మాట్లాడుతున్న ఎక్సైజ్ అధికారులు
కర్నూలు: ‘బెల్టు దుకాణాలపై దాడులు చేసి పట్టుబడిన మద్యం ఏ షాపు నుంచి వచ్చిందో నిర్ధారించుకుని కేసులు నమోదు చేసి సస్పెండ్ చేస్తే అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఈ కారణంగానే బెల్టు దుకాణాలను నిర్మూలించలేకపోతున్నాం’ అంటూ కర్నూలు, అనంతపురం జిల్లాల ఎక్సైజ్ సీఐలు డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు దృష్టికి తెచ్చారు. కలెక్టరేట్‌లోని డ్వామా కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం కర్నూలు, అనంతపురం జిల్లాల ఎక్సైజ్ సీఐలతో డిప్యూటీ కమిషనర్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా సీఐలు ఆయన దృష్టికి పలు విషయాలు తెచ్చారు. కర్నూలు జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 6 మద్యం షాపులను సస్పెండ్ చేస్తే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని, దీనివల్ల తాము పడుతున్న కష్టం వృథా అవుతోందని సంబంధిత సీఐలు డీసీకి వివరించారు.
లక్ష్యాలకు తగ్గకుండా అమ్మకాలు జరపాలన్న ఒత్తిడి వల్ల కూడా వ్యాపారులు బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారని, బెల్టు దుకాణ నిర్మూలనకు గ్రామాల్లో రెవెన్యూ అధికారులు సహకరించడం లేదని, మద్యం వ్యాపారులు బార్ కోడ్‌లో డేటాను నిల్వ చేయకుండా తారుమారు చేయడం వల్ల సరైన ఆధారాలు లభించడం లేదని, సకాలంలో సీఐల బదిలీలు చేపట్టకపోవడం వల్ల వ్యాపారులతో సంబంధాలు పెరిగి చర్యలకు వెనుకాడాల్సి వస్తోందని సీఐలు డీసీ దృష్టికి తీసుకువచ్చారు.
ఇంటెలిజెన్స్ తరహాలో బెల్టు షాపుల నిర్మూలనకు ఎక్సైజ్ శాఖలో కూడా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయి అధికారుల నుంచి సేకరించిన అభిప్రాయాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. సమావేశంలో స్టేట్ టాస్క్‌ఫోర్స్ సీఐ శ్యామ్‌సుందర్‌తో పాటు కర్నూలు, నంద్యాల ఏఈఎస్‌లు సుధాకర్, హెప్సీబారాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment