సాక్షి, కరీంనగర్: సామాజిక మాధ్యమాలు... కొత్త కొత్త పోకడలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇంటర్, డిగ్రీ చదువుతున్న యువకులు దురలవాట్లకు చేరువవుతూ సంఘ విద్రోహ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. రౌడీషీటర్లు, ల్యాండ్ మాఫియా నడిపే వ్యక్తులకు చేరువవుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్‌శాఖ యువత దారి తప్పకుండా వ్యవస్థను కూకటివేళ్లతో నరికే దిశగా చర్యలు చేపట్టింది. కరీంనగర్, రామగుండం పోలీస్ కమిషనరేట్‌ల పరిధిలో వెర్రితలలు వేస్తున్న యువత పోకడలను ఆదిలోనే తుంచివేసేందుకు కమిషనర్లు విడివిడిగా చర్యలు చేపట్టారు. కరీంనగర్ శివార్లలో భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటూ సెటిల్‌మెంట్లు సాగిస్తున్న వ్యక్తుల ను ఓ వైపు టార్గెట్ చేసుకుంటూనే... యువతరంతో గ్యాంగులు తయారు చేసి బెదిరింపులకు పాల్పడుతూ జనాల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్న వ్యక్తులపై ఉక్కుపాదం మోపేందుకు కమిషనర్ కమలాసన్‌రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారు.
లవన్‌కుమార్ అనే ఓ రౌడీషీటర్ ఆగడాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కమిషనర్ అతనికి సహకరిస్తున్న వారిని, అతను పెంచిపోషిస్తున్న గ్యాంగ్‌ను టార్గెట్ చేశారు. గురువారం స్వయంగా టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆయన లవన్ గ్యాంగ్, అతనికి సహకరిస్తున్న వారి గురించి ఆరా తీశారు. అదుపులోకి తీసుకున్న వారి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా యువకులు సాగిస్తున్న దందాలు, నమోదైన కేసులను పరిశీలించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న 169 మంది రౌడీషీటర్లు, ఆస్తుల వివాదాల్లో జోక్యం చేసుకొనే మరో 241 మంది ప్రస్తుతం చేస్తున్న కార్యకలాపాలపై దృష్టి పెట్టారు. అదే సమయంలో ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ముఖ్యమైన వ్యక్తులను తూలనాడుతున్న వ్యక్తులపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
శివార్లలో పెరిగిన భూదందాలు
కరీంనగర్ శివార్లలో భూ వివాదాలు ఇటీవలి కాలంలో పెరిగాయి. సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి రూట్లలో జిల్లా కేంద్రం నుంచి సుమారు 10 కిలోమీటర్ల వరకు భూముల క్రయ విక్రయాల్లో లాండ్ మాఫియా ప్రవేశించింది. స్థానిక ప్రజా ప్రతినిధులు, కరీంనగర్ నుంచి భూదందా సాగించే మాఫియా ప్రధాన రోడ్ల పక్కన ప్లాట్లు కొన్న వారిని, భూములు కొన్న వారిని లక్ష్యంగా చేసుకొని లేని వివాదాలు సృష్టిస్తున్నారు. తరువాత సెటిల్‌మెంట్ల పేరుతో గతంలో భూములు కొన్నవారిని, అమ్మిన వారిని బెదిరించి తామే సొంతం చేసుకుంటున్నారు. గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల జరిగిన దందాల స్థాయిలో కరీంనగర్ చుట్టుపక్కల ల్యాండ్ మాఫియా భూ వివాదాలు సృష్టిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్తపల్లి భూ వివాదంలో జోక్యం చేసుకున్న లవన్ కుమార్ అనే రౌడీషీటర్‌పై కేసులు నమోదు చేసిన పోలీసులు అతనికి సహకరించారనే అనుమానంతో మరికొందరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.
బొమ్మకల్ ప్రాంతంలో ఓ స్థానిక ప్రజాప్రతినిధి ఆగడాలు కూడా పెరిగిపోవడంతో ఆ వైపు కూడా దృష్టి పెట్టారు. చిన్న చిన్న భూవివాదాలను పెద్దవిగా చేసి, లబ్ధిపొందేందుకు కొందరు వ్యక్తులు చేస్తున్న ఈ దందాలకు సంబంధించి ఇప్పటికే పూర్తి సమాచారం తెప్పించిన కమిషనర్ ఫిర్యాదులు అందిన వెంటనే ‘లోపలికి’ పంపించే దిశగా ఆదేశాలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే, కించపరిచే వ్యాఖ్యలు పెట్టిన వారిపై కూడా చర్యలకు సిద్ధమవుతున్నారు. విదేశాల్లో చదువుకొంటూనో... ఉద్యోగాలు చేస్తూనో ఉండే యువకులు రెచ్చగొట్టేలా పెట్టే పోస్టింగ్‌లను కూడా సీరియస్‌గా తీసుకొని ‘రెడ్‌కార్నర్’ నోటీస్‌లు జారీ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
జిల్లాలో 241 మంది భూవివాదాల్లో జోక్యం
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో కలిపి 536 మందిని వివాదాస్పద వ్యక్తులుగా గుర్తించిన పోలీసులు, పలు ‘షీట్ల’ను తెరిచారు. క్రిమినల్ కేసుల్లో బుక్కయిన వారు, బెదిరింపులకు పాల్పడుతూ రౌడీయిజం చేస్తున్న 169 మంది మీద ఇప్పటికే రౌడీషీట్లు తెరిచారు. వీరిలో కొందరిపై పీడీ యాక్టు ప్రయోగించి జైళ్లకు పంపించారు. మతపరమైన సమస్యలు వచ్చినప్పుడు అనుమానాస్పదంగా వ్యవహరించే 61 మంది జాతకాలు కూడా తీసుకున్నారు. ఇక ఆస్తులకు సంబంధించిన వివాదాల్లో జోక్యం చేసుకునే వారి జాబితా 241గా రికార్డు చేశారు. వీరిలో 100 మంది వరకు రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారే కావడం గమనార్హం. మట్కా ఆడించేవారు ఐదుగురైతే, గుట్కా సరఫరా చేసేవారు 47 మంది. గంజాయి రవాణాలో పాల్గొనే నలుగురు వ్యక్తులతోపాటు ఇసుక మాఫియా కింద మరో 9 మందిపై ప్రత్యేక షీట్లు తెరిచారు. వీరంతా కరీంనగర్ నుంచి హుజూరాబాద్, చొప్పదండి వరకు విస్తరించి ఉండడంతో వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కమిషనర్ అన్ని పోలీస్‌స్టేషన్లను ఆదేశాలు జారీ చేశారు. కాగా 84 మందిపై పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపించడమే కాకుండా... జైలుకు వెళ్లివచ్చిన వారందరిపై రౌడీషీట్లు తెరవడం గమనార్హం.
రౌడీయిజం, భూ దందాలను సహించం
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా సహించేది లేదు. యువత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. విద్యార్థి దశలో దారి తప్పితే చెడు ప్రభావాలకు లోనయ్యే అవకాశం ఉంది. బర్త్‌డే పార్టీలు కుటుంబసభ్యులు, స్నేహితులతో ఇళ్లలోనే జరుపుకోవాలని తల్లిదండ్రులు చెప్పాలి. లవన్‌కుమార్ అనే రౌడీషీటర్ విషయంలో పోలీస్ శాఖ సీరియస్‌గా ఉంది. అక్రమ పద్ధతుల్లో భూదందాలు సాగిస్తూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేసే వారిపై కేసులు నమోదు చేస్తాం. బాధితులు సిటీ స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్ 0878 – 2240276కు గానీ, ఇన్‌స్పెక్టర్‌కు 9440795104 నెంబర్ ద్వారా గానీ సంప్రదించవచ్చు. ఎవరినీ వదలం. – కమలాసన్‌రెడ్డి, కమిషనర్ ఆఫ్ పోలీస్
చౌరస్తాల్లో... కత్తులతో కేకులు కట్
యువత ఆలోచనలు వెర్రితలలు వేసిందనడానికి ఇటీవలి కాలంలో పెరిగిన రోడ్లపై బర్త్‌డేలు నిర్వహించుకునే సంస్కృతే నిదర్శనం. బైపాస్‌లో బొమ్మకల్ వైపున్న బ్రిడ్జి మీద గతంలో అర్ధరాత్రి బర్త్‌డేలు జరుపుకొన్నట్లు వచ్చిన ఫిర్యాదులతో పోలీసులు చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు అక్కడికి వెళ్లడం లేదు. కానీ నగరంలోని కాలనీలు, రోడ్లతోపాటు మునిసిపాలిటీలు, గ్రామాల్లో చౌరస్తాల్లో రాత్రి 12 తరువాత తాగి తందనాలాడుతూ బర్త్‌డేలు జరుపుకొనే వింత ధోరణి పెరిగింది. బర్త్‌డే కేకును ప్లాస్టిక్ లేదా స్టీల్ చాకుతో కోయడం ఆనవాయితీ. కానీ ఇటీవల కాలంలో తల్వార్లు, పొడవాటి పెద్దపెద్ద కత్తులతో కేకులు కట్ చేస్తూ సినిమాల్లో తరహా వాటిని ప్రదర్శిస్తున్నారు. లవన్‌కుమార్ అనే రౌడీషీటర్ బర్త్‌డే పార్టీ కూడా ఓ అపార్ట్‌మెంట్‌లో రాత్రి నుంచి తెల్లవారు జాము దాక జరగడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో లవన్ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకొన్నారు. కాగా బర్త్‌డే సందర్భంగా గానీ, ఇతర ఏ సందర్భంలో గానీ కత్తులను ప్రదర్శిస్తే ‘ఆయుధ చట్టం’ కింద కేసు నమోదు చేయనున్నట్లు కమిషనర్ కమలాసన్ రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment