రూ.300 కోట్లతో పుష్కరాల పనులు
కలెక్టర్ కాంతిలాల్ దండే
గుంటూరు ఈస్ట్ : జిల్లాలో రూ.300 కోట్లతో కృష్ణా పుష్కరాల పనులు చేస్తామని కలెక్టర్ కాంతిలాల్ దండే చెప్పారు. కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి నిర్దేశించిన అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. కాంతిలాల్ దండే మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా గుంటూరు, మంగళగిరి సుందరీకరణ, ఘాట్లకు అప్రోచ్ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. ఎస్సీ, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్‌లో కొన్నింటిని గురుకుల పాఠశాలలుగా మార్చేందుకు నిర్ణయించారని అందుకు సంబంధించిన హాస్టల్స్‌ను గుర్తించాలని ఆదేశించారు. వేసవిలో మంచినీరు సమస్య తలెత్తకుండా ప్రైవేటు ట్యాంకర్లను అద్దెకు తీసుకోవాలని సూచించారు. సంయుక్త కలెక్టర్ సి.హెచ్.శ్రీధర్ మాట్లాడుతూ బయోమెట్రిక్ విధానం అన్ని శాఖల్లో అమలు చేస్తున్నామని అందుకు గాను అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలని పేర్కొన్నారు. జన్మభూమి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని తెలిపారు. డ్వామా, డీఆర్‌డీఏ, వ్యవసాయ శాఖల పనితీరును మెరుగుపర్చుకోవాలని కోరారు.
కలెక్టర్ ఆగ్రహం
పంచాయితీ రాజ్ శాఖ సీసీ రోడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతుండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ విషయమై ఆ శాఖ ఎస్‌ఈ జయరాజును కలెక్టర్ ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో ఒక రోజుకు 4.5 కిలోమీట్లర చొప్పున రోడ్లు నిర్మిస్తుండగా జిల్లాలో 1.5 కిలోమీటర్లు మాత్రమే రోడ్ల నిర్మాణం జరగడమేమిటని ప్రశ్నించారు. ఇంజినీర్లు తన మాట వినడం లేదని ఎస్‌ఈ సమాధానం చెప్పారు. అందుకు కలెక్టర్ స్పందిస్తూ శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఆర్వో నాగబాబు, సంయుక్త కలెక్టర్ -2 వెంకటేశ్వరావు పాల్గొన్నారు.