స్పీకర్‌గా వెలగబెట్టిన తెలివి కిరణ్‌కు ఏమైంది? : కేటీఆర్
హైదరాబాద్: అసెంబ్లీలో తెలంగాణపై చర్చ తప్ప ఓటింగు ఉండదనే సంగతి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి తెలియదా అని టీఆర్‌ఎస్ శాసనసభ్యులు కె.తారక రామారావు ప్రశ్నించారు. హైదరాబాద్‌కు చెందిన వివిధ పార్టీల నాయకులు చేరిన సందర్భంగా, అనంతరం మీడియాతోనూ కేటీఆర్ శనివారం మాట్లాడారు. స్పీకరుగా, ప్రభుత్వ విప్‌గా పనిచేసిన కిరణ్‌కు తెలివి తెల్లారినట్టే ఉందన్నారు. ఎమ్మెల్యేల మద్ధతు, ప్రజల మద్ధతు లేకపోయినా, తెలుగులో మాట్లాడటం రాకపోయినా సీల్డ్‌కవరులో వచ్చి సీఎం అయిన కిరణ్ ఆ పదవిని పట్టుకుని వేలాడుతూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని విమర్శించారు.
సమైక్య రాష్ట్రంలో జరిగిన పేలుళ్లు సంగతి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 1200 మంది అమరుల త్యాగాలు, నాలుగున్నరకోట్ల మంది కొట్లాట కిరణ్‌కు కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. భూకంపం సృష్టించు అని అని సవాల్ చేసిన కిరణ్‌కు ఇప్పుడు కాళ్ల కింద భూమి కదిలిపోతున్నదా అని అడిగారు. పోలీసుల వెనుక దాక్కొని మాట్లాడకుండా చేతనైతే తెలంగాణలో తిరిగాలని కేటీఆర్ సవాల్ చేశారు. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబునాయుడుకు మతి భ్రమించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణకు బిల్లుకు మద్దతును ఇస్తామంటూనే రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారంటూ పొంతనలేని మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు.
ఇంకా తెలుగుదేశం పార్టీలో తెలంగాణ నేతలు ఎవరికోసం ఉంటున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ఎలా చేస్తారంటూ అంటున్న చంద్రబాబు ద్వారానే తెలంగాణ వచ్చిందంటూ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.