రవి మృతదేహం కోసం.. | Sakshi
Sakshi News home page

రవి మృతదేహం కోసం..

Published Sat, May 4 2024 7:45 AM

-

కుటుంబీకులు, బంధువుల యాతన 

ఎట్టకేలకు స్వగ్రామం చేరిన మృతదేహం 

నేడు వంగరలో అంత్యక్రియలు 

ప్రజల కోసమే ప్రాణమిచ్చిండు 16 ఏళ్ల వయస్సులో విప్లవోద్యమంలోకి వెళ్లిన నా తమ్ముడు రవి 48 ఏళ్ల వయస్సులో ఎన్‌కౌంటర్‌లో చనిపోయిండు. ముప్‌పై ఏళ్లకు పైగా విప్లవోద్యమంలో పన్జేసిండు. ఉద్యమంలోకి పోయిన నుంచి ఒక్కసారి కూడా ఇంటి ముఖం చూడలె. ఎప్పటికై నా క్షేమంగా ఇంటికి వస్తడనుకున్నం. గిట్ల శవమై వస్తడనుకోలె. ప్రజల కోసం పోరుబాట పట్టిండు. ప్రజల కోసమే ప్రాణమిడిసిండు. నా తమ్ముని జన్మ ధన్యమైంది’ ఇది ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో గత మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన దండకారణ్య కమిటీ సభ్యుడు కాసవేణ రవి పెద్దన్న వెంకటేశ్‌ కన్నీటి వేదన.

బెల్లంపల్లి: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన దండకారణ్య రాష్ట్ర కమిటీ సభ్యుడు, బెల్లంపల్లికి చెందిన కాసవేణ రవి అలియాస్‌ అశోక్‌ అలియాస్‌ వినయ్‌ (48) మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు పడిన యాతన అంతా ఇంతా కాదు. మంగళవారం ఉదయం ఎన్‌కౌంటర్‌ జరగగా శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు రవి మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

ఆ తర్వాత నారాయణపూర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి ఇబ్బందులేర్పడ్డాయి. రవి మృతదేహాన్ని తీసుకురావడానికి కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు బుధవారం మధ్యాహ్నం భీమదేవరపల్లి మండలం వంగర స్వస్థలం నుంచి ఛత్తీస్‌గఢ్‌కు బయల్దేరి వెళ్లారు. దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా, పోలీసుల తనిఖీల మధ్య 12 గంటల తర్వాత అక్కడికి చేరుకున్నారు. బుధవారం ఉదయం నారాయణపూర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లి మార్చురీలో భద్రపర్చిన రవి మృతదేహాన్ని సోదరుడు వెంకటేశ్‌, బంధువులు గుర్తించి బోరున విలపించారు.

కిడ్నీ నుంచి తూటాలు..
కుటుంబ సభ్యులు రవి మృతదేహాన్ని గుర్తించగా వైద్యులు స్కాన్‌ చేశారు. అతడి శరీరంలోని తూటాలను పరిశీలించిన నారాయణపూర్‌ ప్రభుత్వాస్పత్రి వైద్యులు పోస్టుమార్టం చేయడం సాధ్యంకాదని చెప్పారు. జగ్దల్‌పూర్‌ నుంచి ప్రత్యేక వైద్యులను శుక్రవారం ఉదయం రప్పించి మరోసారి రవి మృతదేహాన్ని స్కాన్‌ చేసి చూసిన తర్వాత పోస్టుమార్టం చేశారు. 

కాగా, కిడ్నీని ఆనుకుని మూడు తూటాలు ఉండటంతో నిపుణులైన వైద్యులతో పోస్టుమార్టం చేయించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించడంతో ప్రైవేట్‌ అంబులెన్స్‌లో స్వస్థలానికి చేరుకున్నారు. కాగా, శనివారం స్వగ్రామం వంగరలో రవి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అతడి సోదరుడు వెంకటేశ్‌ తెలిపారు.

రవి
1/1

రవి

Advertisement
 

తప్పక చదవండి

Advertisement