సాక్షి, హైదరాబాద్ : కర్నూలు జిల్లా డోన్ ఓబులాపురం మిట్ట వద్ద సినీఫక్కీలో జరిగిన భారీ దారిదోపిడీకి పాల్పడ్డ నిందితుడు భీమ్‌సింగ్ ఎట్టకేలకు రాజస్థాన్‌లో ఎన్‌కౌంటర్ అయ్యాడు. భీమ్‌సింగ్ గత నెల డోన్ హైవేపై రూ.5 కోట్లు దోచుకుని పరారైన విషయం తెలిసిందే. 144 కేసుల్లో నిందితుడు అయిన అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భీమ్‌సింగ్ రాజస్థాన్‌లోని జానూర్ జిల్లాలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఓ వాహనంలో ఉన్న భీమ్‌సింగ్‌ను పోలీసులు చుట్టుముట్టగా, అతడు పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో భీమ్‌సింగ్ సహా వాహన డ్రైవర్ హతమయ్యాడు.
వివరాల్లోకి వెళితే...
హైదరాబాద్‌కు చెందిన నీలేష్ అనే వ్యక్తి దగ్గర మనీ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన వద్ద అసిస్టెంట్ అరవింద్ కుమార్ సింగ్.. కల్పద్రుమ జేమ్స్ జ్యువెలరీ లిమిటెడ్‌కు చెందిన అక్షయ్ రాజేంద్ర లునావత్ అనే వ్యక్తికి చెందిన రూ.5.5 కోట్ల డబ్బును నీలేష్ నందలాల్ సీద్‌పుర అనే మనీ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీకి అప్పజెప్పేందుకు నీలేష్ గతనెల 12వ తేదీ రాత్రి డ్రైవర్ కరణ్‌చౌబే, అసిస్టెంట్ అరవింద్ కుమార్ సింగ్‌తో కలసి హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు స్కార్పియో వాహనం(ఏపీ09 సీడబ్ల్యూ 0880)లో బయలుదేరారు.
వీరు డోన్ దాటిన తర్వాత ఓబులాపురం ప్రాంతంలో స్విఫ్ట్ డిజైర్, హోండా మొబిలీ వాహనాలతో ఓవర్‌టేక్ చేసిన కొందరు దుండగులు ఆ వాహనాన్ని అడ్డుకుని..అందులో ఉన్న డబ్బును వాళ్ల వాహనంలోకి మార్చుకున్నారు. స్కార్పియో వాహనాన్ని ప్యాపిలి సమీపంలోని ఓ చెరువు ప్రాంతంలో వదిలేసి.. దొంగలు వాళ్ల వాహనంలో నీలేష్‌తో పాటు డ్రైవర్ కరణ్‌చౌబే, అతని అసిస్టెంట్ అరవింద్ కుమార్ సింగ్‌లను ఎక్కించుకుని తీసుకెళ్లారు.
ఆరుగురు రెండు వాహనాల్లో తుపాకులతో పాటు ఇతర ఆయుధాలతో తమను బెదిరించినట్లు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 177/217 అండర్ సెక్షన్ 324, 365, 395, 397, 25(1) (ఆ) (b) ఆయుధ చట్టం 1959 కింద బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డోన్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. అప్పటి నుంచి హైదరాబాదుతో పాటు నాగ్‌పూర్‌కు కూడా దర్యాప్తు కోసం ప్రత్యేక బందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఎట్టకేలకు దోపిడీకి పాల్పడిన భీమ్‌సింగ్‌ను రాజస్థాన్‌లో హతమర్చారు.
Comments
Please login to add a commentAdd a comment