ఎన్టీఆర్ భవన్ సాక్షిగా తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సమావేశానికి ముందు కృష్ణాజిల్లా కార్యకర్తలు ఘర్షణ పడ్డారు.
హైదరాబాద్ : ఎన్టీఆర్ భవన్ సాక్షిగా తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సమావేశానికి ముందు కృష్ణాజిల్లా కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. జిల్లాలోని పెనమలూరు నియోజవర్గంలో టీడీపీ వర్గపోరుతో కుతకుతలాడుతోంది. పార్టీ అధికార ప్రతినిధి వైవీబీ రాజేంద్రప్రసాద్, దివంగత చలసాని పండు వర్గానికి చెందిన బోడే ప్రసాద్, వల్లభనేని వెంకటేశ్వరరావు (నాని)ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.దీంతో గత నాలుగేళ్లుగా పార్టీ ఇన్ఛార్జీనే నియమించలేని పరిస్థితి నెలకొంది.
ఈ రెండు వర్గాలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నారు. ఈ పంచాయతీ చివరకు చంద్రబాబు వద్దకు చేరింది. ఆయన దిద్దుబాటు చర్యలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో గురువారం నియోజకవర్గ పరిస్థితి, ఇన్చార్జి నియామకం తదితర అంశాలపై ముఖ్యనేతలతో సమీక్ష జరపనున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఇరువర్గాల కార్యకర్తలు తన్నులాటకు దిగటంతో ఇంటిపోరు తారాస్థాయికి చేరింది.