వ్యాపారి మృతదేహాన్ని బ్యాటరీ రిక్షాలోకి తరలిస్తున్న ఎస్‌ఐ మారుతీ శంకర్, సీపీఓలు
ప్యాపిలి: కరోనా పేరు వింటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. బంధువులు మృతి చెందినా చివరి చూపులకు సైతం రావడం లేదు. అంత్యక్రియలు నిర్వహించడానికీ వెనుకంజ వేస్తున్నారు. ఇలాంటి ఘటనే ప్యాపిలి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి (46) ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. అయితే అతని దుకాణంలో పని చేస్తున్న గుమాస్తాకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతనికి కూడా కరోనా సోకి మృతి చెందాడని భావించిన బంధువులు..
మృతదేహాన్ని చూసేందుకు సైతం రాలేదు. స్థానికులు కూడా ఆ వైపు వెళ్లేందుకు భయపడ్డారు. దీంతో అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితి తలెత్తింది. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకులు రాజానారాయణ మూర్తి, గడ్డం భువనేశ్వర్ రెడ్డి.. ఎస్‌ఐ మారుతీశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన కమ్యూనిటీ పోలీసులు (సీపీఓలు) పవన్, జగదీష్, సత్య, విజయ్, రాము తదితరులతో కలిసి పీపీఈ కిట్లు ధరించి ..వ్యాపారి మృతదేహాన్ని బ్యాటరీ రిక్షాలో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్‌ఐ స్వయంగా బ్యాటరీ రిక్షాను నడిపి మృతదేహాన్ని తీసుకెళ్లారు. మానవత్వంతో స్పందించిన ఎస్‌ఐను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment