funeral service
-
వాళ్లను గుర్తించే సంస్కారం లేదా?
ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో శ్మశానాలలో శవాలు బారులు తీరి ఉండడం, దహన సంస్కారాలకు చోటే దొరక్క పోవడం, కుప్పలుతెప్పలుగా వస్తోన్న శవాలను దహనం చేయడంలో కాటికాపరులు పడుతోన్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. శ్మశానాలకు వచ్చే పోయే వారివల్ల జబ్బులపాలై మరణిస్తోన్న వీరి ప్రాణాలను లెక్కలు కట్టే నాథుడే లేడు. వారి చావులకు ఏ సంస్కారాలూ ఉండవు, ఏ సంస్కారులకీ వారి చావులు పట్టవు. తమ జీవితాలను ఫణంగా పెట్టి దహన సంస్కారాలు చేస్తున్న వాళ్ళమని చెప్పుకోవడానికి గానీ, ఎదుటి వారు నమ్మడానికి గానీ వారికో గుర్తింపు కార్డు లేదు. శ్మశానాల్లో శవాలతో ప్రతిరోజూ చస్తూ బతికే వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాల్సిన అవసరాన్ని ఇప్పటికైనా గుర్తించాలి. ‘‘ఏది నా భార్య. ఏది నా కుమారుడు, నేను ఏకాకిని, కాదు... సర్వజనులూ ఏకాకులే... అన్నదమ్ములున్, ఆలు బిడ్డలున్, కన్నతల్లిదండ్రులున్, స్నేహితుల్, బంధువుల్ వెంటరారు తుదిన్..! వెంటవచ్చునది అదే సత్యం.. అదే యశస్సు’’ ఇవి సత్యహరిశ్చంద్ర పద్యనాటకంలో, హరిశ్చంద్రుడు శ్మశానంలో ఆలపించిన పద్యంలోని కొన్ని పంక్తులు. ప్రముఖ సాహితీ వేత్త బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాసిన ఈ పద్యం ఈనాటి కోవిడ్ పరిస్థితులకు అద్దం పడుతోంది. మనిషి జీవితం క్షణభంగురమేననీ, ఎంతటి సంపన్నుడైనా తనువు చాలించిన తరువాత ఎవ్వరూ వెంట రారని, ఎంతగా ప్రేమించేవారైనా, గౌరవించేవారైనా చనిపోయిన వాళ్ళతో ఎవ్వరూ మరణించరు అని తేల్చి చెప్పేదే ఈ పద్యం. కానీ, ఈ రోజులు మహా చెడ్డవి. బ్రతుకు మీద భ్రమలు సన్నగా చెరిగిపోతోన్న స్థితి. ఎప్పుడో ఒకప్పుడు వినిపించే చావు మాట ఇప్పుడు ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తూ, సమస్త జనావళిలో విషా దాన్ని నింపుతోంది. చనిపోయిన వారితో చనిపోనక్కర్లేదు, కానీ కనీసం మరణించిన వారి జ్ఞాపకాలను మననం చేసుకుంటూ శ్మశానం దాకా తోడెళ్ళేవారే కరువైన దుస్థితి. ఇంత దయనీయ స్థితిలోనూ మన శరీరం మట్టిలో కలిసిపోయేందుకు తోడ్పడే మనిషి మరొకరుంటారు. అతడే కాటికాపరి. ఇంతటి ఘోర విపత్తులోనూ ఏ బంధమూ, సంబం ధమూ లేకపోయినా, కాటిలో తోడు వస్తున్నది, కట్టెకాలే వరకూ కడ దాకా నిలుస్తున్నదీ కాటికాపరులు మాత్రమే. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో శ్మశానాలకు కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతోన్న శవాలకు శాస్త్రోక్తంగా మంత్రతంత్రాల మధ్య దహన సంస్కారాలు కానిచ్చే పరి స్థితుల్లేవు. కానీ, కాటికాపరులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వేన వేల శవాల దిబ్బలను అపురూపంగా పేరుస్తున్నారు. ఎంతో శ్రద్ధతో అనామకుల శవాలకు దహన సంస్కారాలు చేస్తున్నారు. ఆయా మతానుసారంగా దహన సంస్కారాలు జరుపుతారు. ఒకరు పూడ్చిపెడితే, మరొకరు కాలుస్తారు. దళితులు సహా కొన్ని శూద్రకులాలు ఖననం చేస్తారు. దహనం కానీ, ఖననం కానీ చిన్న చిన్న పల్లెల్లో, గ్రామాల్లో నదులు, వాగులు, నీటి ప్రవాహాలున్న చోట్ల, నది ఒడ్డున జరుగుతుంటాయి. అక్కడ ప్రత్యేకించి శ్మశానాలు తక్కువ. ఒకవేళ ఉన్నా, ప్రత్యేకించి కాటికాపరులు ఉండరు. అయితే ఇలాంటి చోట్ల కూడా అంటరాని కులాలుగా ముద్రపడిన దళితులతోనే తరతరా లుగా ఆ పనిచేయిస్తుంటారు. దహనమైతే చెట్లు నరికి కట్టెలు బండ్ల కెత్తి, చితిపేర్చి, దహనకార్యక్రమాన్ని నిర్వహించే వరకూ వారే చేస్తారు. ఖననమైతే గోతిని తవ్వి పాతిపెట్టే కార్యక్రమం దళితులే చేస్తారు. అందుకు వారికిచ్చే డబ్బులు అతి స్వల్పం. నగరీకరణ తర్వాత జనాభా పెరుగుతూండడంతో నీటి వనరుల అవకాశాలు తక్కువగా ఉండడం వల్ల ప్రత్యేకించి శ్మశానాలు తప్పని సరి అయ్యాయి. దానితో కొంతమందికి అందులో పనిచేసే అవకాశం వచ్చింది. అందరూ అసహ్యించుకునే పనులు, ఎవ్వరూ సాహసించని పనులు, అందరూ నీచంగా చూసే పనులు చేయాల్సింది మళ్ళీ ఆ దళి తులే. అగ్రవర్ణాల అవసరం వీరికి పని కల్పించింది. అలా దేశ వ్యాప్తంగా ఈ పనిలో ఉంటున్నవాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఇప్పటికీ ఉత్తరాదిలో డోమ్, ఛమార్, మహర్లు. దక్షిణాదిన అయితే మాల, మాదిగ, పరయ, పులియ, హోలియ కులాలు మాత్రమే అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు. మరే కులంవారూ ఈ పనిలో ఇప్పటికీ లేరు. ఉండరు. ఎందుకంటే శవం మన దగ్గర విలువలేనిది. అది భయంగొలిపేది. రోగాలను వెంట తెచ్చేది. అదే భావన వల్ల కావచ్చు. ఇలాంటి భయంగొలిపే పనుల్లో సౌకర్యవంతమైన, సుఖవంతమైన ఇతర వర్గాలుండకపోవడం మన దేశంలోని కుల‘సంస్కారాల్లో’ ఒకటి. దళిత జాతిని నీచంగా చూసే కుసంస్కారమే తప్ప అది మరొ కటి కాదు. ఇదొక్కటే కాదు ప్రమాదకరమైన పనులు, వృత్తులు, అన్నీ మాల, మాదిగల్లాంటి కులాలే చేశాయి. ఇప్పటికీ చేస్తున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్‌లో మరణిస్తోన్న వారి సంఖ్య చాలా ఎక్కువ. ప్రభుత్వాలు చూపెడుతోన్న లెక్కలు, కాకి లెక్కలన్నది జగమెరిగిన సత్యం. అయితే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో శ్మశానాలలో శవాలు బారులు తీరి ఉండడం, దహన సంస్కారాలకు చోటే దొరక్కపోవడం. కుప్పలుతెప్పలుగా వస్తోన్న శవాలను దహనం చేయడంలో కాటికాపరులు పడుతోన్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు, వాస్తవ పరిస్థితులు మరింత దయనీయంగానే ఉంటాయన్నది తెలిసిన విషయమే. ఈ పరిస్థితుల్లో శ్మశానాలకు వచ్చే పోయే వారివల్ల జబ్బులపాలై మరణిస్తోన్న వీరి ప్రాణాలను లెక్కలు కట్టే నాథుడే లేడు. వారి చావులకు ఏ సంస్కారాలూ ఉండవు, ఏ సంస్కారులకీ వారి చావులు పట్టవు. ఇటీవల హైదరాబాద్‌లోని మల్లె పల్లి ప్రాంతంలో దహన సంస్కారాల్లో ఉన్న కాటికాపరి యువకులు కాస్త విరామం దొరికితే తిండితినేందుకు వెళ్ళి వస్తుంటే, పోలీసులు అడ్డుకొని చేయిచేసుకోవడం గురించి వార్తలొచ్చాయి. కర్ఫ్యూ ఉండటం వల్ల అట్లా చేశామని పోలీసులు చెప్పారు. కానీ వాళ్ళు తమ జీవితాలను ఫణంగా పెట్టి దహన సంస్కారాలు చేస్తున్న వాళ్ళని చెప్పుకోవడానికి గానీ, ఎదుటి వారు నమ్మడానికి గానీ వారికో గుర్తింపు కార్డు లేదు. అది ఇవ్వాలన్న ధ్యాస ఇన్నేళ్ళుగా పాలకులకు పట్టలేదు. శ్మశానాల్లో శవాలతో ప్రతిరోజూ ఛస్తూ బతికే వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాల్సిన అవసరాన్ని ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించాలి. కుటుంబ సభ్యులే పారిపోతోన్న నేటి సమయంలో ఎటు వంటి రక్షణ కవచాల్లేకుండా, మాస్క్‌లు, పీపీఈ కిట్ల మాటే లేకుండా, కనీసం సురక్షితమైన మంచి తాగునీటి సౌకర్యం కూడా లేకుండా శ్మశా నాల్లో శవాల్లా విలువలేని బతుకీడుస్తోన్న వారిని గురించి చర్చిం చాల్సిన సమయమిది. వారికో గుర్తింపునివ్వాల్సిన సందర్భమిది. ఆరోగ్య భద్రతకు సంబంధించి ఎటువంటి భరోసా లేదు. వీళ్ళలో నూటికి 95 శాతం మంది ప్రభుత్వ వేతనాలు లేకుండా పని చేస్తున్నారు. సాధారణ సమయాల్లోనైతే, మృతుల కుటుంబాల నుంచో, లేదా అక్కడికి వచ్చిన వారినుంచో పదో పరకో రాలేది. కానీ ఇప్పుడు కోవిడ్ కారణంగా శవమెవరిదో, తెచ్చిందెవరో తెలియని స్థితిలో చనిపోయిన వారితో ఎటువంటి సంబంధం లేని మున్సిపా లిటీ కార్మికులు వాళ్ల భౌతిక కాయాలను మోసుకొస్తోంటే ఇక వారికి డబ్బులిచ్చే నాథుడెవరు? అయినా అక్కడ శవాలు కాలుతూనే ఉంటాయి. బంధు మిత్రుల దుఃఖం తోడుగా రావాల్సిన భౌతిక కాయాలు దిక్కూమొక్కూ లేని శవాల మూటలై చుట్టుముడుతోంటే, వీరు మాత్రం, అది తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా.. మరణిస్తోన్న సమస్త మానవాళికీ కాదనకుండా కడసారి సంస్కారాలు నిర్వహి స్తోన్న ఆ చేతులను మరువ తగునా అన్నదే నేటి ప్రశ్న. కానీ కోవిడ్ ఈ సమాజం గొప్ప సాంప్రదాయాలుగా భావి స్తున్నవాటన్నింటినీ తుడిచిపెట్టేసింది. వేదమంత్రాలతో అంతిమ సంస్కారాలు జరగకపోతే, ముక్తి లభించదని నమ్ముతున్న వేద బ్రాహ్మణులు ఈ రోజు శ్మశానాల వైపు కన్నెత్తి చూడడానికే భయపడు తున్నారు. పదులు, వందల సంఖ్యలో ఒకేసారి కాష్టాలు కాలుతోంటే వేదాల ఘోష అక్కడ ఎక్కడా వినిపించడం లేదు. ఢిల్లీలోని ఒక శ్మశాన వాటికలో కాటికాపరి కుటుంబానికి చెందిన ఒక దళిత యువకుడే వేద మంత్రాలు జపిస్తున్నట్లు వార్త వచ్చింది. సమాజంలో ఇటువంటి పాత్రను నిర్వహిస్తోన్న కాటికాపరుల జీవితాల్లో మార్పునకు ఇప్పటి వరకు ఎవ్వరూ దృష్టిసారించిన దాఖలాల్లేవు. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వృత్తిలో జీవిస్తున్నారు. కొందరి జీవితాలు ఇళ్ళులేక శ్మశా నాల్లోనే పొగచూరిపోతున్నాయి. జబ్బులపాలవుతోన్న వారు ఇంకెం దరో. ఇలాంటి ఎంతోమందికి కనీసం నిలువ నీడలేకపోవడం ప్రభు త్వాల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనంగా భావించక తప్పదు. -మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
కరోనా కాలం: మృతదేహాల అంత్యక్రియలకు ప్యాకేజీలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ సెకండ్ వేవ్ విషమించడంతో పరిస్థితి తీవ్ర ఆందోళనకంగా మారుతోంది. పాజిటివ్ కేసులు, కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య నిత్యం పెరిగిపోతుంది. ఒకవైపు కరోనా భయం ప్రజల్లో హడలెత్తిస్తుంటే మరోవైపు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి అంత్యక్రియల నిర్వహణ కరవవుతోంది. తమ సొంత వారైనా బంధువులైనా కరోనాతో మరణిస్తే.. కనీసం చివరి చూపుకు కూడా రావడం లేదు. ఇక కరోనా మృతుల దహన సంస్కారాలు నిర్వహించేందుకు అయితే పూర్తి వెనకడుగు వేస్తున్నారు. చనిపోయిన వారినుంచి కరోనా తమకు ఎక్కడ అంటుకుంటుందోనని భయంతో వెనకడుగు వేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీ సిబ్బందే కరోనా శవాలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌తో మరణించిన వారి అంత్యక్రియలు కూడా ఓ బిజినెస్‌గా మారింది. కోవిడ్ బాధిత మృతుల దహన సంస్కారాల సమస్యను పరిష్కరించేందుకు కొన్ని కార్పొరేట్ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. తగిన జాగ్రత్తలు తీసుకొని అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకొస్తున్నాయి. కోవిడ్ సోకి ఎవరైనా చనిపోతే వారిని వ్యాన్‌లో తీసుకురావడం, దహన సంస్కారాలు.. ఇలా అన్ని పనులు వీరే చూసుకుంటారు. వీటన్నింటికి కలిసి ఓ స్పెషల్ ప్యాకేజీని అందిస్తున్నారు. వీటికి 30 వేల రూపాయల నుంచి 35 వేల వరకు వసూలు చేయనున్నారు. భారత్‌లోని దాదాపు ఏడు ప్రధాన నగరాల్లో వీరి సేవలు అందుబాటులో ఉన్నాయి. చదవండి: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ ఆంథెస్టి అంత్యక్రియల సేవలు ఆంథెస్టి ఫ్యూనరల్ సర్వీసెస్ ఈ ఏజెన్సీ చెన్నై, బెంగళూరు, జైపూర్,హైదరాబాద్ వంటి నగరాల్లో బ్రాంచ్‌లున్నాయి. అదే హైదరాబాద్‌లో అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించేదుకు 32,000 వేల రూపాయలు వసూలు చేస్తుంది. వీరు సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలన్నీ పూర్తి చేస్తారు. హాస్పిటల్ నుంచి డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్లడం. దహనం చేయడం. చితాభస్మాన్ని కుటుంబీకులకు అందజేయడం ఇలాంటివన్నీ నిర్వహిస్తారు. వీరిలాగే హైదరాబాద్‌లోని ఫ్యునరల్ సేవ సర్వీసెస్ కూడా పనిచేస్తోంది. ఇది గోల్డ్, సిల్వర్ అంటు రెండు రకాల ప్యాకెజీలను అందిస్తోంది. ఇందుకు 30,000 వేల రూపాయలు తీసుకుంటున్నారు. అయితే కరోనా మరణాలు పెరిగిపోతుండటంతో స్మశానంలో స్థలం దొరకడం లేదని, తమ వ్యాపారం కష్టంగా మారుతోందని అంత్యక్రియల సేవల నిర్వహకులు చెబుతున్నారు. రోజుకి 6 నుంచి 10 కాల్స్ వస్తున్నాయని అంటున్నారు. ఏదేమైనా ఆత్మీయులు ‘దూరం’ అవుతున్న వేళ అంత్యక్రియలు నిర్వహించే ఆయా ఏజెన్సీలు అనాథ శవాల ఉదంతాలను తగ్గడానికి దోహద పడుతున్నాయనేది వాస్తవం. చదవండి: ఎట్టిపరిస్థితుల్లో వాళ్లకు రెమిడెసివిర్ వేయకూడదు! -
చివరి ప్రయాణానికి చేయూత
కరోనా కాలంలో మరణించిన వారి అంతిమ సంస్కారానికి ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయినవాళ్లు కూడా అనుమానంతో దగ్గరకు రాని స్థితి. ఉత్తరప్రదేశ్ బృందావన్‌లోని 55 ఏళ్ల డాక్టర్ లక్ష్మి గౌతమ్ మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. ఎనిమిదేళ్లుగా అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వర్తిస్తూనే ఉన్నారు. లాక్డౌన్ టైమ్‌లోనూ 7 మృతదేహాలకు అంత్యక్రియలను పూర్తి చేశారు లక్ష్మి. ఇందుకు గాను ఎవరి నుండీ సహాయం తీసుకోకుండా తలకెత్తుకున్న బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా దాదాపు 300 మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు. పోలీసులు కూడా ఎవరూ పట్టించుకోని మృతదేహాలను అంత్యక్రియల కోసం లక్ష్మికి అప్పజెబుతారు. నర్వే కోసం పడిన మొదటి అడుగు బృందావన్‌లోని ఎస్ఓపీ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు డాక్టర్ లక్ష్మి. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. 2011–12 సంవత్సరంలో సుప్రీంకోర్టు నిరాశ్రయులైన మహిళల సర్వేకు ఆదేశించింది. ఆ సర్వేలో చనిపోయిన మహిళామృతదేహాలకు దహన సంస్కారాలు సరైన విధంగా జరపడం లేదనే విషయం వెలుగులోకి వచ్చింది. ‘ఈ విషయం తెలిశాక నా మనసుకు చాలా కష్టం అనిపించింది. ఎలా జీవించారో కానీ ఎవరూ లేకుండా అనాథలా వారు అలా వెళ్లిపోకూడదనిపించింది. అదే సమయంలో నిరాశ్రయురాలైన ఓ మహిళ మృతదేహాన్ని రోడ్డుపక్కన చూశాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవ్వరూ రాలేదు. దాంతో నేనే చొరవ తీసుకొని పోలీసుల సాయంతో ఆమె మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించాను. అత్తగారి పేరిట ఫౌండేషన్ ఆ రోజునుంచి ఇప్పటివరకు మృతదేహాల దహన సంస్కారాలు చేస్తున్నాను. మొదట్లో మహిళామృతదేహాలకే అంతిమ వీడ్కోలు అనుకున్నాను. ఏడాదిపాటు అలాగే చేశాను. కానీ, ఆ తర్వాత నుంచి లింగభేదాలు చూడటం లేదు. ఉదయం 8 గంటలకు, రాత్రి 11 గంటలకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఈ పనిచేయడం మొదలుపెట్టినప్పుడు నా కుటుంబ సభ్యులు తమ అంగీకారం చెప్పలేదు. అలాగని అడ్డుపడలేదు. ఆర్థిక సాయం మాత్రం నా ఇద్దరు కుమారులు, కుమార్తె చేస్తున్నారు. మా అత్తగారి పేరుతో కనకధారా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తున్నాను’ అని వివరించారు డాక్టర్ లక్ష్మి. పిల్లలకు మంచిని బోధించే ప్రొఫెసర్ సమాజానికి ఉపయోగపడే పనిని చేస్తున్నందుకు గాను డాక్టర్ లక్ష్మిని అవార్డులతో సత్కరించారు సామాజిక కార్యకర్తలు, ప్రముఖులు. -
పోలీసులే "ఆ నలుగురు"
ప్యాపిలి: కరోనా పేరు వింటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. బంధువులు మృతి చెందినా చివరి చూపులకు సైతం రావడం లేదు. అంత్యక్రియలు నిర్వహించడానికీ వెనుకంజ వేస్తున్నారు. ఇలాంటి ఘటనే ప్యాపిలి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి (46) ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. అయితే అతని దుకాణంలో పని చేస్తున్న గుమాస్తాకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతనికి కూడా కరోనా సోకి మృతి చెందాడని భావించిన బంధువులు.. మృతదేహాన్ని చూసేందుకు సైతం రాలేదు. స్థానికులు కూడా ఆ వైపు వెళ్లేందుకు భయపడ్డారు. దీంతో అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితి తలెత్తింది. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు రాజానారాయణ మూర్తి, గడ్డం భువనేశ్వర్ రెడ్డి.. ఎస్ఐ మారుతీశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన కమ్యూనిటీ పోలీసులు (సీపీఓలు) పవన్, జగదీష్, సత్య, విజయ్, రాము తదితరులతో కలిసి పీపీఈ కిట్లు ధరించి ..వ్యాపారి మృతదేహాన్ని బ్యాటరీ రిక్షాలో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్ఐ స్వయంగా బ్యాటరీ రిక్షాను నడిపి మృతదేహాన్ని తీసుకెళ్లారు. మానవత్వంతో స్పందించిన ఎస్ఐను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. -
నేపాల్ వాసికి అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: నేపాల్ నుంచి పొట్ట చేతబట్టుకొని నగరానికి వచ్చిన రమేష్(32) అనే యువకుడు మూడు రోజుల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెం.5లోని మెట్రోస్టేషన్ పార్కింగ్‌లో మృతి చెందాడు. ఇతడి భార్య మీనా తల్లిదండ్రులు ఇటీవల మృతి చెందడంతో ఆమె నేపాల్‌లో ఉంది. భర్త మరణ వార్త తెలిసిన ఆమె అక్కడి నుంచి రాలేని పరిస్థితుల్లో కన్నీరుమున్నీరైంది. రమేష్ బంధుమిత్రులు ఇక్కడే ఉన్నా మృతదేహాన్ని నేపాల్‌కు తరలించే ఆర్థిక స్తోమత లేదు. దీంతో హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు చేయాలంటూ మృతుడి భార్య సూచించింది. ఇక్కడ అంత్యక్రియల ఖర్చులు భారం కావడంతో బంధుమిత్రులు కూడా చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో యూసుఫ్‌గూడకు చెందిన రవి తాప అనే సంఘసంస్కర్త పంజగుట్ట స్మశాన వాటికలో దగ్గరుండి చితికి నిప్పంటించి హైందవ సంస్కృతి ప్రకారం అంత్యక్రియలు తంతు పూర్తి చేశారు. ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి తనకు సంబంధం లేని వారితో ఇలా అంత్యక్రియలు నిర్వహించుకున్న రమేష్ పరిస్థితిని చూసినవారు కంట తడిపెట్టారు. -
అక్కడ దహన సంస్కారాలు ఉచితం
సాక్షి, సిద్దిపేట: పేదలు చనిపోతే చందాలు వసూలు చేసి దహన సంస్కారాలకు నిర్వహించిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి.. అటువంటి పరిస్థితి తమ గ్రామంలో ఎవరికీ రాకూడదు.. అంటూ సిద్దిపేట నియోజకవర్గంలోని గుర్రాల గొంది సర్పంచ్ ఆంజనేయులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పంచాయతీలో మూల నిధి ఏర్పాటు చేసి గ్రామంలో చనిపోయిన వారికి ఉచితంగా అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఆలోచనకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మద్దతు తెలపడం. తన వంతు కూడా సాయం అందచేస్తానని ముందుకు రావడంతో ఆ కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టారు. దాతల సహకారంతో మూల నిధి.. ఉచిత దహన సంస్కారాలు నిర్వహించడానికి మూల నిధినిఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చే వడ్డీతో ఈ ఖర్చులు నిర్వహించేందుకు సర్పంచ్ సిద్ధమయ్యారు. గత ఏడాది ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా ఎంపికైంది. ఇందుకు గాను ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రోత్సాహకం నుంచి రూ. 5లక్షలు, సర్పంచ్ రూ. 50వేలు, ఎంపీటీసీ రూ.30వేలు, జెడ్పీటీసీ రూ.25వేలు, గ్రామాన్ని దత్తత తీసుకున్న పారిశ్రామిక వేత్త రవీందర్రావు రూ.50వేలు, మాజీ సర్పంచ్ రూ.25వేలు, అదేవిధంగా ఇతర దాతలు కలిపి మొత్తం రూ.8,35,000 జమచేశారు. వీటికి తోడు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రూ.1లక్ష అభివృద్ధి నిధుల నుంచి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గురువారం నుంచి ఆ గ్రామంలో ఎవరు చనిపోయినా పంచాయతీ సొంత ఖర్చులతో అంత్యక్రియలు చేసేలా ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గం అంతా అమలు ఉచిత అంతిమ సంస్కారాల క్రమానికి మూలనిధిని అందచేసే కార్యక్రమానికి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ అంజనేయులును అభినందించారు. గుర్రాల గొంది గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొవాలని పిలుపు నిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉచిత దహన సంస్కారాల కార్యక్రమాన్ని చేపడుతామని చెప్పారు. ఇప్పటికే పలు గ్రామాల సర్పంచ్‌లు నిధుల సేకరణ పనిలో ఉన్నారన్నారు. ఇందుకోసం గ్రామస్తులు, పారిశ్రామిక వేత్తలు, ప్రవాస భారతీయులు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. -
ఉపరాష్ట్రపతి, కేటీఆర్‌లు మెచ్చిన పథకం..
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక్క రూపాయికే దహన సంస్కారాలు చేసేందుకు శ్రీకారం చుట్టిన కరీంనగర్ నగరపాలక సంస్థపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘అంతిమ యాత్ర.. ఆఖరి సఫర్’అంటూ కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ ప్రవేశపెట్టిన పథకంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీఆర్ఎస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘కులమతాలు, పేద ధనిక బేధభావం లేకుండా అంతిమసంస్కారాల కోసం ప్రత్యేక పథకాన్ని రూపొందించిన కరీంనగర్ కార్పొరేషన్, మేయర్ రవీందర్‌సింగ్‌కు అభినందనలు’అంటూ వెంకయ్యనాయుడు ట్వీట్లో పేర్కొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లను ప్రశంసించారు. పేదలకు ఎంతగానో ఉపయోగపడే పథాకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. ఇక అన్ని ప్రాంతాల్లోనూ ఈ పథకం సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తామని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ తెలిపారు. ఇక సోమవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్ రవీందర్ సింగ్ ఈ పథకం గురించి వివరించారు. శ్మశాన వాటికల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు అంత్యక్రియలను కూడా నగరపాలక సంస్థ బాధ్యతగా చేపడుతుందని చెప్పారు. నిరుపేద కుటుంబాల్లో అంత్యక్రియలకు పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా అప్పుల కోసం కాళ్లావేళ్లా పడటం తనను కలిచివేసిందని పేర్కొన్నారు. అందుకే ఒక్క రూపాయికే అంత్యక్రియలు చేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా వారి వారి సంప్రదాయాల ప్రకారం ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం రూ.1.5 కోట్లు నిధులు మంజూరు చేశామని, రెండు వ్యాన్లు, ఫ్రీజర్లు కూడా కొనుగోలు చేస్తున్నామని, పార్థివదేహాలను కాల్చేవారికి కట్టెలు, కిరోసిన్, పూడ్చిపెట్టే వారికి గొయ్యి తవ్వడం వంటివి సమకూర్చుతామని వివరించారు. జూన్ 15వ తేదీ నుంచి ఈ పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. దాతలు కమిషనర్ అకౌంట్ ద్వారా ఆర్థిక సహాయం అందించవచ్చని, సీఎస్ఆర్ ద్వారా సేవ చేయాలనుకునే వారు తమతో కలసి పనిచేయాలని కోరారు. -
రూపాయికే అంత్యక్రియలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థలో నిరుపేదలకు అండగా నిలిచేందుకు వినూత్న పథకాన్ని చేపట్టారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక్క రూపాయికే దహన సంస్కారాలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు కూడా చేయలేని స్థితిలో ఉన్న వారికి భరోసా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ‘అంతిమయాత్ర.. ఆఖిరిసఫర్’ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు సోమవారం మేయర్ రవీందర్‌సింగ్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శ్మశాన వాటికల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు అంత్యక్రియలను కూడా నగరపాలక సంస్థ బాధ్యతగా చేపడుతుందని చెప్పారు. నిరుపేద కుటుంబాల్లో అంత్యక్రియలకు పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా అప్పుల కోసం కాళ్లావేళ్లా పడటం తనను కలిచివేసిందని పేర్కొన్నారు. అందుకే ఒక్క రూపాయికే అంత్యక్రియలు చేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా వారి వారి సంప్రదాయాల ప్రకారం ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం రూ.1.5 కోట్లు నిధులు మంజూరు చేశామని, రెండు వ్యాన్లు, ఫ్రీజర్లు కూడా కొనుగోలు చేస్తున్నామని, పార్థివదేహాలను కాల్చేవారికి కట్టెలు, కిరోసిన్, పూడ్చిపెట్టే వారికి గొయ్యి తవ్వడం వంటివి సమకూర్చుతామని వివరించారు. జూన్ 15వ తేదీ నుంచి ఈ పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. దాతలు కమిషనర్ అకౌంట్ ద్వారా ఆర్థిక సహాయం అందించవచ్చని, సీఎస్ఆర్ ద్వారా సేవ చేయాలనుకునే వారు తమతో కలసి పనిచేయాలని కోరారు. -
వీరజవానుకు కన్నీటి వీడ్కోలు
గిద్దలూరు: జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని దుండగల్ సెక్టార్లో విధులు నిర్వహిస్తూ ఈనెల 12న పాక్ సైనికుల కాల్పుల్లో వీర మరణం పొందిన జవాను తల్లపురెడ్డి రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు శనివారం ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురంలో జరిగాయి. సైనికులకు ఆయుధాలు సరఫరా చేసేందుకు వెళ్తున్న వాహనంపై పాక్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్న రామకృష్ణారెడ్డి తలనుంచి బుల్లెట్లు దూసుకెళ్లడంతో అతను వెంటనే కుప్పకూలాడు. దగ్గరగా వచ్చిన ఉగ్రవాదులు వాహనంలో కూర్చుని ఉన్న మరో భారత జవాన్‌ను కూడా కాల్చేశారు. అనంతరం ఇద్దరి మృతదేహాలపై ఏకధాటిగా 11 బుల్లెట్లు దించారని సైనికోద్యోగి తెలిపారు. రామకృష్ణారెడ్డి మృతదేహాన్ని శనివారం సైనికాధికారులు ఓబులాపురానికి తీసుకొ చ్చారు. వేలాది మంది ప్రజలు వీరజవానుకు నివాళులర్పించారు. కలెక్టర్ వినయ్‌చంద్, ఎస్పీ సత్య ఏసుబాబు, ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి, జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎం.అరుణ కుమారి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. మృతుని తండ్రి పెద్ద వెంకట రెడ్డికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫోన్‌చేసి పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆర్మీ కల్నల్ ఆనంద్‌సింగ్ పర్యవేక్ష ణలో సైనిక లాంఛనాలతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
అంతిమయాత్రలో విషాదం.. మనవడి మృతి
జైపూర్: అంతిమ సంస్కారాల నిర్వహణలో విషాదం చోటుచేసుకుంది. అంత్యక్రియలు నిర్వహించడానికి వెళ్లిన ఓ కుటుంబసభ్యులపై తేనెటీగలు దాడి జరపగా చనిపోయిన వ్యక్తి మనవడు మృతిచెందాడు. ఈ విషాదఘటన రాజస్థాన్ లోని బరాన్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బరాన్ జిల్లాలోని కలోని గ్రామానికి చెందిన వృద్ధుడు జానకీ లాల్ మెహతా మంగళవారం చనిపోయాడు. అయితే, బుధవారం తాత అంత్యక్రియలు నిర్వహించేందుకు మెహతా మనవడు నందకిషోర్(45) కుటుంబసభ్యలు, బంధువులతో కలిసి శ్మశానవాటికకు వెళ్లాడు. అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో దురదృష్టవశాత్తూ తేనెటీగల గుంపు వీరిపై దాడిచేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నందకిషోర్‌ను, మరో గాయపడిన మరో 15 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మెహతా మనవడు నందకిషోర్ మృతిచెందాడు. ఒకరి అంత్యక్రియలకు వెళ్లగా ఇంట్లోని మరో వ్యక్తి మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.