
పశ్చిమకృష్ణాపై బాబు సవతి ప్రేమ
- బాబు హయంలో ముగ్గురు మంత్రులున్నా ఉపయోగం సున్నా
- తాగునీరు, సాగునీటికి కటకటే!
- తారాస్థాయిలో ఆధిపత్య పోరు
- అభద్రతలో అభ్యర్థులు
సాక్షి, విజయవాడ : పశ్చిమకృష్ణాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీస్తుందనే సంకేతాలందడంతో .... ఈ ప్రాంతంలో ఏదో విధంగా పార్టీని కాపాడుకోవడానికి అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో పర్యటించి పార్టీ ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల తూర్పు కృష్ణాలోని పామర్రు, పెడన, బందరులో పర్యటించిన చంద్రబాబు సోమవారం జగ్గయ్యపేట, నందిగామ,మైలవరం నియోజకవర్గాల్లో పర్యటించేందుకు రానున్నారు.
జిల్లాలో పాదయాత్రలు, బస్సుయాత్రలు, మహిళా గర్జనలు చేసినా... పలుమార్లు తిరిగినా ఓటర్లనుంచి ఏ మాత్రం స్పందన రాకపోవడంతో, మరోసారి చంద్రబాబు వచ్చినప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దీనికితోడు పార్టీలో నేతల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలు పార్టీకి శాపంగా మారాయి. తాము గెలవకపోయినా పరవాలేదు..తనపార్టీ వాడు గెలవకూడదనే సిద్ధాంతానికి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కట్టుబడి ఉన్నారనే వార్తలొస్తున్నాయి.
ప్రజలాదరించినా టీడీపీ నేతలు ఒరగబెట్టింది శూన్యమే.....
తెలుగుదేశం పార్టీని ఇక్కడ ప్రజలు ఆదరించినా, నేతలు మాత్రం ఈ ప్రాంతానికి ఒరగపెట్టిందేమీ లేదని ప్రజలంటున్నారు. పశ్చిమకృష్ణా నుంచి గెలుపొందిన వడ్డేశోభనాద్రీశ్వరరావు(మైలవరం), నెట్టెంరఘురామ్(జగ్గయ్యపేట), దేవినేని వెంకట రమణ(నందిగామ) అప్పట్లో చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి కావాల్సిన తాగునీరు,సాగునీరు సాధించలేకపోయారనే విమర్శలున్నాయి. ఇదే ప్రాంతానికి చెందిన ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా మీడియా ముందు హడావిడి చేయడమే తప్ప ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు ఒక్కటి సాధించలేదనేది నిష్టూర సత్యం. ఇక చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో ఈ ప్రాంతాన్ని పూర్తిగా అశ్రద్ధచేశారని, రైతుల కష్టాలను, కన్నీళ్లను తీర్చేందుకు ఏ మాత్రం ప్రయత్నించలేదనే భావన ఇక్కడి ప్రజల్లో వ్యక్తమవుతోంది.
తీరని సమస్యలెన్నో...
కృష్ణాజలాలు కావాలనే జగ్గయ్యపేట ప్రజల డిమాండ్‌ను మాజీమంత్రి నెట్టెం రఘురామ్‌కానీ, ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ కానీ పరిష్కరించలేకపోయారు. వత్సవాయి మండలం పోలపల్లి డామ్ నిర్మాణం పూర్తయితే సుమారు 3వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని రైతులు మొత్తుకుంటున్నా సిట్టింగ్ ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోలేదు. జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహించిన సమయంలోనూ నందిగామ నియోజకవర్గంలో సమస్యలు కోకల్లలు.
నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా పండించే సుబాబుల్ పంటకు గిట్టుబాటు ధర కావాలనే డిమాండ్‌ను ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఏ మాత్రం పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. మైలవరం నియోజకవర్గ రైతుల్ని ఎమ్మెల్యే దేవినేని ఉమా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. జి కొండూరు మండలంలో తారకరామ ఎత్తిపోతల పథకంపై పూర్తి నిర్లక్ష్యం వహించడం, కోటికల పూడి గ్రామంలోని ఏనుగగడ్డ వాగుపై వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోకపోవడం కొన్ని ఉదాహణలు మాత్రమే.
తారాస్థాయికి చేరిన కోల్డ్‌వార్ ...
టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్(నాని), జిల్లాఅధ్యక్షుడు దేవినేని ఉమా మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. నియోజకవర్గంలోని నేతలంతా రెండుగా చీలిపోయి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. నిన్నటి దాకా ఉమా వర్గంలో ఉన్న వారు నేడు కేశినేని వర్గంలోకి వెళ్లితే,కేశినేని వర్గీయులు ఉమా వైపు చూస్తున్నారు. ఈ ఇరువురు నాయకుల మధ్య కార్యకర్తలు పార్టీ ఓటర్లు నలిగిపోతున్నారు.
ఇక నందిగామ ఎమ్మెల్యే అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల సమస్య ఎదుర్కొంటుంటే, తిరువూరు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గాల్లో ఎదురీదుతున్నారు. పశ్చిమ కృష్ణాకు చంద్రబాబు వచ్చినా నేతల మధ్య విభేదాల కారణంగా పార్టీకి విజయావకాశాలు తక్కువగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.