amity
-
సహృదయం.. సామరస్యం.. ద్వేష రాహిత్యం
ఏ దేశంలో అయినా, ఏ సమాజంలో అయినా, ఏ కాలంలో అయినా మానవుల్లో ఉండాల్సినవి ఏవి? సహృదయత, సామరస్యం, ద్వేషరాహిత్యం ఇవి ప్రపంచ మానవుల్లో ఉండాల్సినవి. మానవులు క్షేమంగా ఉండాలంటే ఉండి తీరాల్సినవి ఇవే. అదేంటో మానవ చరిత్ర మొదలు అయినప్పటి నుంచీ ఇవి ఉండాల్సినంతగా, ఉండాల్సినట్టుగా ఉండడం లేదు. అందువల్లే మానవులకు శాంతి, భద్రతలు కరువైపోయాయి. ఈ దుస్థితి ఇకనైనా మారాలి; ఇకపైనైనా మనిషి వల్ల మనిషికి కలుగుతున్న ముప్పుకు ముగింపు రావాలి; మనకు సుస్థితి సమకూడాలి. అథర్వ వేదపాఠం అయిన సాంమనస్య సూక్తం ఎప్పటి నుంచో ‘సహృదయం సాంమనస్యం అవిద్వేషం కృణోమి వః’ అనీ, ‘అన్యో అన్యమభి హర్యత వత్సం జాతమివాఘ్న్యా’ అనీ ఘోషిస్తూనే లేదా చాటిస్తూనే ఉంది. అంటే సహృదయులుగానూ, సామరస్యంతోనూ లేదా ఏకమనస్కులుగానూ, ద్వేషరహితులుగానూ మిమ్మల్ని రూపొందిస్తాను అనీ, అపుడే పుట్టిన దూడను తల్లి ఆవు ప్రేమించేట్టుగా పరస్పరం ప్రేమించుకోవాలి అనీ అర్థం. ఈ మాటల్ని మనం అర్థం చేసుకోనేలేదు. అందుకే మనలో అపాయం అతిగా వ్యాపిస్తూనే ఉంది. ఈ పరిస్థితిని మనం వెనువెంటనే పరిష్కరించుకోవాలి. ప్రపంచం, దేశం, సమాజం వీటికి తొలిదశ ఇల్లు. ఒక ఇంట్లోని వ్యక్తుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలో తెలియజేస్తూ సాంమనస్య సూక్తం ‘అనువ్రతః పితుః పుత్రో మాత్రా భవతు సంమనాః‘ అనీ, ‘జాయా పత్యే మధుమతీమ్ వాచమ్ వదతు శాన్తివామ్‘ అనీ చెబుతోంది. అంటే ఒక కొడుకు తన తండ్రిని అనుసరించే వాడుగానూ, తన తల్లితో సామరస్యంతోనూ ఉండాలి, భార్య భర్తతో మధురమైనదై ప్రశాంతతను ఇచ్చే మాటల్ని చెప్పనీ అని అర్థం. ఒకరిని ఒకరు వెన్నంటి ఉండడం, ప్రశాంతత, హితవచనం ఇవి ఇంటి నుంచే మొదలు అవ్వాలి. ద్వేషరాహిత్యం అన్నది కూడా ఇంటి నుంచే రావాలి అని తెలియజేస్తూ సాంమనస్య సూక్తం ‘మా భ్రాతా భ్రాతరం దదిక్షన్మా స్వసారముత స్వసా’ అనీ, సమ్యఞ్చః సవ్రతా భూత్వా వాచం వదత భద్రయా’ అనీ చెబుతోంది. అంటే సోదరీ సోదరులు ద్వేషించుకోకూడదు, కలిసికట్టుగా పనిచెయ్యండి, అందరూ శుభం కలిగించే మాటల్ని పలకండి అని అర్థం. అభిప్రాయ భేదాలతో ఒక ఇంట్లోని సభ్యులు పరస్పరం ద్వేషించుకుంటూ విడిపోవడం కాదు ఉమ్మడిగా ఉండడానికి వాళ్ల మధ్య అవగాహన ఉండాలి అని తెలియజేస్తూ సాంమనస్య సూక్తం ‘యేన దేవా న వియన్తి నో చ విద్విషతే మిథః’ అనీ,‘తత్ కృణ్మో బ్రహ్మ వో గృహే సంజ్ఞానం పురుషేభ్యః’ అనీ చెబుతోంది. అంటే దేనివల్ల దేవతలు విడిపోరో, ద్వేషించుకోరో అవగాహన అన్న ఆ ఉన్నతమైన భావన ఇంట్లోని సభ్యుల్లో ఉండాలి అని అర్థం. సంజ్ఞానం లేదా అవగాహన మనకు ఉండి తీరాలి. చిన్నవాళ్లు పెద్దలను వెన్నంటి వెళుతున్నట్టుగా ఒకరికి ఒకరై ఏకమనస్కులుగా, సామూహిక ఆరాధన చేసేవాళ్లుగా, పరస్పరం ప్రీతితో మాట్లాడుకునేవాళ్లుగా కలిసి మెలిసి బతకండి అని సూచిస్తూ ‘జాయస్వన్తశ్చిత్తినో మా వి యౌష్ట సమారాధయన్తః సధురాశ్చరన్తః’ అని సాంమనస్య సూక్తం మనకు చెబుతోంది. అంతేకాదు ప్రేమ అనే తాడుతో అందరూ కట్టబడాలి అన్న సూచ్య అర్థం వచ్చేట్టుగా ‘సమానే యోక్త్రే సహ వో యునజ్మి’ అనీ, ‘దేవా ఇవామృతమ్ రక్షమాణాః సాయం ప్రాతః సౌమనసో వో అస్తు‘ అంటూ దేవతలు అమృతాన్ని రక్షిస్తున్నట్టుగా ఉదయ, సాయం కాలాల్లో సద్భావనల్ని రక్షించండి అనీ చెబుతోంది సాంమనస్య సూక్తం. సాంమనస్య సూక్తం చేసిన ఈ సూచనను అందుకుని సద్భావనల్ని రక్షించుకుంటూ మనల్ని మనం రక్షించుకోవాలి; ఆపై మనం రాణించాలి. ‘భారతీయ వైదిక సాహిత్యం సహృదయత, సామరస్యం, ద్వేషరాహిత్యం వీటితో మానవులు మెలగాలని ప్రగాఢంగా ప్రవచించింది. దాన్ని మనం అర్థం చేసుకుని ఆచరణలోకి తెచ్చుకోవాలి. అది జరగకపోతే మన జీవితాలు అనర్థ దాయకమూ, అల్లకల్లోలమూ అయిపోతాయి‘. – రోచిష్మాన్ -
కిరాణా కొట్టు నుంచి రూ 251 కే స్మార్ట్‌ఫోన్ వరకూ..
మీరట్: ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ. అదే 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్. అమ్మకాలు మొదలెట్టగానే సర్వర్లు క్రాష్ అయ్యేంత రష్. ఇంతలా భారీగా హైప్ క్రియేట్ చేసిన రింగింగ్ బెల్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ గోయల్ ప్రస్థానం మాత్రం అతిసాధారణంగా ఉంది. ఉత్తరప్రదేశ్ లోని షమ్లీ జిల్లాలో గర్హిపుక్త అనే చిన్న పట్టణంలో కిరాణా కొట్టు నిర్వహించే కుటుంబానికి చెందిన మోహిత్ గోయల్ ఎవరో నిన్నటి వరకు ఆపట్టణంలోని వారికే సరిగా తెలియదు. అయితే ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా చర్చంతా గోయల్ గురించే. పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలకు సైతం సాధ్యం కాని ధరకు స్మార్ట్ ఫోన్‌ను అందించేందుకు పూనుకున్న మోహిత్ గోయల్ తండ్రి రాజేష్ గోయల్ గర్హిపుక్తలో 'రామ్ జీ' పేరుతో చిన్న కిరాణం కొట్టును నడిపిస్తున్నాడు. మోహిత్ చిన్నతనంలో తండ్రికి కిరాణా దుకాణం నిర్వహణలో సహకరించేవాడు. గర్హిపుక్తలోనే ఓ కాన్వెంట్ పాఠశాలలో చదువు పూర్తి చేసిన మోహిత్.. నోయిడాలోని అమితి యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇటీవల మోహిత్ గర్హిపుత్ర వెల్లినప్పుడు ఓ కంపెనీని ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పాడని, అయితే అప్పుడు అది ఇంతగా ప్రజల్లోకి వెళ్లేదని అనుకోలేదని అక్కడి వారు చెబుతున్నారు. బీజేపీ సీనియర్ లీడర్ మురళీ మనోహర్ జోషీ చేతుల మీదుగా జరిగిన ఫ్రీడమ్ 251 మొబైల్‌ను లాంచ్ కార్యక్రమానికి మేం కూడా వెళ్లామని చెబుతూ కొందరు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కుదిరిన సయోధ్య
- కృష్ణా జలాల నిర్వహణ మార్గదర్శకాలు ఖరారు - త్వరలో నోటిఫై చేయనున్న కేంద్రం - అంతా బచావత్ ట్రిబ్యునల్ పంపకాల ప్రకారమే సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల పంపిణీలో నిర్వహణ ఇబ్బందులు లేకుండా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 18 అంశాలతో కూడిన మార్గదర్శకాల ముసాయిదాను రూపొందించి జలవనరుల శాఖకు సమర్పించింది. గురువారం 15 అంశాలను ఖరారు చేసిన బోర్డు శుక్రవారం మరో 3 అంశాలను అందులో చేర్చింది. రెండో రోజు శుక్రవారం ఇక్కడి జలవనరుల మంత్రిత్వ శాఖలో జరిగిన సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి అమర్జీత్సింగ్, కృష్ణా యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్కేజీ పండిట్, సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, ఏపీ నుంచి ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం. వెంకటేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు, తెలంగాణ నుంచి ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ ముసాయిదాపై కేంద్ర అదనపు కార్యదర్శి, ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు సంతకం చేసి జలవనరుల మంత్రిత్వ శాఖకు సమర్పించారు. దీనికి కేంద్రం ఆమోదముద్ర వేసిన తర్వాత రెండు రాష్ట్రాలకు పంపిస్తుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించిన మీదట కేంద్ర జల వనరుల శాఖ నోటిఫై చేస్తుంది. ఆ వెంటనే అమల్లోకి వస్తుంది. 2015-16 ఖరీఫ్, రబీ సీజన్లలో ‘నిర్వహణ మార్గదర్శకాలు’ అమల్లో ఉంటాయి. మార్గదర్శకాలన్నీ బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు లోబడే రూపొందించారు. అంటే దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో అమలైన పద్ధతినే ఈ ఏడాదీ అమలు చేయనున్నారు. ఇవీ ముఖ్యమైన మార్గదర్శకాలు 1. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలు గుర్తించి విడుదల చేసేందుకు ఒక వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేస్తారు. దానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మెంబర్ సెక్రెటరీ అధ్యక్షత వహిస్తారు. రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్(ఇఎన్సీ)లు సభ్యులుగా ఉంటారు. ఆయా ప్రాజెక్టుల అధికారుల నుంచి నీటి అవసరాలపై ఈ గ్రూప్‌నకు ప్రతిపాదనలు ఇవ్వాలి. నీటి లభ్యతను బట్టి నీటి విడుదలకు అవసరమైన ఆపరేషన్ ప్రొటోకాల్‌ను సిఫారసు చేస్తుంది. అందుకు అనుగుణంగా కృష్ణా బోర్డు తగిన ఆదేశాలు జారీచేస్తుంది. ఈ ఆదేశాలను ఆయా ప్రాజెక్టు అధికార యంత్రాంగం అమలుచేయాల్సి ఉంటుంది. 2. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నికర జలాలను ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వాడుకోవాలి. ఈ నీటిని ఆయా రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా ఎక్కడైనా, ఏ ప్రాజెక్టు ద్వారానైనా వినియోగించుకోవచ్చు. 3. నికర జలాలు 811 టీఎంసీలు పోగా మిగులు జలాలు ఉంటే వాటిని పై వాటా నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి. ఒకవేళ నికర జలాలే రానిపక్షంలో ఉన్న నీటిని పై నిష్పత్తిలోనే పంచుకోవాలి. 4. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీకి కుడి కాలువ ద్వారా 132 టీఎంసీలు, ఎడమ కాలువకు 32 టీఎంసీలు విడుదల చేయాలి. అలాగే తెలంగాణకు 100 టీఎంసీలు నీటి విడుదల చేయాలి. మొత్తంగా నాగార్జునసాగర్ కెనాల్ వ్యవస్థ ద్వారా 264 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. 5. కేసీ కెనాల్ ద్వారా 31 టీఎంసీలు, జూరాల ప్రాజెక్టు ద్వారా 17.8 టీఎంసీలు, ఆర్డీఎస్ ద్వారా 15.9 టీఎంసీల నీటి వినియోగం మించకూడదు. 6. తెలుగు గంగ ద్వారా చెన్నై పథకానికి నిర్దేశిత నీటిని విడుదలయ్యేలా చూడాలి. ఎస్సార్బీసీ ద్వారా వివిధ అవసరాలకు 19 టీఎంసీలు తప్పనిసరిగా విడుదలయ్యేలా చూడాలి. వీటిని పరిగణనలోకి తీసుకున్న తరువాతే నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల వద్ద విద్యుదుత్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలి. 7. భీమా ఎత్తిపోతల పథకానికి 20 టీఎంసీలు ఇవ్వడం ద్వారా కృష్ణా డెల్టాకు తక్కువయ్యే 20 టీఎంసీల విషయంలో ఇప్పటివరకు కొనసాగించిన విధానాన్నే పాటించాలని నిర్ణయించారు. 8. నీటి నియంత్రణ, నిర్వహణ విషయంలో ముందుగా కృష్ణా డెల్టా అవసరాలను పరిగణనలోకి తీసుకొని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రోటోకాల్ అమలు చేయాలి. 9. కృష్ణా డెల్టాకు కేటాయించిన 182 టీఎంసీల జలాలు వాస్తవిక రూపంలో లభ్యమయ్యేలా వర్కింగ్ గ్రూప్ చర్యలు తీసుకోవాలి. 10. ఇరు రాష్ట్రాల అంగీకారంతోనే జరుగుతున్నందున, ఈ అంశాలపై మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించకూడదు. ఇందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాలి.