యాచారం, న్యూస్‌లైన్: ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు కృష్ణా జలాల పంపిణీ ప్రక్రియ నిష్ర్పయోజనంగా మారింది. రూ.కోట్లు ఖర్చవుతున్నా ఫ్లోరైడ్ బాధితులకు స్వచ్ఛమైన నీటిని అందించలేక పోతున్నారు. దీంతో అనేక గ్రామాల ప్రజలు నేటికీ కలుషిత నీటితే తాగుతున్నారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దు అయిన యాచారం మండల పరిధిలోని మంతన్‌గౌరెల్లి, దాని అనుబంధ గ్రామాలైన భానుతండా, నున్సవాత్‌తండాలతోపాటు మరికొన్ని గిరిజన గ్రామాల్లో తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం అధికం. నల్లవెల్లి, మాల్, మొండిగౌరెల్లి, తమ్మలోనిగూడ, చింతపట్ల, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లోనూ ఫ్లోరైడ్ ప్రభావం ఉంది.
మొత్తంగా 20గ్రామాల ప్రజలు ఫ్లోరైడ్ నీటితో ఇబ్బంది పడుతున్నారు. సహజంగా గ్రామాల్లో ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ వచ్చిపోతూ ఉంటుంది. ఒక్కోసారి మధ్యాహ్నం వేళ పూర్తిగా ఉండదు. అందుకే ఎప్పుడు విద్యుత్ సరఫరా ఉంటే అప్పుడే ట్యాంకులను, సంపులను నింపుతుంటారు. మండలంలోని మంతన్‌గౌరెల్లి, మొండిగౌరెల్లి, తమ్మలోనిగూడ, చింతపట్ల, నక్కర్తమేడిపల్లి, మాల్ తదితర గ్రామాల్లో కృష్ణా జలాల కోసం ప్రత్యేక ట్యాంకులు లేవు. కృష్ణా నీటిని సైతం ఫ్లోరైడ్ వాటర్ ఎక్కించిన ట్యాంకులోకే పంపిస్తుంటారు.
వాటినే ప్రజలకు సరఫరా చేస్తుంటారు. దీంతో ఈ కలుషిత నీటినే జనం తాగుతున్నారు. ఇదిలా ఉంటే మాల్, మంతన్‌గౌరెల్లి, నందివనపర్తి, అయ్యవారిగూడ తదితర గ్రామాలను కలుపుతూ వేసిన కృష్ణా జలాల పైపులైన్లకు తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. దీంతో నీరు వృథా పోవడమే కాకుండా జలాలు కలుషితం అవుతున్నాయి. యాచారం- నందివనపర్తి పైపులైన్ వారానికోమారు లీకేజీ అవుతోంది.
నత్తనడకన సంపుల నిర్మాణం
మండలంలోని గ్రామాల్లో కృష్ణా జలాల నిల్వ కోసం సంపులు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.కోటికి పైగా నిధులు మంజూరు చేసింది.
నిధులు మంజూరై ఏడాది దాటినా ఇప్పటికీ సంపుల నిర్మాణం పూర్తి కాలేదు.
మాల్‌లో సంపు నిర్మాణం కోసం రూ.20 లక్షలు కేటాయించారు. కానీ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
నందివనపర్తిలో నేటికీ పనులు ప్రారంభం కాలేదు.
అత్యధికంగా నీటిలో ఫ్లోరైడ్ ఉన్న మంతన్‌గౌరెల్లిలో సంపు నిర్మాణం పూర్తయినా పైపులకు అనుసంధానం చేయలేదు. దీంతో ఈ నిర్మాణం వృథాగా ఉంది. మండలంలోని మిగిలిన గ్రామాల్లోనూ ఇదే తరహా పనులు సాగుతున్నాయి.
తాడిపర్తి గ్రామానికి ఇంతవరకు కృష్ణా జలాలే అందించడం లేదు. రికార్డుల్లో మాత్రం తాడిపర్తికి కృష్ణాజలాలు సరఫరా చేస్తున్నట్టుగా ఉంది.
సంపుల సంగతి మరిచారా?
Published Thu, Feb 13 2014 11:50 PM | Last Updated on Tue, Oct 2 2018 7:51 PM
Advertisement
Advertisement