కుదిరిన సయోధ్య
- కృష్ణా జలాల నిర్వహణ మార్గదర్శకాలు ఖరారు
- త్వరలో నోటిఫై చేయనున్న కేంద్రం
- అంతా బచావత్ ట్రిబ్యునల్ పంపకాల ప్రకారమే
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల పంపిణీలో నిర్వహణ ఇబ్బందులు లేకుండా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 18 అంశాలతో కూడిన మార్గదర్శకాల ముసాయిదాను రూపొందించి జలవనరుల శాఖకు సమర్పించింది. గురువారం 15 అంశాలను ఖరారు చేసిన బోర్డు శుక్రవారం మరో 3 అంశాలను అందులో చేర్చింది.
రెండో రోజు శుక్రవారం ఇక్కడి జలవనరుల మంత్రిత్వ శాఖలో జరిగిన సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి అమర్‌జీత్‌సింగ్, కృష్ణా యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్‌కేజీ పండిట్, సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తా, ఏపీ నుంచి ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం. వెంకటేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు, తెలంగాణ నుంచి ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ ముసాయిదాపై కేంద్ర అదనపు కార్యదర్శి, ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు సంతకం చేసి జలవనరుల మంత్రిత్వ శాఖకు సమర్పించారు.
దీనికి కేంద్రం ఆమోదముద్ర వేసిన తర్వాత రెండు రాష్ట్రాలకు పంపిస్తుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించిన మీదట కేంద్ర జల వనరుల శాఖ నోటిఫై చేస్తుంది. ఆ వెంటనే అమల్లోకి వస్తుంది. 2015-16 ఖరీఫ్, రబీ సీజన్లలో ‘నిర్వహణ మార్గదర్శకాలు’ అమల్లో ఉంటాయి. మార్గదర్శకాలన్నీ బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు లోబడే రూపొందించారు. అంటే దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో అమలైన పద్ధతినే ఈ ఏడాదీ అమలు చేయనున్నారు.
ఇవీ ముఖ్యమైన మార్గదర్శకాలు
1. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలు గుర్తించి విడుదల చేసేందుకు ఒక వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేస్తారు. దానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మెంబర్ సెక్రెటరీ అధ్యక్షత వహిస్తారు. రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్(ఇఎన్‌సీ)లు సభ్యులుగా ఉంటారు. ఆయా ప్రాజెక్టుల అధికారుల నుంచి నీటి అవసరాలపై ఈ గ్రూప్‌నకు ప్రతిపాదనలు ఇవ్వాలి. నీటి లభ్యతను బట్టి నీటి విడుదలకు అవసరమైన ఆపరేషన్ ప్రొటోకాల్‌ను సిఫారసు చేస్తుంది. అందుకు అనుగుణంగా కృష్ణా బోర్డు తగిన ఆదేశాలు జారీచేస్తుంది. ఈ ఆదేశాలను ఆయా ప్రాజెక్టు అధికార యంత్రాంగం అమలుచేయాల్సి ఉంటుంది.
2. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నికర జలాలను ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వాడుకోవాలి. ఈ నీటిని ఆయా రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా ఎక్కడైనా, ఏ ప్రాజెక్టు ద్వారానైనా వినియోగించుకోవచ్చు.
3. నికర జలాలు 811 టీఎంసీలు పోగా మిగులు జలాలు ఉంటే వాటిని పై వాటా నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి. ఒకవేళ నికర జలాలే రానిపక్షంలో ఉన్న నీటిని పై నిష్పత్తిలోనే పంచుకోవాలి.
4. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీకి కుడి కాలువ ద్వారా 132 టీఎంసీలు, ఎడమ కాలువకు 32 టీఎంసీలు విడుదల చేయాలి. అలాగే తెలంగాణకు 100 టీఎంసీలు నీటి విడుదల చేయాలి. మొత్తంగా నాగార్జునసాగర్ కెనాల్ వ్యవస్థ ద్వారా 264 టీఎంసీల నీటిని విడుదల చేయాలి.
5. కేసీ కెనాల్ ద్వారా 31 టీఎంసీలు, జూరాల ప్రాజెక్టు ద్వారా 17.8 టీఎంసీలు, ఆర్డీఎస్ ద్వారా 15.9 టీఎంసీల నీటి వినియోగం మించకూడదు.
6. తెలుగు గంగ ద్వారా చెన్నై పథకానికి నిర్దేశిత నీటిని విడుదలయ్యేలా చూడాలి. ఎస్సార్బీసీ ద్వారా వివిధ అవసరాలకు 19 టీఎంసీలు తప్పనిసరిగా విడుదలయ్యేలా చూడాలి. వీటిని పరిగణనలోకి తీసుకున్న తరువాతే నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల వద్ద విద్యుదుత్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలి.
7. భీమా ఎత్తిపోతల పథకానికి 20 టీఎంసీలు ఇవ్వడం ద్వారా కృష్ణా డెల్టాకు తక్కువయ్యే 20 టీఎంసీల విషయంలో ఇప్పటివరకు కొనసాగించిన విధానాన్నే పాటించాలని నిర్ణయించారు.
8. నీటి నియంత్రణ, నిర్వహణ విషయంలో ముందుగా కృష్ణా డెల్టా అవసరాలను పరిగణనలోకి తీసుకొని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రోటోకాల్ అమలు చేయాలి.
9. కృష్ణా డెల్టాకు కేటాయించిన 182 టీఎంసీల జలాలు వాస్తవిక రూపంలో లభ్యమయ్యేలా వర్కింగ్ గ్రూప్ చర్యలు తీసుకోవాలి.
10. ఇరు రాష్ట్రాల అంగీకారంతోనే జరుగుతున్నందున, ఈ అంశాలపై మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించకూడదు. ఇందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాలి.