల్ అంశం గురించి కేంద్రానికి లేఖ రాశాను. కేంద్రం నిధులు విడుదల చేయగానే బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ పనులు వేగవంతం చేస్తాం. ఏ.కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి పెన్షన్లు మంజూరు చేయించాం. అదే విధంగా 9 ఆర్వో వాటర్ ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తున్నామని’ తెలిపారు. నూజివీడు మిర్జాపురం రైతుల ధర్నాపై ఇప్పటికే సబ్ కలెక్టర్‌కు సూచనలు చేశామన్నారు. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని ఇంతియాజ్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment