లక్ష్మీదేవిని లాకర్లో పెడితే ఎలా? | Krishna Collector Imtiaz Review Meeting With Officers | Sakshi
Sakshi News home page

లక్ష్మీదేవిని లాకర్లో పెడితే ఎలా?

Published Fri, Sep 27 2019 12:02 PM | Last Updated on Fri, Sep 27 2019 12:02 PM

Krishna Collector Imtiaz Review Meeting With Officers - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, పక్కన ప్రజాప్రతినిధులు

సాక్షి, మచిలీపట్నం(కృష్ణా) : ‘రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన వరుణుడు రాష్ట్రంపై చల్లని చూపు చూస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులు, రిజర్వాయర్లన్నీ జలకళతో తొణికిసలాడుతున్నాయి. బీడు వారిన పొలాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విరివిగా రుణాలు ఇవ్వాల్సిన బ్యాంకర్లు లక్ష్మీదేవిని లాకర్లో పెడితే ఎలా’ అని జిల్లా ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. సకాలంలో రుణాలు ఇవ్వగలిగితే రైతుకు మేలు జరుగుతుంది. అంతే కానీ మీకు నచ్చిన వారికి, మీకు ఇష్టమైన వారికి రుణాలు ఇచ్చి లక్ష్యం మేరకు రుణాలు ఇచ్చినట్టుగా లెక్కలు చూపితే ప్రయోజనం ఏమిటని నిలదీశారు. కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ అధ్యక్షతన డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశం గురువారం సాయంత్రం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, బందరు ఎంపీ వల్లభనేని బాల శౌరిలతో పాటు టీటీడీ బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలా అనిల్‌కుమార్, వసంత కృçష్ణ ప్రసాద్, మోకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, జోగి రమేష్‌ పాల్గొన్నారు. సమావేశంలో తొలుత ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ మనసున్న మారాజు పాలిస్తే ప్రకృతి కూడా సహకరిస్తుందనడానికి రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలే నిదర్శమన్నారు. 

అదే మంచి మనసు అధికారుల్లో కూడా ఉండాలని అన్నదాతలనే కాదు.. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. నిర్ధేశించిన లక్ష్యం మేరకు రుణాలు సకాలంలో ఇవ్వక పోతే ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. ఎలాంటి కొలాట్రల్‌ సెక్యురిటీ లేకుండా ఇవ్వాల్సిన ముద్ర రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లు నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఏ బ్యాంకు పరిధిలో ఏ బ్రాంచి ఎంత మేర ముద్ర రుణాలు మంజూరు చేసింది? ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదో సమగ్ర నివేదిక ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 2022 నాటికి రైతుల ఆదాయం డబుల్‌ చేయాలని సంకల్పంతో ప్రధానమంత్రి ప్రకటించిన పథకం అమలుపై మీ వద్ద ప్రణాళికలేమిటో చెప్పాలని డిమాండ్‌ కోరారు. మరో రెండు నెలల్లో బందరులో మీటింగ్‌ పెడతా ఈలోగా మీ లక్ష్యాలు. మీ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ కౌలురైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లాలో పంట విస్తీర్ణంలో నూటికి 60 శాతం మంది కౌలురైతులే సాగు చేస్తున్నారని, వార్ని ఆదుకునేందుకే పంట సాగు చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. రుణాల రికవరీ బాగున్న రైతులకు రుణాల మంజూరులో మరింత ఉదారతను చూపాలన్నారు.

రూ.1500 కోట్లకు రూ.101 కోట్లు ఇస్తారా?
కౌలుదారులకు రూ.1500కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, కేవలంరూ.101 కోట్లు మాత్రమే ఇవ్వడమేమిటని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. జిల్లాలో పాడి, డెయిరీ రంగాలను ప్రోత్సహించే విధంగా విరివిగా రుణాలివ్వాలన్నారు. సంక్షేమ శాఖల ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు రుణాలు మంజూరు చేయడమే కాదు.. యూనిట్లు గ్రౌండ్‌ అయ్యేలా చూడాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్‌ చేశారు. విజయవాడలో 7400 గ్రూపుల ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకై నగర శివారులో ఏర్పాటు చేసిన మైక్రోసాఫ్ట్‌ బ్యాంకు నగరంలోకి తీసుకురావాలని సూచించారు.

అక్టోబర్‌ 3న మెగా రుణగ్రౌండ్‌ మేళాలు..
జిల్లాలో 49,220 డ్వాక్రా గ్రూపులకు రూ.1,316కోట్ల రుణాలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 16,309 సంఘాలకు రూ.362 కోట్ల రుణాలు మంజూరు చేశారని కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ తెలిపారు. అక్టోబర్‌ 3వ తేదీన గ్రామీణ, అర్బన్‌ ప్రాంతాల్లో మెగా రుణ గ్రౌండింగ్‌ మేళాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అందులో రూ.360కోట్ల రుణాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల కింద మంజూరైన యూనిట్ల వివరాలు ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు కోరగా, 2016–19 మధ్య గ్రౌండ్‌ కానీ యూనిట్లను రద్దు చేశామని, అయితే గతంలో దరఖాస్తు చేసిన వాటిని ప్రస్తుతం పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. స మావేశంలో జేసీ డాక్టర్‌ కే మాధవీలత, డీసీసీ కన్వీనర్, ఇండియన్‌ డీజీఎం మణిమాల, ఎల్‌డీఎం ఆర్‌. రామ్మోహనరావు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement