
నెమళ్లదిన్నె వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న కుందూ నది
సాక్షి, జమ్మలమడుగు : పెద్దముడియం మండలంలో కుందూ నది పరవళ్లు తొక్కుతోంది. నాలుగు రోజుల నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తూ పరివాహక గ్రామాలలో పంటలను ముంచెత్తుతోంది. ప్రస్తుతం కుందూలో 16వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. నాగరాజుపల్లి, పాలూరు, పెద్దముడియం, చిన్నముడియం, గరిశలూరు, నెమళ్లదిన్నె, బలపనగూడురు ప్రాంతాల ప్రజలు నది ఉధృతిపై ఆందోళన చెందుతున్నారు. పైన విపరీతమైన వర్షాలు కురవడంతో కృష్ణ, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా కుందూ ప్రవాహం కూడా పెరిగిపోయింది. నది పరివాహక ప్రాంతాల ప్రజలను రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నెమళ్లదిన్నె బ్రిడ్జిపై రెండు అడుగుల ఎత్తు మేర నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దముడియం బ్రిడ్జి దిగువ వరకు నీరు ప్రవహిస్తుంది. కుందూ నీటి ఉధృతి గురించి ఎమ్మెల్యే డాక్టర్‌మూలే సుధీర్‌రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. సోమవారం ఆయన నెమళ్లదిన్నె ప్రాంతాలలో పర్యటించారు. నీట మునిగిన పత్తి, వరి పంటలను పరిశీలించారు. ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు సహాయ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలంటూ అధికారులకు సూచనలిచ్చారు.
సీతారామాపురం వద్ద
చాపాడు: కుందూనది ఉధృతి పెరిగింది. మంగళవారం ఉదయం నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా మంగళ, బుధవారాల్లో కురిసే వర్షాలతో ఉధృతి మరింత పెరగనుంది. ఇప్పటికే మండలంలోని సీతారామాపురం వద్ద గల కుందూనది వంతెనను తాకుతూ నీరు ప్రవహిస్తోంది. కుందూ పరివాహక రైతులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కుందూనదికి రోజు రోజుకు వరద నీరు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మైదుకూరు నియోజకవర్గంలోని రైతాంగం వ్యవసాయ పనుల్లో నిగ్నమైంది.
Comments
Please login to add a commentAdd a comment