తన వద్దకు వివిధ రోగాలతో వచ్చిన ఎంతో మంది రోగులకు సాంత్వన చేకూర్చే చేయి అది... వెంటాడిన రోగంతో జీవితంపైనే విసిగి, వేసారిన బాధాతప్త హృదయాలకు పలు సూచనలిచ్చి ధైర్యం నింపిన ఓ వ్యక్తిత్వ వికాస నిపుణుడాయన.భగవంతుడు ఇచ్చిన జీవితంలో లోపాలుంటే మంచి వైద్యంతో సరిదిద్దుకొని ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని ధైర్యం నూరిపోసి జన జీవన స్రవంతిలో కలిసేటట్టు చేసిన వైద్యుడాయన..మానవ శరీరంలో ఎన్నో ఎముకలు, ఆ అమరికలో తేడాలొచ్చి మొరాయిస్తే సరి చేసి నొప్పులను మటుమాయం చేసే హస్తవాసి ఆయనది... అమలాపురంలో ఓ నర్సింగ్ హోం ...రోగులకు అందుబాటులో ఉండడమే కాదు ... తన ఇద్దరు కొడుకులను కూడా వైద్య విద్యవైపే అడుగులు వేయించిన ముందుచూపున్న తండ్రి ఆయన... పెద్ద కుమారుడు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎముకల వైద్యంలో ఎండీ చేయాలని సమాయత్తమవుతున్నాడు...చిన్న కుమారుడు కూడా ఎంబీబీఎస్ చదువుతూ అదే బాటలో పయనిస్తున్నాడు.
సాక్షి, అమలాపురం(తూర్పుగోదావరి) : ఆస్తులకు మించి ఉన్న అప్పుల భారం నుంచి శాశ్వతంగా దూరమయ్యేందుకు ఆ వైద్యుడి కుటుంబం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడింది. రూ.కోట్లలో స్థిరాస్తులున్నా.. అంతకుమించిన రూ.10 కోట్లకు పైగా అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరకు తనతో పాటు తన భార్య, తన పెద్ద కుమారుడి ఊపిరి తీసుకున్నారు. అమలాపురం కాలేజీ రోడ్డులో సుబ్రహ్మణ్యస్వామి గుడి వీధిలో ఉన్న శ్రీకృష్ణ ఆర్థోపెడిక్ అండ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ పెన్మత్స రామకృష్ణంరాజు కుటుంబం శుక్రవారం ఉదయం ఈ అఘాయిత్యానికి పాల్పడింది. డాక్టర్ రామకృష్ణంరాజు (55), ఆయన భార్య లక్ష్మీదేవి (45), వారి పెద్ద కుమారుడు డాక్టర్ కృష్ణ సందీప్ (25) బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.
వీరి చిన్న కుమారుడు కృష్ణవంశీ రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్ వైద్య కళాశాలలో ఆఖరి సంవత్సరం వైద్య విద్య చదువుతున్నాడు. సామూహికంగా ఆత్యహత్య చేసుకునేందుకు చిన్న కుమారుడిని కూడా తండ్రి రమ్మని పిలిచినా పనుండి రాకపోవడంతో కృష్ణ వంశీ చావు నుంచి తప్పించుకున్నాడు. అయితే మొత్తం కుటుంబాన్నే కోల్పోయి కోలుకోలేని దెబ్బతిన్నాడు. శుక్రవారం ఉదయం డాక్టర్, మందుల షాపును నిర్వహించే ఆయన భార్య తాము నివాసం ఉండే పై అంతస్తు నుంచి కింద ఉన్న హాస్పిటల్‌కు రాకపోవడంతో సిబ్బంది పైకి వెళ్లి చూడగా మెట్ల వద్ద గేటుకు తాళం వేసి ఉంది. ఫోన్లు చేసినా స్పందన లేకపోవడంతో అనుమానంతో సిబ్బంది గోడ దూకి వెళ్లి తలుపులు గెంటి చూడగా డాక్టర్ కుటుంబీకులు నేలపై విగత జీవులై పడి ఉన్నారు.
ఉలిక్కిపడిన అమలాపురం
డాక్టర్ కుటుంబం ఆత్యహత్యతో అమలాపురం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని చిలకలపేటకు చెందిన డాక్టర్ రామకృష్ణంరాజు సౌమ్యుడు. పాతికేళ్ల క్రితం కోనసీమకు చెందిన లక్ష్మీదేవిని ఆయన పెళ్లి చేసుకుని అమలాపురంలో ఆర్థోపెడిక్ వైద్యుడిగా స్థిరపడ్డారు. అమలాపురం కాలేజీ రోడ్డులో హస్పిటల్ భవనాన్ని, నివాస గృహాన్ని కలిపి సువిశాలంగా నిర్మించుకున్నారు. పది మంది సిబ్బందితో ఎప్పుడూ పేషంట్లతో హడావుడిగా ఉండే ఆ ఆసుపత్రి డాక్టర్ కుటుంబం ఆత్మహత్యతో ఒక్కసారిగా కళతప్పి నిస్తేజంగా మారింది. డాక్టర్ ద్వారా చికిత్సలు, శస్త్ర చికిత్సలు చేయించుకున్న పట్టణానికి చెందిన అనేక మంది ఆయన కుటుంబం ఆత్మహత్య వార్త తెలిసి భారీగా అక్కడికి తరలివచ్చి విలపించారు.
ఆత్యహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్
డాక్టర్ రామకృష్ణంరాజు కుటుంబం ఆత్యహత్య చేసుకునే ముందు డాక్టర్ తన సొంత దస్తూరీతో సూసైడ్ నోట్ రాశారు. అందులో అప్పుల పాలు ఎలా అయ్యాను. ఎందుకు తీర్చలేకపోయాను. తనను ఎవరెవరు మానసికంగా ఇబ్బంది పెట్టారు. ఎవరెవరు విపరీతంగా ఒత్తిళ్లు చేశారు. ఎవరు తన వద్ద నుంచి రూ.రెండు కోట్లు తీసుకుని మోసం చేశారు. తనకు ఇవ్వాల్సిన వారు ఇవ్వకుండా తనను ఎంత ఇబ్బంది పెట్టారో ఆ నోట్‌లో రాశారు. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిళ్లు తట్టుకోలేక తన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతోందని ఆ నోట్‌లో రాశారు. ఈ సూసైడ్ నోట్‌ను డీఎస్పీ బాషా స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్‌లోని వివరాల దిశగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అమలాపురం డీఎస్పీ షేక్ మసూమ్ బాషా, అమలాపురం పట్టణ సీఐ బి.సురేష్‌బాబు, రూరల్ సీఐ ఆర్.భీమరాజు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలను సేకరించింది.
డాక్టర్ రామకృష్ణంరాజు, భార్య లక్ష్మీదేవి, కుమారుడు డాక్టర్ కృష్ణ సందీప్
అప్పులపాలైంది ఇలా..
మూడేళ్ల క్రితం వరకూ డాక్టర్ రామకృష్ణంరాజు కుటుంబం, ఆసుపత్రి అంతా సజావుగా సాగిపోయింది. తన ఇద్దరు కుమారులను డాక్టర్లను చేయాలన్న కలను నెరవేర్చుకున్నారు. పెద్ద కుమారుడు డాక్టర్ అయ్యాడు. చిన్న కుమారుడు త్వరలో డాక్టర్ కాబోతున్నాడు. ఇటీవల కాలంలో డాక్టర్ కృష్ణంరాజు భూములు కొనుగోలు చేయడం, లాభాలకు విక్రయించడం ఇలా క్రమేపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం వైపు వెళ్లారు. రూ.కోట్లతో భూములు క్రయ, విక్రయాలు సాగేవి. వీటిలో ఆయన విపరీతంగా నష్టపోయారు. దీంతో విధిలేక తొలుత వాణిజ్య బ్యాంకుల్లో...తర్వాత ప్రైవేటు ఫైనాన్సర్ల వద్ద అప్పలు చేశారు. రూ.10 వడ్డీలకు ఆయన ప్రైవేటు అప్పులు చేశారు. వాటి చెల్లింపులపై నెల రోజులుగా విపరీతమైన ఒత్తిళ్లు పెరిగిపోయాయి. మూడు రోజుల్లో బ్యాంక్ అధికారులు, వడ్డీ వ్యాపారులు ఆసుపత్రికి, ఇంటికి వచ్చి ఆస్తులు జప్తు చేస్తామన్న హెచ్చరికలు కూడా చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ తన ఇల్లు, ఆస్పత్రి కలిపి ఉన్న విశాలమైన భవనాన్ని కూడా ఇటీవల బేరం పెట్టారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ఫైనాన్సియర్ ‘మీ అప్పులు పూర్తిగా తీర్చేలా మార్గం నేను చూస్తాను. అప్పు ఎంతో ఉందో అంత మొత్తం నేనే అప్పుగా ఇస్తాను. ముందు రూ.రెండు కోట్లు చెల్లించమ’ని చెప్పిన మాటలను డాక్టర్ నమ్మేసి అంత మొత్తం అతికష్టంగా సమకూర్చారు. తర్వాత ఆ ఆసామి ఆ డబ్బును కాజేసి నమ్మక ద్రోహం చేశాడు. ఆ మోసాన్ని కూడా డాక్టర్ తట్టుకోలేకపోయి మానసికంగా కుంగిపోయారు. ఆన్‌లైన్ లావాదేవీలతో తనను కొందరు మోసం చేసినట్టు ఆస్పత్రి సిబ్బంది వద్ద తరచూ చెప్పి డాక్టర్ విలపించేవారు.
ఒంటరైన కృష్ణవంశీ
నాన్న, అమ్మ, అన్నయ్య ఒకేసారి ఆత్మహత్య చేసుకున్న దృశ్యాన్ని చూసి మృతుడు డాక్టర్ రామకృష్ణంరాజు చిన్న కుమారుడు, వైద్య విద్యార్థి కృష్ణ వంశీ తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన తండ్రి గురువారం సాయంత్రం ఫోన్ చేసి ‘అప్పుల భారాన్ని ఇక తట్టుకోలేను. మనమందరం కలసి ఆత్మహత్యలు చేసుకుందాం...నువ్వు కూడా రాజమహేంద్రవరం నుంచి వచ్చేయ్’అని అన్నారు. అయితే కృష్ణ వంశీ తన తండ్రిని ఫోన్‌లోనే సముదాయించి కంగారు పడకండి.. నాకు రేపు ఉదయం (శుక్రవారం) పరీక్ష ఉంది. అది రాసి రేపు సాయంత్రానికి వస్తాను. అప్పటి దాకా ఎలాంటి ఆలోచన్లు వద్దు అని చెప్పాడు. అయితే ఉదయాన్నే నాన్న, అమ్మ, అన్నయ్య ఆత్యహత్యలు చేసుకున్నారన్న ఫోన్‌తో కృష్ణవంశీ రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్ వైద్య కళాశాల నుంచి వచ్చాడు. తన కుటుంబంలో అందరూ ప్రాణాలు తీసుకోవడంతో కృష్ణ వంశీ ఒంటరైపోవడాన్ని చూసి బంధువులు, ఆస్పత్రి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment