Roudisheeters
-
యువతపై కమిషనర్ ఉక్కుపాదం!
సాక్షి, కరీంనగర్: సామాజిక మాధ్యమాలు... కొత్త కొత్త పోకడలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇంటర్, డిగ్రీ చదువుతున్న యువకులు దురలవాట్లకు చేరువవుతూ సంఘ విద్రోహ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. రౌడీషీటర్లు, ల్యాండ్ మాఫియా నడిపే వ్యక్తులకు చేరువవుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్‌శాఖ యువత దారి తప్పకుండా వ్యవస్థను కూకటివేళ్లతో నరికే దిశగా చర్యలు చేపట్టింది. కరీంనగర్, రామగుండం పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వెర్రితలలు వేస్తున్న యువత పోకడలను ఆదిలోనే తుంచివేసేందుకు కమిషనర్లు విడివిడిగా చర్యలు చేపట్టారు. కరీంనగర్ శివార్లలో భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటూ సెటిల్మెంట్లు సాగిస్తున్న వ్యక్తుల ను ఓ వైపు టార్గెట్ చేసుకుంటూనే... యువతరంతో గ్యాంగులు తయారు చేసి బెదిరింపులకు పాల్పడుతూ జనాల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్న వ్యక్తులపై ఉక్కుపాదం మోపేందుకు కమిషనర్ కమలాసన్‌రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారు. లవన్‌కుమార్ అనే ఓ రౌడీషీటర్ ఆగడాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కమిషనర్ అతనికి సహకరిస్తున్న వారిని, అతను పెంచిపోషిస్తున్న గ్యాంగ్‌ను టార్గెట్ చేశారు. గురువారం స్వయంగా టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆయన లవన్ గ్యాంగ్, అతనికి సహకరిస్తున్న వారి గురించి ఆరా తీశారు. అదుపులోకి తీసుకున్న వారి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా యువకులు సాగిస్తున్న దందాలు, నమోదైన కేసులను పరిశీలించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న 169 మంది రౌడీషీటర్లు, ఆస్తుల వివాదాల్లో జోక్యం చేసుకొనే మరో 241 మంది ప్రస్తుతం చేస్తున్న కార్యకలాపాలపై దృష్టి పెట్టారు. అదే సమయంలో ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ముఖ్యమైన వ్యక్తులను తూలనాడుతున్న వ్యక్తులపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. శివార్లలో పెరిగిన భూదందాలు కరీంనగర్ శివార్లలో భూ వివాదాలు ఇటీవలి కాలంలో పెరిగాయి. సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి రూట్లలో జిల్లా కేంద్రం నుంచి సుమారు 10 కిలోమీటర్ల వరకు భూముల క్రయ విక్రయాల్లో లాండ్ మాఫియా ప్రవేశించింది. స్థానిక ప్రజా ప్రతినిధులు, కరీంనగర్ నుంచి భూదందా సాగించే మాఫియా ప్రధాన రోడ్ల పక్కన ప్లాట్లు కొన్న వారిని, భూములు కొన్న వారిని లక్ష్యంగా చేసుకొని లేని వివాదాలు సృష్టిస్తున్నారు. తరువాత సెటిల్మెంట్ల పేరుతో గతంలో భూములు కొన్నవారిని, అమ్మిన వారిని బెదిరించి తామే సొంతం చేసుకుంటున్నారు. గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల జరిగిన దందాల స్థాయిలో కరీంనగర్ చుట్టుపక్కల ల్యాండ్ మాఫియా భూ వివాదాలు సృష్టిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్తపల్లి భూ వివాదంలో జోక్యం చేసుకున్న లవన్ కుమార్ అనే రౌడీషీటర్‌పై కేసులు నమోదు చేసిన పోలీసులు అతనికి సహకరించారనే అనుమానంతో మరికొందరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. బొమ్మకల్ ప్రాంతంలో ఓ స్థానిక ప్రజాప్రతినిధి ఆగడాలు కూడా పెరిగిపోవడంతో ఆ వైపు కూడా దృష్టి పెట్టారు. చిన్న చిన్న భూవివాదాలను పెద్దవిగా చేసి, లబ్ధిపొందేందుకు కొందరు వ్యక్తులు చేస్తున్న ఈ దందాలకు సంబంధించి ఇప్పటికే పూర్తి సమాచారం తెప్పించిన కమిషనర్ ఫిర్యాదులు అందిన వెంటనే ‘లోపలికి’ పంపించే దిశగా ఆదేశాలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే, కించపరిచే వ్యాఖ్యలు పెట్టిన వారిపై కూడా చర్యలకు సిద్ధమవుతున్నారు. విదేశాల్లో చదువుకొంటూనో... ఉద్యోగాలు చేస్తూనో ఉండే యువకులు రెచ్చగొట్టేలా పెట్టే పోస్టింగ్‌లను కూడా సీరియస్‌గా తీసుకొని ‘రెడ్‌కార్నర్’ నోటీస్‌లు జారీ చేస్తామని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో 241 మంది భూవివాదాల్లో జోక్యం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్లలో కలిపి 536 మందిని వివాదాస్పద వ్యక్తులుగా గుర్తించిన పోలీసులు, పలు ‘షీట్ల’ను తెరిచారు. క్రిమినల్ కేసుల్లో బుక్కయిన వారు, బెదిరింపులకు పాల్పడుతూ రౌడీయిజం చేస్తున్న 169 మంది మీద ఇప్పటికే రౌడీషీట్లు తెరిచారు. వీరిలో కొందరిపై పీడీ యాక్టు ప్రయోగించి జైళ్లకు పంపించారు. మతపరమైన సమస్యలు వచ్చినప్పుడు అనుమానాస్పదంగా వ్యవహరించే 61 మంది జాతకాలు కూడా తీసుకున్నారు. ఇక ఆస్తులకు సంబంధించిన వివాదాల్లో జోక్యం చేసుకునే వారి జాబితా 241గా రికార్డు చేశారు. వీరిలో 100 మంది వరకు రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారే కావడం గమనార్హం. మట్కా ఆడించేవారు ఐదుగురైతే, గుట్కా సరఫరా చేసేవారు 47 మంది. గంజాయి రవాణాలో పాల్గొనే నలుగురు వ్యక్తులతోపాటు ఇసుక మాఫియా కింద మరో 9 మందిపై ప్రత్యేక షీట్లు తెరిచారు. వీరంతా కరీంనగర్ నుంచి హుజూరాబాద్, చొప్పదండి వరకు విస్తరించి ఉండడంతో వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కమిషనర్ అన్ని పోలీస్స్టేషన్లను ఆదేశాలు జారీ చేశారు. కాగా 84 మందిపై పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపించడమే కాకుండా... జైలుకు వెళ్లివచ్చిన వారందరిపై రౌడీషీట్లు తెరవడం గమనార్హం. రౌడీయిజం, భూ దందాలను సహించం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా సహించేది లేదు. యువత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. విద్యార్థి దశలో దారి తప్పితే చెడు ప్రభావాలకు లోనయ్యే అవకాశం ఉంది. బర్త్‌డే పార్టీలు కుటుంబసభ్యులు, స్నేహితులతో ఇళ్లలోనే జరుపుకోవాలని తల్లిదండ్రులు చెప్పాలి. లవన్‌కుమార్ అనే రౌడీషీటర్ విషయంలో పోలీస్ శాఖ సీరియస్‌గా ఉంది. అక్రమ పద్ధతుల్లో భూదందాలు సాగిస్తూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేసే వారిపై కేసులు నమోదు చేస్తాం. బాధితులు సిటీ స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్ 0878 – 2240276కు గానీ, ఇన్స్పెక్టర్కు 9440795104 నెంబర్ ద్వారా గానీ సంప్రదించవచ్చు. ఎవరినీ వదలం. – కమలాసన్‌రెడ్డి, కమిషనర్ ఆఫ్ పోలీస్ చౌరస్తాల్లో... కత్తులతో కేకులు కట్ యువత ఆలోచనలు వెర్రితలలు వేసిందనడానికి ఇటీవలి కాలంలో పెరిగిన రోడ్లపై బర్త్‌డేలు నిర్వహించుకునే సంస్కృతే నిదర్శనం. బైపాస్‌లో బొమ్మకల్ వైపున్న బ్రిడ్జి మీద గతంలో అర్ధరాత్రి బర్త్‌డేలు జరుపుకొన్నట్లు వచ్చిన ఫిర్యాదులతో పోలీసులు చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు అక్కడికి వెళ్లడం లేదు. కానీ నగరంలోని కాలనీలు, రోడ్లతోపాటు మునిసిపాలిటీలు, గ్రామాల్లో చౌరస్తాల్లో రాత్రి 12 తరువాత తాగి తందనాలాడుతూ బర్త్‌డేలు జరుపుకొనే వింత ధోరణి పెరిగింది. బర్త్‌డే కేకును ప్లాస్టిక్ లేదా స్టీల్ చాకుతో కోయడం ఆనవాయితీ. కానీ ఇటీవల కాలంలో తల్వార్లు, పొడవాటి పెద్దపెద్ద కత్తులతో కేకులు కట్ చేస్తూ సినిమాల్లో తరహా వాటిని ప్రదర్శిస్తున్నారు. లవన్‌కుమార్ అనే రౌడీషీటర్ బర్త్‌డే పార్టీ కూడా ఓ అపార్ట్మెంట్లో రాత్రి నుంచి తెల్లవారు జాము దాక జరగడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో లవన్ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకొన్నారు. కాగా బర్త్‌డే సందర్భంగా గానీ, ఇతర ఏ సందర్భంలో గానీ కత్తులను ప్రదర్శిస్తే ‘ఆయుధ చట్టం’ కింద కేసు నమోదు చేయనున్నట్లు కమిషనర్ కమలాసన్ రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. -
రౌడీషీటర్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి
కర్నూలు: ఎన్నికల వేళ నేతల ముసుగులో రౌడీషీటర్లు రెచ్చిపోకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే వారి కదలికలపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం జిల్లా పోలీసు శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఆరు మాసాల క్రితం కర్నూలు శివారులోని సుంకేసుల రోడ్డులో వీకే వైన్‌షాప్ వద్ద రౌడీషీటర్ చాకలి రాముడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇతన్ని ఆదిత్య నగర్లో నివాసముంటున్న మరో రౌడీషీటర్ మతిన్ బాషా బీరు బాటిల్‌తో పొడిచి..బండరాయితో మోది పరారయ్యాడు. అలాగే ఈ నెల 8వ తేదీన సాయిబాబా సంజీవయ్య నగర్‌కు చెందిన రౌడీషీటర్ చెన్నయ్య దారుణహత్యకు గురయ్యాడు. ఇతని కళ్లల్లో ఇసుక చల్లి, బండరాళ్లతో మోది, కత్తులతో పొడిచి తుంగభద్ర నది ఒడ్డున దారుణంగా హత్య చేశారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా అధికార పార్టీకి చెందిన అభిరుచి మధు అనే వ్యక్తి కత్తి పట్టుకుని హల్చల్ చేశాడు. జిల్లాలో కొందరు రౌడీషీటర్లు నేతల పంచన చేరి ఇలా అరాచకం చేస్తున్నారని పోలీసులు అంచనాకు వచ్చారు. నెల రోజుల నుంచి రౌడీషీటర్లను జిల్లా వ్యాప్తంగా స్టేషన్లకు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇక మీదట ఎలాంటి వివాదాల్లో తలదూర్చబోమని, ప్రశాంతంగా జీవనం సాగిస్తామని ప్రమాణ పత్రాలు తీసుకుంటున్నారు. ముగ్గురిపై పీడీ యాక్ట్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేర ప్రవృత్తి గల ముగ్గురు వ్యక్తులపై పోలీసులు జిల్లాలో మొదటిసారిగా పీడీ యాక్ట్ నమోదు చేసి.. కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలం, చిన్నకందుకూరు గ్రామాల్లో అల్లర్లకు పాల్పడే అవకాశం ఉండటంతో గూడూరు సంజీవరాయుడు, పెద్దిరెడ్డి కొండారెడ్డి, నాసారి వెంకటేశ్వర్లు పూర్వపు నేర చరిత్రను పరిశీలించి.. వారిపై పీడీ యాక్టు నమోదు చేసి రాత్రికి రాత్రే కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అహోబిలం గ్రామానికి చెందిన గూడూరు సంజీవరాయుడుపై 1993 నుంచి ఇప్పటివరకు 12 కేసులు ఉన్నాయి. ఆళ్లగడ్డ రూరల్ స్టేషన్లో ఈ ఏడాది రౌడీషీట్(షీట్ నంబర్ 199) తెరిచారు. ఇదే గ్రామానికి చెందిన నాసారి వెంకటేశ్వర్లు అలియాస్ సీసా వెంకటేశ్వర్లుపై మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. 1996 నుంచి రౌడీషీట్ (నంబర్ 71) ఉంది. అలాగే చిన్నకందుకూరు గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి కొండారెడ్డిపై తొమ్మిది కేసులు నమోద య్యాయి. నలుగురిని హత్య చేసినట్లు పోలీసు రికార్డులకెక్కాడు. 2006 నుంచి ఆళ్లగడ్డ రూరల్ స్టేషన్లో రౌడీషీట్ (షీట్ నంబర్ 165) నమోదై ఉంది. కదలికలపై దృష్టి జిల్లాలో రౌడీషీటర్ల వ్యాపకం ఎలా ఉంది, వారు స్థానికంగానే ఉంటున్నారా, ఒకవేళ బయటకు వెళితే తిరిగి ఎన్ని రోజులకు ఇళ్లకు చేరుకుంటున్నారు, నేతలతో ఎలా అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు వంటి సమస్త సమాచారాన్ని స్టేషన్ల వారీగా సేకరిస్తున్నారు. ప్రతి స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లను ఆ స్టేషన్ సిబ్బంది కనిపెట్టి ఉండేలా బాధ్యతలు అప్పగించారు. గత ఎన్నికల సమయంలో రౌడీషీటర్ల మాటున నేతలు హల్చల్ చేసిన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా పోలీసు బాస్ ఇప్పటికే సబ్ డివిజన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో నమోదైన కేసుల ఆధారంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నాలుగేళ్ల నుంచి జిల్లాలో పనిచేసిన సీఐలను ఎన్నికల నేపథ్యంలో పొరుగు జిల్లాలకు సాగనంపారు. కొత్తగా వచ్చిన సబ్ డివిజన్ స్థాయి అధికారులతో పాటు ఇన్స్పెక్టర్లకు రౌడీల ఆగడాలపై పెద్దగా అవగాహన ఉండదని భావించిన ఎస్పీ ఫక్కీరప్ప రౌడీషీటర్లు టార్గెట్‌గా ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా వారి ప్రతి కదలికను ఎప్పటికప్పుడు డీఎస్పీలతో పాటు స్టేషన్ ఇన్స్పెక్టర్కు చేరవేసే బాధ్యతను కానిస్టేబుళ్లకు అప్పగించాలని అన్ని సబ్ డివిజనల్ అధికారులను ఆదేశించారు. 3,496 మంది రౌడీషీటర్లు జిల్లాలో రౌడీషీట్లు కలిగినవారు 3,496 మంది, కేడీ షీట్లు కలిగినవారు సుమారు 1,500 మంది ఉన్నారు. వీరిలో క్రియాశీలకంగా ఉండేవారు జిల్లా మొత్తం మీద 150 మందికి పైగా ఉన్నారు. ఏ+, ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి..వారు రెండు వారాలు లేదా నెలకు ఒకసారి స్టేషన్‌కు వచ్చి కనపడేలా చర్యలు చేపట్టారు. అయితే.. కొందరు సక్రమంగా రాకపోవడం, మరికొందరు అనారోగ్య కారణాలతో రాలేకపోతున్నామని చెబుతుండటంతో.. వారు చెప్పే కారణాలు సహేతుకమేనా అనే విషయాన్ని కానిస్టేబుళ్లు వారి ఇళ్లకు వెళ్లి విచారించేలా బాధ్యతలు అప్పగించారు. స్టేషన్ల వారీగా నిఘా: కానిస్టేబుళ్లు రాత్రి గస్తీ (నైట్ బీట్) విధులు నిర్వహించేటప్పుడు, పాత కేసులకు సంబంధించిన వివరాల సేకరణకు వెళ్లినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న రౌడీషీటర్ల ఇళ్లను కచ్చితంగా టచ్ చేసి.. వారి కుటుంబీకులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని రావాలి. కానిస్టేబుళ్లు వెళ్లిన సమయానికి రౌడీషీటరు ఇంటి వద్ద లేకపోతే ఎక్కడికి వెళ్లారో కుటుంబ సభ్యులతో పాటు ఇరుగూ పొరుగు వారితో ఆరా తీయాలి. స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్ల వ్యాపకాలను పరిశీలించే కానిస్టేబుళ్ల నిఘా లోపమున్నట్లు తేలితే వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ఆదేశాలు ఇచ్చారు. వచ్చేది ఎన్నికల సీజన్ కావడంతో నేతలు రౌడీషీటర్లను అన్ని విధాలా ప్రోత్సహించే అవకాశం ఉంటుందని భావించి రాజకీయాలకు అతీతంగా ఉక్కుపాదం మోపుతున్నామని ఓ సబ్ డివిజన్ అధికారి చెప్పారు. -
కోనసీమలో రౌడీయిజం
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :ప్రశాంతంగా ఉన్న అమలాపురం పట్టణం మారణాయుధాలతో అల్లర్లు, పరస్పర దాడులకు వేదికవుతోంది. ఆధిపత్య పోరులో ఒకరినొకరు హతమార్చేందుకు కూడా వెనుకాడడం లేదు. పాతకక్షలతో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమ కేంద్రమైన అమలాపురం ఇటీవల నివురుగప్పిన నిప్పులా తయారైంది.రౌడీగ్యాంగ్ వార్తో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకుంటాయోనని ప్రజల గుండెల్లో గుబులురేగుతోంది. అమలాపురంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఇద్దరు రౌడీషీటర్ల వర్గాల మధ్య పరస్పర దాడులతో పట్టణ ప్రజలు ఉలిక్కి పడ్డారు. రౌడీషీటర్ల మధ్య ఆధిపత్య పోరుతో గతంలో ఎదురైన అనేక చేదు అనుభవాలను... భయానక సంఘటనలను ప్రజలు గుర్తుకు తెచ్చుకుని ఆందోళనకు గురయ్యారు. ఫ్యాక్షనిజాన్ని తలపించేలా.. రౌడీషీటర్లు మారణాయుధాలతో రెచ్చిపోతున్న చర్యలు పోలీసులకు సైతం దడపుట్టిస్తున్నాయి. సెటిల్మెంట్లతో ఆజ్యం రౌడీషీటర్ల మధ్య ఆధిపత్య పోరు సివిల్ సెటిల్మెంట్ల నుంచి మొదలవుతోంది. రెండు దశాబ్దాల క్రితం ఇలాంటి సంఘటనలను పరికిస్తే.. 2000లో ఇలాంటి ఆధిపత్య పోరులో భాగంగా అమలాపురంలో జరిగిన జంట హత్యల సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. అమలాపురం కేంద్రంగా పట్టణంలోనే కాకుండా పరిసర గ్రామాల్లోను అనేక హత్యలు జరిగాయి. పట్టణంలో దాదాపు 35 మంది రౌడీషీటర్లున్నట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. వీరిలో చాలామంది నేరాలకు దూరంగా ఉన్నారు. సుమారు పది మంది రౌడీలు మాత్రం చెలరేగిపోతున్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ రౌడీషీటర్ వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో ఉంటూ పట్టణంలో తన అనుచరగణాన్ని పెంచిపోషిస్తున్నాడు. సెటిల్మెంట్లతో ఇక్కడ దందా చేస్తున్నాడు. పట్టణానికి చెందిన మరో రౌడీషీటర్ ఇక్కడ వ్యాపారం చేస్తూనే కొంత మంది రౌడీబ్యాచ్కు బాస్‌గా ఉన్నాడు. ఈ ఇద్దరి రౌడీషీటర్ల మధ్య కక్షలు కరుడుగట్టాయి. ఇందులో భాగంగానే ఆ ఇద్దరి రౌడీషీటర్ల వర్గాల మధ్య ఆదివారం అర్ధరాత్రి పరస్పర దాడులు జరిగాయి. నెల రోజుల క్రితం ఓ రౌడీ షీటర్ తన ప్రత్యర్థిని హతమార్చేందుకు పన్నిన పథకం త్రుటిలో తప్పడంతో అప్పట్లో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అప్పటి నుంచైనా పోలీసులు రెండు వర్గాలపై దృష్టిపెట్టి ఉంటే.. తాజా సంఘటన జరిగేది కాదంటున్నారు. పోలీసులకు సన్నిహిత సంబంధాలు రౌడీషీటర్లకు పోలీసులు తరచూ కౌన్సెలింగ్‌లు నిర్వహించాల్సి ఉంది. అమలాపురం పోలీసులు ఇందుకు చొరవ చూపలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధిపత్య పోరుతో రగిలిపోతున్న వారిని పిలిచి.. వారికి కళ్లెం వేసే వీలున్నా, పాత్రధారులపైనే చర్యలు తీసుకుంటున్నారు. కొందరు పోలీసులతో సూత్రధారులు సన్నిహితంగా ఉంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. పోలీసు స్టేషన్‌కు వచ్చిన కొన్ని సివిల్ వివాదాలు, అప్పటికే ఈ రౌడీషీటర్ల వద్ద తగువు రూపంలో ఉండడంతో అక్కడికి వెళ్లి సమస్య పరిష్కరించుకోండని కొందరు పోలీసులు ఉచిత సలహాలు ఇస్తున్నట్టు తెలిసింది. దీనికితోడు ఈ రౌడీషీటర్ల వర్గాలకు రాజకీయ నాయకుల అండదండలు తోడవడంతో వారి దందాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. రౌడీయిజంపై కఠినచర్యలు : డీఎస్పీ రఘు అమలాపురంలో రౌడీషీటర్ల మధ్య ఉన్న గొడవల వల్ల తలెత్తుతున్న శాంతి, భద్రతల సమస్యపై తాను బాధ్యతలు చేపట్టిన గత 4 నెలల నుంచి ప్రత్యేక దృష్టి పెట్టానని అమలాపురం డీఎస్పీ కె.రఘు అన్నారు. సెటిల్మెంట్లు చేస్తున్న రౌడీషీటర్లతో పట్టణంలో కొందరు పోలీసులు సన్నిహితంగా ఉంటున్నారన్న విషయం ఇప్పుడే తన దృష్టికి వచ్చిందన్నారు. వీటన్నింటిపైనా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ, రౌడీయిజం అదుపునకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.