శ్రీశైలం డ్యాంలోని 10 గేట్ల నుంచి సాగర్ వైపు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/మాచర్ల: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం రోజురోజుకూ పెరుగుతోంది. మహారాష్ట్రలో వరద పోటెత్తడంతో శనివారం సాయంత్రం 6 గంటలకు ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి 6.25 లక్షల క్యూసెక్కులను కర్ణాటక సర్కార్ దిగువకు విడుదల చేసింది. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి పెరగడంతో తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. మరో ప్రధాన ఉప నది భీమా మూడు రోజులుగా ఉరకలెత్తుతోంది. దీంతో ఉజ్జయిని జలాశయం గేట్లు ఎత్తి భారీగా జలాలను దిగువకు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు 4,49,950 క్యూసెక్కులు చేరుతుండటంతో జలాశయంలో నీటిమట్టం 883.1 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్ట్ పది గేట్లను 20 అడుగుల పైకెత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా సుజల స్రవంతి, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కేసీ కెనాల్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్ట్ నుంచి శనివారం రాత్రి 9 గంటల సమయానికి 6,12,931 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దిగువ ప్రాంతాలకు 5,69,266 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
15 ఏళ్లలో ఇదే భారీ వరద
గడచిన 15 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి 2009–10లో గరిష్టంగా 1,218.55 టీఎంసీల జలాలు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటికే 230 టీఎంసీలకు పైగా వచ్చాయి. ముందెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఆగస్ట్ 9న ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేయడం గమనార్హం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పటి తరహాలోనే.. ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందని రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో నాలుగు రోజుల్లో నాగార్జునసాగర్.. మరో వారం రోజుల్లో పులిచింతల ప్రాజెక్ట్ నిండే అవకాశం ఉంది. మరో 10, 15 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండటంతో ఆదివారం సాగర్ కుడి, ఎడమ కాలువలకు ఏపీ జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్, తెలంగాణ మంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డి నీటిని విడుదల చేస్తారు.
కుడి కాలువకు గండి
సాగర్ కుడి కాలువకు గుంటూరు జిల్లా మాచర్ల మండలం లింగాపురం శివారులోని 11వ మైలు వద్ద శనివారం రాత్రి గండి పడింది. ఈ కాలువకు మూడు రోజుల క్రితం నీటిని విడుదల చేయగా.. లింగాపురం రహదారిలో మల్లెతోట వద్ద గండిపడి నీరంతా చంద్రవంక నదిలోకి చేరుతోంది. గతంలోనూ ఇదే ప్రాంతంలో భారీ గండి పడింది.
Comments
Please login to add a commentAdd a comment