అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :ప్రశాంతంగా ఉన్న అమలాపురం పట్టణం మారణాయుధాలతో అల్లర్లు, పరస్పర దాడులకు వేదికవుతోంది. ఆధిపత్య పోరులో ఒకరినొకరు హతమార్చేందుకు కూడా వెనుకాడడం లేదు. పాతకక్షలతో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమ కేంద్రమైన అమలాపురం ఇటీవల నివురుగప్పిన నిప్పులా తయారైంది.రౌడీగ్యాంగ్ వార్‌తో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకుంటాయోనని ప్రజల గుండెల్లో గుబులురేగుతోంది. అమలాపురంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఇద్దరు రౌడీషీటర్ల వర్గాల మధ్య పరస్పర దాడులతో పట్టణ ప్రజలు ఉలిక్కి పడ్డారు. రౌడీషీటర్ల మధ్య ఆధిపత్య పోరుతో గతంలో ఎదురైన అనేక చేదు అనుభవాలను... భయానక సంఘటనలను ప్రజలు గుర్తుకు తెచ్చుకుని ఆందోళనకు గురయ్యారు. ఫ్యాక్షనిజాన్ని తలపించేలా.. రౌడీషీటర్లు మారణాయుధాలతో రెచ్చిపోతున్న చర్యలు పోలీసులకు సైతం దడపుట్టిస్తున్నాయి.
సెటిల్మెంట్లతో ఆజ్యం
రౌడీషీటర్ల మధ్య ఆధిపత్య పోరు సివిల్ సెటిల్మెంట్ల నుంచి మొదలవుతోంది. రెండు దశాబ్దాల క్రితం ఇలాంటి సంఘటనలను పరికిస్తే.. 2000లో ఇలాంటి ఆధిపత్య పోరులో భాగంగా అమలాపురంలో జరిగిన జంట హత్యల సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. అమలాపురం కేంద్రంగా పట్టణంలోనే కాకుండా పరిసర గ్రామాల్లోను అనేక హత్యలు జరిగాయి. పట్టణంలో దాదాపు 35 మంది రౌడీషీటర్లున్నట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. వీరిలో చాలామంది నేరాలకు దూరంగా ఉన్నారు. సుమారు పది మంది రౌడీలు మాత్రం చెలరేగిపోతున్నారు.
ఈ ప్రాంతానికి చెందిన ఓ రౌడీషీటర్ వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో ఉంటూ పట్టణంలో తన అనుచరగణాన్ని పెంచిపోషిస్తున్నాడు. సెటిల్మెంట్లతో ఇక్కడ దందా చేస్తున్నాడు. పట్టణానికి చెందిన మరో రౌడీషీటర్ ఇక్కడ వ్యాపారం చేస్తూనే కొంత మంది రౌడీబ్యాచ్‌కు బాస్‌గా ఉన్నాడు. ఈ ఇద్దరి రౌడీషీటర్ల మధ్య కక్షలు కరుడుగట్టాయి. ఇందులో భాగంగానే ఆ ఇద్దరి రౌడీషీటర్ల వర్గాల మధ్య ఆదివారం అర్ధరాత్రి పరస్పర దాడులు జరిగాయి. నెల రోజుల క్రితం ఓ రౌడీ షీటర్ తన ప్రత్యర్థిని హతమార్చేందుకు పన్నిన పథకం త్రుటిలో తప్పడంతో అప్పట్లో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అప్పటి నుంచైనా పోలీసులు రెండు వర్గాలపై దృష్టిపెట్టి ఉంటే.. తాజా సంఘటన జరిగేది కాదంటున్నారు.
పోలీసులకు సన్నిహిత సంబంధాలు
రౌడీషీటర్లకు పోలీసులు తరచూ కౌన్సెలింగ్‌లు నిర్వహించాల్సి ఉంది. అమలాపురం పోలీసులు ఇందుకు చొరవ చూపలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధిపత్య పోరుతో రగిలిపోతున్న వారిని పిలిచి.. వారికి కళ్లెం వేసే వీలున్నా, పాత్రధారులపైనే చర్యలు తీసుకుంటున్నారు. కొందరు పోలీసులతో సూత్రధారులు సన్నిహితంగా ఉంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. పోలీసు స్టేషన్‌కు వచ్చిన కొన్ని సివిల్ వివాదాలు, అప్పటికే ఈ రౌడీషీటర్ల వద్ద తగువు రూపంలో ఉండడంతో అక్కడికి వెళ్లి సమస్య పరిష్కరించుకోండని కొందరు పోలీసులు ఉచిత సలహాలు ఇస్తున్నట్టు తెలిసింది. దీనికితోడు ఈ రౌడీషీటర్ల వర్గాలకు రాజకీయ నాయకుల అండదండలు తోడవడంతో వారి దందాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది.
రౌడీయిజంపై కఠినచర్యలు : డీఎస్పీ రఘు
అమలాపురంలో రౌడీషీటర్ల మధ్య ఉన్న గొడవల వల్ల తలెత్తుతున్న శాంతి, భద్రతల సమస్యపై తాను బాధ్యతలు చేపట్టిన గత 4 నెలల నుంచి ప్రత్యేక దృష్టి పెట్టానని అమలాపురం డీఎస్పీ కె.రఘు అన్నారు. సెటిల్మెంట్లు చేస్తున్న రౌడీషీటర్లతో పట్టణంలో కొందరు పోలీసులు సన్నిహితంగా ఉంటున్నారన్న విషయం ఇప్పుడే తన దృష్టికి వచ్చిందన్నారు. వీటన్నింటిపైనా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ, రౌడీయిజం అదుపునకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కోనసీమలో రౌడీయిజం
Published Tue, Nov 5 2013 2:34 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement