కర్నూలు: ఎన్నికల వేళ నేతల ముసుగులో రౌడీషీటర్లు రెచ్చిపోకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే వారి కదలికలపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం జిల్లా పోలీసు శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఆరు మాసాల క్రితం కర్నూలు శివారులోని సుంకేసుల రోడ్డులో వీకే వైన్‌షాప్ వద్ద రౌడీషీటర్ చాకలి రాముడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇతన్ని ఆదిత్య నగర్‌లో నివాసముంటున్న మరో రౌడీషీటర్ మతిన్ బాషా బీరు బాటిల్‌తో పొడిచి..బండరాయితో మోది పరారయ్యాడు. అలాగే ఈ నెల 8వ తేదీన సాయిబాబా సంజీవయ్య నగర్‌కు చెందిన రౌడీషీటర్ చెన్నయ్య దారుణహత్యకు గురయ్యాడు.
ఇతని కళ్లల్లో ఇసుక చల్లి, బండరాళ్లతో మోది, కత్తులతో పొడిచి తుంగభద్ర నది ఒడ్డున దారుణంగా హత్య చేశారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా అధికార పార్టీకి చెందిన అభిరుచి మధు అనే వ్యక్తి కత్తి పట్టుకుని హల్‌చల్ చేశాడు. జిల్లాలో కొందరు రౌడీషీటర్లు నేతల పంచన చేరి ఇలా అరాచకం చేస్తున్నారని పోలీసులు అంచనాకు వచ్చారు. నెల రోజుల నుంచి రౌడీషీటర్లను జిల్లా వ్యాప్తంగా స్టేషన్లకు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇక మీదట ఎలాంటి వివాదాల్లో తలదూర్చబోమని, ప్రశాంతంగా జీవనం సాగిస్తామని ప్రమాణ పత్రాలు తీసుకుంటున్నారు.
ముగ్గురిపై పీడీ యాక్ట్
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేర ప్రవృత్తి గల ముగ్గురు వ్యక్తులపై పోలీసులు జిల్లాలో మొదటిసారిగా పీడీ యాక్ట్ నమోదు చేసి.. కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలం, చిన్నకందుకూరు గ్రామాల్లో అల్లర్లకు పాల్పడే అవకాశం ఉండటంతో గూడూరు సంజీవరాయుడు, పెద్దిరెడ్డి కొండారెడ్డి, నాసారి వెంకటేశ్వర్లు పూర్వపు నేర చరిత్రను పరిశీలించి.. వారిపై పీడీ యాక్టు నమోదు చేసి రాత్రికి రాత్రే కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
అహోబిలం గ్రామానికి చెందిన గూడూరు సంజీవరాయుడుపై 1993 నుంచి ఇప్పటివరకు 12 కేసులు ఉన్నాయి. ఆళ్లగడ్డ రూరల్ స్టేషన్‌లో ఈ ఏడాది రౌడీషీట్(షీట్ నంబర్ 199) తెరిచారు. ఇదే గ్రామానికి చెందిన నాసారి వెంకటేశ్వర్లు అలియాస్ సీసా వెంకటేశ్వర్లుపై మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. 1996 నుంచి రౌడీషీట్ (నంబర్ 71) ఉంది. అలాగే చిన్నకందుకూరు గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి కొండారెడ్డిపై తొమ్మిది కేసులు నమోద య్యాయి. నలుగురిని హత్య చేసినట్లు పోలీసు రికార్డులకెక్కాడు. 2006 నుంచి ఆళ్లగడ్డ రూరల్ స్టేషన్‌లో రౌడీషీట్ (షీట్ నంబర్ 165) నమోదై ఉంది.
కదలికలపై దృష్టి
జిల్లాలో రౌడీషీటర్ల వ్యాపకం ఎలా ఉంది, వారు స్థానికంగానే ఉంటున్నారా, ఒకవేళ బయటకు వెళితే తిరిగి ఎన్ని రోజులకు ఇళ్లకు చేరుకుంటున్నారు, నేతలతో ఎలా అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు వంటి సమస్త సమాచారాన్ని స్టేషన్ల వారీగా సేకరిస్తున్నారు. ప్రతి స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లను ఆ స్టేషన్ సిబ్బంది కనిపెట్టి ఉండేలా బాధ్యతలు అప్పగించారు. గత ఎన్నికల సమయంలో రౌడీషీటర్ల మాటున నేతలు హల్‌చల్ చేసిన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా పోలీసు బాస్ ఇప్పటికే సబ్ డివిజన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గతంలో నమోదైన కేసుల ఆధారంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నాలుగేళ్ల నుంచి జిల్లాలో పనిచేసిన సీఐలను ఎన్నికల నేపథ్యంలో పొరుగు జిల్లాలకు సాగనంపారు. కొత్తగా వచ్చిన సబ్ డివిజన్ స్థాయి అధికారులతో పాటు ఇన్‌స్పెక్టర్లకు రౌడీల ఆగడాలపై పెద్దగా అవగాహన ఉండదని భావించిన ఎస్పీ ఫక్కీరప్ప రౌడీషీటర్లు టార్గెట్‌గా ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా వారి ప్రతి కదలికను ఎప్పటికప్పుడు డీఎస్పీలతో పాటు స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌కు చేరవేసే బాధ్యతను కానిస్టేబుళ్లకు అప్పగించాలని అన్ని సబ్ డివిజనల్ అధికారులను ఆదేశించారు.
3,496 మంది రౌడీషీటర్లు
జిల్లాలో రౌడీషీట్లు కలిగినవారు 3,496 మంది, కేడీ షీట్లు కలిగినవారు సుమారు 1,500 మంది ఉన్నారు. వీరిలో క్రియాశీలకంగా ఉండేవారు జిల్లా మొత్తం మీద 150 మందికి పైగా ఉన్నారు. ఏ+, ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి..వారు రెండు వారాలు లేదా నెలకు ఒకసారి స్టేషన్‌కు వచ్చి కనపడేలా చర్యలు చేపట్టారు. అయితే.. కొందరు సక్రమంగా రాకపోవడం, మరికొందరు అనారోగ్య కారణాలతో రాలేకపోతున్నామని చెబుతుండటంతో.. వారు చెప్పే కారణాలు సహేతుకమేనా అనే విషయాన్ని కానిస్టేబుళ్లు వారి ఇళ్లకు వెళ్లి విచారించేలా బాధ్యతలు అప్పగించారు.
స్టేషన్ల వారీగా నిఘా: కానిస్టేబుళ్లు రాత్రి గస్తీ (నైట్ బీట్) విధులు నిర్వహించేటప్పుడు, పాత కేసులకు సంబంధించిన వివరాల సేకరణకు వెళ్లినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న రౌడీషీటర్ల ఇళ్లను కచ్చితంగా టచ్ చేసి.. వారి కుటుంబీకులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని రావాలి. కానిస్టేబుళ్లు వెళ్లిన సమయానికి రౌడీషీటరు ఇంటి వద్ద లేకపోతే ఎక్కడికి వెళ్లారో కుటుంబ సభ్యులతో పాటు ఇరుగూ పొరుగు వారితో ఆరా తీయాలి. స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్ల వ్యాపకాలను పరిశీలించే కానిస్టేబుళ్ల నిఘా లోపమున్నట్లు తేలితే వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ఆదేశాలు ఇచ్చారు. వచ్చేది ఎన్నికల సీజన్ కావడంతో నేతలు రౌడీషీటర్లను అన్ని విధాలా ప్రోత్సహించే అవకాశం ఉంటుందని భావించి రాజకీయాలకు అతీతంగా ఉక్కుపాదం మోపుతున్నామని ఓ సబ్ డివిజన్ అధికారి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment