kurnool police
-
మంత్రి బంధువునని చెప్పినా డోంట్‌కేర్
కర్నూలు (సెంట్రల్): కర్నూలు జిల్లాలో పోలీసులు పేకాటరాయుళ్ల ఆట కట్టించారు. రాష్ట్ర మంత్రి దూరపు బంధువు తమను అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు ఏమాత్రం ఉపేక్షించలేదు. పేకాటరాయుళ్లకు చెందిన 36 కార్లతో పాటు రూ. 5.34 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ గౌతమిసాలి గురువారం విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో కర్ణాటక మద్యం అక్రమంగా విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు మూడు బృందాలను ఆటోల్లో అక్కడికి పంపారు. మంత్రి జయరాం దూరపు బంధువు నారాయణతో పాటు మరికొందరు పోలీసు ఆటోలను అడ్డుకుని దాడి చేశారు. ఆటోల అద్దాలు పగులగొట్టారు. పోలీసులను తోసివేయడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు అదనపు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ టెంట్లు వేసుకుని పేకాట ఆడుతున్నవారు కనిపించారు. వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మిగిలినవారు పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు. పోలీసులపై ప్రశంసలు.. మంత్రి జయరాం బంధువులమని చెప్పినపట్పికీ పోలీసులు కఠినంగా వ్యవహరించడంపట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారినైనా వదలొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు పేకాట రాయుళ్ల ఆటకట్టించారు. తమ విధులకు ఆటంకం కలిగించినవారిలో మంత్రి బంధువులతో సహా ఎంతటివారు ఉన్నాసరే ఉపేక్షించేది లేదని, నిబంధనలమేరకు కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ గౌతమిసాలి స్పష్టం చేశారు. -
పోలీసులే "ఆ నలుగురు"
ప్యాపిలి: కరోనా పేరు వింటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. బంధువులు మృతి చెందినా చివరి చూపులకు సైతం రావడం లేదు. అంత్యక్రియలు నిర్వహించడానికీ వెనుకంజ వేస్తున్నారు. ఇలాంటి ఘటనే ప్యాపిలి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి (46) ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. అయితే అతని దుకాణంలో పని చేస్తున్న గుమాస్తాకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతనికి కూడా కరోనా సోకి మృతి చెందాడని భావించిన బంధువులు.. మృతదేహాన్ని చూసేందుకు సైతం రాలేదు. స్థానికులు కూడా ఆ వైపు వెళ్లేందుకు భయపడ్డారు. దీంతో అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితి తలెత్తింది. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు రాజానారాయణ మూర్తి, గడ్డం భువనేశ్వర్ రెడ్డి.. ఎస్ఐ మారుతీశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన కమ్యూనిటీ పోలీసులు (సీపీఓలు) పవన్, జగదీష్, సత్య, విజయ్, రాము తదితరులతో కలిసి పీపీఈ కిట్లు ధరించి ..వ్యాపారి మృతదేహాన్ని బ్యాటరీ రిక్షాలో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్ఐ స్వయంగా బ్యాటరీ రిక్షాను నడిపి మృతదేహాన్ని తీసుకెళ్లారు. మానవత్వంతో స్పందించిన ఎస్ఐను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. -
ఖాకీకి అవినీతి మకిలి
కర్నూలుకు చెందిన గోపాల్‌రెడ్డి అనే చిట్‌ఫండ్ వ్యాపారిపై నమోదైన చీటింగ్ కేసులో అతనిపై రౌడీషీట్ తెరవకుండా ఉండేందుకు సీసీఎస్ సీఐ రామయ్య నాయుడు లంచం డిమాండ్ చేసి సోమ వారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డా డు. ఆయన తరఫున మధ్యవర్తిగా వ్యవహరించిన న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డిని కూడా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కర్నూలు: గోస్పాడు మండలం కానాలపల్లెకు చెందిన పుల్లయ్య కుమారుడు శత్రుఘ్న శశాంక్ పదో తరగతి టీసీని పోలీస్ స్టేషన్ ద్వారా పొందేందుకు ప్రయత్నించాడు. అయితే ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి రూ.30 వేలు డిమాండ్ చేశాడు. ఆ మొత్తం ఇచ్చేందుకు పుల్లయ్య అంగీకరించి ఆగస్టు 11న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కానాలపల్లె సమీపంలోని గోదాము వద్ద కానిస్టేబుల్ హరినాథ్ వచ్చి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతన్ని విచారణ చేయగా ఎస్ఐ ఆదేశాల మేరకే తాను డబ్బు తీసుకున్నానని చెప్పాడు. ♦ హెడ్ కానిస్టేబుల్ సూర్య నారాయణరెడ్డి ద్వారా ఓ కేసు విషయంలో రూ.20 వేల లంచం తీసుకుంటూ కర్నూలు అర్బన్ తాలూకా సీఐగా పని చేసిన ఇస్మాయిల్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. ♦ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న అభియోగంపై నంద్యాల డీఎస్పీగా పని చేసిన హరినాథరెడ్డిపై ఏసీబీ అధికారు లు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ♦ భార్యాభర్త కేసులో కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ పెద్దయ్యరూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ♦ అక్రమ సరుకు రవాణా వాహనాన్ని విడుదల చేసేందుకు రూ.50 వేలు లంచం తీసుకుంటూ ట్రాఫిక్ విభాగంలో పని చేసిన సీఐ ఏసీబీ వలకు చిక్కారు.ఇలా కొంతకాలంగా పోలీసు అధికారులు ఏసీబీకి పట్టుబడుతూ ఆ శాఖను అప్రతిష్టను మంటగలుపుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి, లంచగొండితనం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఏయే శాఖల్లో అవినీతి జరుగుతోందో తెలుసుకునేందుకు ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా ఇన్ఫార్మర్లను నియమించుకున్నారు. వారిచ్చే సమాచారం ఆధారంగా అవినీతిపరుల భరతం పడుతున్నారు. లంచాల కోసం పట్టిపీడిస్తున్న అధికారుల జాబితాను ఏసీబీ తయారు చేసినట్లు తెలుస్తోంది. తాజా జాబితాలో మరో ఆరుగురు పోలీసు అధికారులు ఉన్నట్లు సమాచారం. లంచాలు తీసుకోవడమే కాకుండా ఆదాయానికి మించి ఆస్తులను సంపాదిస్తున్న వారిపైనా ఏసీబీ అధికారులు కన్నేసి ఉంచారు. ఈ సమాచారాన్ని ముందుగానే పసిగడుతున్న కొంతమంది..ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ శాఖల్లోని అధికారులు ముందు జాగ్రత్తగా సెలవుపై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. లంచం తీసుకుంటూ ఇటీవల కాలంలోనే ముగ్గురు పోలీసు అధికారులు పట్టుబడడం, తాజాగా సీసీఎస్ సీఐ రామయ్య నాయుడు కూడా ఏసీబీ వలకు చిక్కి.. ఆ శాఖ డీఎస్పీ నాగభూషణంపైనే తిరుగుబాటు చేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాలో ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు 19 కేసులు నమోదు చేశారు. ఈ కేసులతో సంబంధం ఉన్న సుమారు 23 మందిని రిమాండ్‌కు పంపారు. అలాగే మూడు సందర్భాల్లో ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించి అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. నేరుగాఫిర్యాదు చేయొచ్చు అవినీతి అధికారులపై బాధితులెవరైనా ఫోన్ ద్వారా లేదా నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. బాధితులతో పాటు సాధారణ ప్రజలకు కూడా ప్రశ్నించే అధికారం ఉంది. బాధితుల పేర్లు గోప్యంగా ఉంచి.. వారికి పూర్తి రక్షణ కల్పిస్తాం. – నాగభూషణంఏసీబీ డీఎస్పీ -
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు
సాక్షి, కర్నూలు: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టును కర్నూలు త్రీ టౌన్ పోలీసులు రట్టు చేశారు. బుధవారం ముఠాపై దాడి చేసిన త్రీ టౌన్ పోలీసులు.. ముఠాలోని 15 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5,56,500 రూపాయల నగదుతో పాటు, 2.25 కోట్ల రూపాయల విలువ చేసే 189 ప్రామిసరీ నోట్లు, 30 సెల్ఫోన్లు, 92 చెక్కులు, ఒనిడా టీబీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన మరో 11 మంది పరారిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు కొనసాగుతుందన్నారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడినా, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, క్రికెట్ బెట్టింగ్‌లో పట్టుబడిన వారిలో విద్యార్థులు అధికంగా ఉండటం స్థానికంగా ఆందోళన కలిగిస్తుంది. -
రౌడీషీటర్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి
కర్నూలు: ఎన్నికల వేళ నేతల ముసుగులో రౌడీషీటర్లు రెచ్చిపోకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే వారి కదలికలపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం జిల్లా పోలీసు శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఆరు మాసాల క్రితం కర్నూలు శివారులోని సుంకేసుల రోడ్డులో వీకే వైన్‌షాప్ వద్ద రౌడీషీటర్ చాకలి రాముడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇతన్ని ఆదిత్య నగర్లో నివాసముంటున్న మరో రౌడీషీటర్ మతిన్ బాషా బీరు బాటిల్‌తో పొడిచి..బండరాయితో మోది పరారయ్యాడు. అలాగే ఈ నెల 8వ తేదీన సాయిబాబా సంజీవయ్య నగర్‌కు చెందిన రౌడీషీటర్ చెన్నయ్య దారుణహత్యకు గురయ్యాడు. ఇతని కళ్లల్లో ఇసుక చల్లి, బండరాళ్లతో మోది, కత్తులతో పొడిచి తుంగభద్ర నది ఒడ్డున దారుణంగా హత్య చేశారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా అధికార పార్టీకి చెందిన అభిరుచి మధు అనే వ్యక్తి కత్తి పట్టుకుని హల్చల్ చేశాడు. జిల్లాలో కొందరు రౌడీషీటర్లు నేతల పంచన చేరి ఇలా అరాచకం చేస్తున్నారని పోలీసులు అంచనాకు వచ్చారు. నెల రోజుల నుంచి రౌడీషీటర్లను జిల్లా వ్యాప్తంగా స్టేషన్లకు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇక మీదట ఎలాంటి వివాదాల్లో తలదూర్చబోమని, ప్రశాంతంగా జీవనం సాగిస్తామని ప్రమాణ పత్రాలు తీసుకుంటున్నారు. ముగ్గురిపై పీడీ యాక్ట్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేర ప్రవృత్తి గల ముగ్గురు వ్యక్తులపై పోలీసులు జిల్లాలో మొదటిసారిగా పీడీ యాక్ట్ నమోదు చేసి.. కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలం, చిన్నకందుకూరు గ్రామాల్లో అల్లర్లకు పాల్పడే అవకాశం ఉండటంతో గూడూరు సంజీవరాయుడు, పెద్దిరెడ్డి కొండారెడ్డి, నాసారి వెంకటేశ్వర్లు పూర్వపు నేర చరిత్రను పరిశీలించి.. వారిపై పీడీ యాక్టు నమోదు చేసి రాత్రికి రాత్రే కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అహోబిలం గ్రామానికి చెందిన గూడూరు సంజీవరాయుడుపై 1993 నుంచి ఇప్పటివరకు 12 కేసులు ఉన్నాయి. ఆళ్లగడ్డ రూరల్ స్టేషన్లో ఈ ఏడాది రౌడీషీట్(షీట్ నంబర్ 199) తెరిచారు. ఇదే గ్రామానికి చెందిన నాసారి వెంకటేశ్వర్లు అలియాస్ సీసా వెంకటేశ్వర్లుపై మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. 1996 నుంచి రౌడీషీట్ (నంబర్ 71) ఉంది. అలాగే చిన్నకందుకూరు గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి కొండారెడ్డిపై తొమ్మిది కేసులు నమోద య్యాయి. నలుగురిని హత్య చేసినట్లు పోలీసు రికార్డులకెక్కాడు. 2006 నుంచి ఆళ్లగడ్డ రూరల్ స్టేషన్లో రౌడీషీట్ (షీట్ నంబర్ 165) నమోదై ఉంది. కదలికలపై దృష్టి జిల్లాలో రౌడీషీటర్ల వ్యాపకం ఎలా ఉంది, వారు స్థానికంగానే ఉంటున్నారా, ఒకవేళ బయటకు వెళితే తిరిగి ఎన్ని రోజులకు ఇళ్లకు చేరుకుంటున్నారు, నేతలతో ఎలా అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు వంటి సమస్త సమాచారాన్ని స్టేషన్ల వారీగా సేకరిస్తున్నారు. ప్రతి స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లను ఆ స్టేషన్ సిబ్బంది కనిపెట్టి ఉండేలా బాధ్యతలు అప్పగించారు. గత ఎన్నికల సమయంలో రౌడీషీటర్ల మాటున నేతలు హల్చల్ చేసిన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా పోలీసు బాస్ ఇప్పటికే సబ్ డివిజన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో నమోదైన కేసుల ఆధారంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నాలుగేళ్ల నుంచి జిల్లాలో పనిచేసిన సీఐలను ఎన్నికల నేపథ్యంలో పొరుగు జిల్లాలకు సాగనంపారు. కొత్తగా వచ్చిన సబ్ డివిజన్ స్థాయి అధికారులతో పాటు ఇన్స్పెక్టర్లకు రౌడీల ఆగడాలపై పెద్దగా అవగాహన ఉండదని భావించిన ఎస్పీ ఫక్కీరప్ప రౌడీషీటర్లు టార్గెట్‌గా ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా వారి ప్రతి కదలికను ఎప్పటికప్పుడు డీఎస్పీలతో పాటు స్టేషన్ ఇన్స్పెక్టర్కు చేరవేసే బాధ్యతను కానిస్టేబుళ్లకు అప్పగించాలని అన్ని సబ్ డివిజనల్ అధికారులను ఆదేశించారు. 3,496 మంది రౌడీషీటర్లు జిల్లాలో రౌడీషీట్లు కలిగినవారు 3,496 మంది, కేడీ షీట్లు కలిగినవారు సుమారు 1,500 మంది ఉన్నారు. వీరిలో క్రియాశీలకంగా ఉండేవారు జిల్లా మొత్తం మీద 150 మందికి పైగా ఉన్నారు. ఏ+, ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి..వారు రెండు వారాలు లేదా నెలకు ఒకసారి స్టేషన్‌కు వచ్చి కనపడేలా చర్యలు చేపట్టారు. అయితే.. కొందరు సక్రమంగా రాకపోవడం, మరికొందరు అనారోగ్య కారణాలతో రాలేకపోతున్నామని చెబుతుండటంతో.. వారు చెప్పే కారణాలు సహేతుకమేనా అనే విషయాన్ని కానిస్టేబుళ్లు వారి ఇళ్లకు వెళ్లి విచారించేలా బాధ్యతలు అప్పగించారు. స్టేషన్ల వారీగా నిఘా: కానిస్టేబుళ్లు రాత్రి గస్తీ (నైట్ బీట్) విధులు నిర్వహించేటప్పుడు, పాత కేసులకు సంబంధించిన వివరాల సేకరణకు వెళ్లినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న రౌడీషీటర్ల ఇళ్లను కచ్చితంగా టచ్ చేసి.. వారి కుటుంబీకులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని రావాలి. కానిస్టేబుళ్లు వెళ్లిన సమయానికి రౌడీషీటరు ఇంటి వద్ద లేకపోతే ఎక్కడికి వెళ్లారో కుటుంబ సభ్యులతో పాటు ఇరుగూ పొరుగు వారితో ఆరా తీయాలి. స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్ల వ్యాపకాలను పరిశీలించే కానిస్టేబుళ్ల నిఘా లోపమున్నట్లు తేలితే వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ఆదేశాలు ఇచ్చారు. వచ్చేది ఎన్నికల సీజన్ కావడంతో నేతలు రౌడీషీటర్లను అన్ని విధాలా ప్రోత్సహించే అవకాశం ఉంటుందని భావించి రాజకీయాలకు అతీతంగా ఉక్కుపాదం మోపుతున్నామని ఓ సబ్ డివిజన్ అధికారి చెప్పారు. -
అధికార పార్టీ నేతలకు భయపడున్నా: ఎక్సైజ్ సీఐలు
కర్నూలు: ‘బెల్టు దుకాణాలపై దాడులు చేసి పట్టుబడిన మద్యం ఏ షాపు నుంచి వచ్చిందో నిర్ధారించుకుని కేసులు నమోదు చేసి సస్పెండ్ చేస్తే అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఈ కారణంగానే బెల్టు దుకాణాలను నిర్మూలించలేకపోతున్నాం’ అంటూ కర్నూలు, అనంతపురం జిల్లాల ఎక్సైజ్ సీఐలు డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు దృష్టికి తెచ్చారు. కలెక్టరేట్లోని డ్వామా కాన్ఫరెన్స్ హాల్లో గురువారం కర్నూలు, అనంతపురం జిల్లాల ఎక్సైజ్ సీఐలతో డిప్యూటీ కమిషనర్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా సీఐలు ఆయన దృష్టికి పలు విషయాలు తెచ్చారు. కర్నూలు జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 6 మద్యం షాపులను సస్పెండ్ చేస్తే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని, దీనివల్ల తాము పడుతున్న కష్టం వృథా అవుతోందని సంబంధిత సీఐలు డీసీకి వివరించారు. లక్ష్యాలకు తగ్గకుండా అమ్మకాలు జరపాలన్న ఒత్తిడి వల్ల కూడా వ్యాపారులు బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారని, బెల్టు దుకాణ నిర్మూలనకు గ్రామాల్లో రెవెన్యూ అధికారులు సహకరించడం లేదని, మద్యం వ్యాపారులు బార్ కోడ్‌లో డేటాను నిల్వ చేయకుండా తారుమారు చేయడం వల్ల సరైన ఆధారాలు లభించడం లేదని, సకాలంలో సీఐల బదిలీలు చేపట్టకపోవడం వల్ల వ్యాపారులతో సంబంధాలు పెరిగి చర్యలకు వెనుకాడాల్సి వస్తోందని సీఐలు డీసీ దృష్టికి తీసుకువచ్చారు. ఇంటెలిజెన్స్ తరహాలో బెల్టు షాపుల నిర్మూలనకు ఎక్సైజ్ శాఖలో కూడా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయి అధికారుల నుంచి సేకరించిన అభిప్రాయాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. సమావేశంలో స్టేట్ టాస్క్‌ఫోర్స్ సీఐ శ్యామ్సుందర్తో పాటు కర్నూలు, నంద్యాల ఏఈఎస్‌లు సుధాకర్, హెప్సీబారాణి పాల్గొన్నారు. -
ఐదు కోట్లు దోపిడీ: భీమ్‌సింగ్ ఎన్కౌంటర్
సాక్షి, హైదరాబాద్ : కర్నూలు జిల్లా డోన్ ఓబులాపురం మిట్ట వద్ద సినీఫక్కీలో జరిగిన భారీ దారిదోపిడీకి పాల్పడ్డ నిందితుడు భీమ్‌సింగ్ ఎట్టకేలకు రాజస్థాన్‌లో ఎన్కౌంటర్ అయ్యాడు. భీమ్‌సింగ్ గత నెల డోన్ హైవేపై రూ.5 కోట్లు దోచుకుని పరారైన విషయం తెలిసిందే. 144 కేసుల్లో నిందితుడు అయిన అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భీమ్‌సింగ్ రాజస్థాన్‌లోని జానూర్ జిల్లాలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఓ వాహనంలో ఉన్న భీమ్‌సింగ్‌ను పోలీసులు చుట్టుముట్టగా, అతడు పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో భీమ్‌సింగ్ సహా వాహన డ్రైవర్ హతమయ్యాడు. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌కు చెందిన నీలేష్ అనే వ్యక్తి దగ్గర మనీ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన వద్ద అసిస్టెంట్ అరవింద్ కుమార్ సింగ్.. కల్పద్రుమ జేమ్స్ జ్యువెలరీ లిమిటెడ్‌కు చెందిన అక్షయ్ రాజేంద్ర లునావత్ అనే వ్యక్తికి చెందిన రూ.5.5 కోట్ల డబ్బును నీలేష్ నందలాల్ సీద్‌పుర అనే మనీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి అప్పజెప్పేందుకు నీలేష్ గతనెల 12వ తేదీ రాత్రి డ్రైవర్ కరణ్‌చౌబే, అసిస్టెంట్ అరవింద్ కుమార్ సింగ్‌తో కలసి హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు స్కార్పియో వాహనం(ఏపీ09 సీడబ్ల్యూ 0880)లో బయలుదేరారు. వీరు డోన్ దాటిన తర్వాత ఓబులాపురం ప్రాంతంలో స్విఫ్ట్ డిజైర్, హోండా మొబిలీ వాహనాలతో ఓవర్టేక్ చేసిన కొందరు దుండగులు ఆ వాహనాన్ని అడ్డుకుని..అందులో ఉన్న డబ్బును వాళ్ల వాహనంలోకి మార్చుకున్నారు. స్కార్పియో వాహనాన్ని ప్యాపిలి సమీపంలోని ఓ చెరువు ప్రాంతంలో వదిలేసి.. దొంగలు వాళ్ల వాహనంలో నీలేష్‌తో పాటు డ్రైవర్ కరణ్‌చౌబే, అతని అసిస్టెంట్ అరవింద్ కుమార్ సింగ్‌లను ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆరుగురు రెండు వాహనాల్లో తుపాకులతో పాటు ఇతర ఆయుధాలతో తమను బెదిరించినట్లు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 177/217 అండర్ సెక్షన్ 324, 365, 395, 397, 25(1) (ఆ) (b) ఆయుధ చట్టం 1959 కింద బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డోన్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. అప్పటి నుంచి హైదరాబాదుతో పాటు నాగ్‌పూర్‌కు కూడా దర్యాప్తు కోసం ప్రత్యేక బందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఎట్టకేలకు దోపిడీకి పాల్పడిన భీమ్‌సింగ్‌ను రాజస్థాన్‌లో హతమర్చారు. -
వింత దొంగ బైక్‌లు ఎత్తికెళ్లి..
-
'ఆ గ్యాంగ్‌లు కనిపిస్తే కాల్చిపారేయండి'
కర్నూలు: పొరుగున ఉన్న కర్ణాటకతోపాటు అనంపురం జిల్లా గుంతకల్లులో నివాసముంటున్న ఇరానీ బందిపోటు గ్యాంగ్‌లు హల్చల్ చేస్తున్నాయి. దోపిడీలు, దొంగతనాలతో రెచ్చిపోతున్న ఈ గ్యాంగులు కర్నూలు జిల్లాలోకి ప్రవేశించడంతోనే కాల్చిపారేయాలని జిల్లా పోలీసులు గురువారం ఆదేశాలు ఇచ్చారు. ఇరానీ బందిపోటు గ్యాంగులకు సంబంధించి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీచేసినట్టు కర్నూలు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. సుమారు ఐదు గ్యాంగ్‌లు జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో సంచరిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ నేతృత్వంలో ఐదుగురు పోలీసులకు ప్రత్యేక తర్ఫీదునిచ్చి ఆయుధాలతో గస్తీ విధులకు నియమించామని తెలిపారు. సీసీఎస్ పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి అనంతపురం, బళ్లారి ప్రాంతాల్లో దొంగల కోసం గాలిస్తున్నారన్నారు. నేర నివారణ కోసం సుమారు 70 మంది పోలీసులతో గస్తీ పెంచామని చెప్పారు. -
'మోసం చేయాలనుకుంటే ఐపీ పెట్టేవాడ్ని'
కర్నూలు: మంచి ఉద్దేశంతోనే డిపాజిట్లు సేకరించానని, మోసం చేసే ఉద్దేశం తనకు లేదని కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి తెలిపారు. మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే ఐపీ పెట్టేవాడినని, ఏడాది ఆగితే అందరికీ చెల్లిస్తానని ఆయన తెలిపారు. లేదంటే ప్రభుత్వం తన ఆస్తులను జప్తు చేసుకోవచ్చని కేశవరెడ్డి గురువారమిక్కడ అన్నారు. కాగా కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిని కర్నూలు సిసిఎస్ పోలీసులు గతరాత్రి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కేశవరెడ్డి పేరుతో విద్యాసంస్థలు నడుపుతున్న ఆయనపై అనేక ఫిర్యాదులు అందాయి. తమ సంస్థల స్కూళ్లు, కాలేజీల్లో జాయినింగ్ సమయంలో విద్యార్థుల నుంచి లక్ష రూపాయల నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకూ కేశవరెడ్డి డిపాజిట్లు సేకరించారు. ఆ డిపాజిట్ల సొమ్ము దాదాపు 8వందల కోట్ల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రులకు బాకీ పడ్డట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి ఫిర్యాదుతో కేశవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించటంతో ఆయనపై అయిదు కేసులు నమోదు చేశారు. అయితే కేశవరెడ్డి బాధితులు.. భారీగానే వున్నారు. ఒక్కోజిల్లాలో కోట్లాది రూపాయలు వసూల్ చేసినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో మూడు సెంటర్లలో కేశవరెడ్డి విద్యాసంస్థలు నెలకొల్పారు. మదనపల్లిలో విద్యార్థుల తల్లిదండ్రులకు రూ.12 కోట్లు, చిత్తూరులో రూ.4 కోట్లు బకాయిపడ్డట్లు తెలుస్తోంది. తిరుపతి బ్రాంచ్‌లో కూడా పెద్దఎత్తున చెల్లించాల్సి ఉందని సమాచారం. ఈ బకాయిలుతో గత యాజమాన్యానికి సంబంధం లేదని, కొత్త యాజమాన్యం జూలైలో ఇస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ మారిపోయింది. ఆ మేనేజ్మెంట్ కూడా చేతులెత్తేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేశవరెడ్డిని అరెస్ట్ చేసిన కర్నూలు సీసీఎస్ పోలీసులు కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. -
'అధికారంలోకి రాగానే కొమ్ములొచ్చాయా?'
-
ఆమ్వే సీఈవో విలియం స్కాట్ పింక్నీ అరెస్ట్
-
ఆమ్వే సీఈవో విలియం స్కాట్ పింక్నీ అరెస్ట్
కర్నూలు : ఆర్థిక అవకతవకల ఆరోపణలపై నెట్వర్క్ మార్కెటింగ్ సంస్థ ఆమ్వే ఇండియా చైర్మన్ విలియం స్కాట్ పింక్నీ మరోసారి అరెస్ట్ అయ్యారు. చీటింగ్ కేసులో ఆయనను కర్నూలు పోలీసులు గుర్గావ్లో అదుపులోకి తీసుకున్నారు. విలియం స్కాట్ పింక్నీపై కర్నూలు జిల్లాలో పలు కేసులు నమోదు అయ్యాయి. ఆమ్వే సంస్థ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. గుర్గావ్లోని ఆమ్వే కేంద్ర కార్యాలయంలో పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతను అరెస్ట్ కావటం ఇది రెండోసారి. 2013లోనూ స్కాట్ పింక్నీతో పాటు ఆసంస్థకి చెందిన ఇద్దరు డెరైక్టర్లను(అన్షు బుధ్రాజా, సంజయ్ మల్హోత్రా) కేరళ పోలీసులు అరెస్టు చేశారు. మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధ) చట్టం నిబంధనల ఉల్లంఘన కింద 2011లో వాయనాడ్ క్రైమ్ బ్రాంచ్‌లో వీరిపై 3 కేసులు నమోదయ్యాయి. విలియం స్కాట్ పింక్నీపై దేశవ్యాప్తంగా పలు కేసులున్నాయి. మరోవైపు ఆమ్వే సంస్థ మాత్రం తాము చట్టబద్దంగానే వ్యాపారం చేస్తున్నట్లు చెప్పుకోవటం విశేషం. మరికాసేపట్లో పింక్నీని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. -
కావ్.. కావ్.. ఖాకీ