సీసీఎస్ సీఐ రామయ్య నాయుడు
కర్నూలుకు చెందిన గోపాల్‌రెడ్డి అనే చిట్‌ఫండ్ వ్యాపారిపై నమోదైన చీటింగ్ కేసులో అతనిపై రౌడీషీట్ తెరవకుండా ఉండేందుకు సీసీఎస్ సీఐ రామయ్య నాయుడు లంచం డిమాండ్ చేసి సోమ వారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డా డు. ఆయన తరఫున మధ్యవర్తిగా వ్యవహరించిన న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డిని కూడా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కర్నూలు: గోస్పాడు మండలం కానాలపల్లెకు చెందిన పుల్లయ్య కుమారుడు శత్రుఘ్న శశాంక్ పదో తరగతి టీసీని పోలీస్ స్టేషన్ ద్వారా పొందేందుకు ప్రయత్నించాడు. అయితే ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి రూ.30 వేలు డిమాండ్ చేశాడు. ఆ మొత్తం ఇచ్చేందుకు పుల్లయ్య అంగీకరించి ఆగస్టు 11న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కానాలపల్లె సమీపంలోని గోదాము వద్ద కానిస్టేబుల్ హరినాథ్ వచ్చి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతన్ని విచారణ చేయగా ఎస్‌ఐ ఆదేశాల మేరకే తాను డబ్బు తీసుకున్నానని చెప్పాడు.
♦ హెడ్ కానిస్టేబుల్ సూర్య నారాయణరెడ్డి ద్వారా ఓ కేసు విషయంలో రూ.20 వేల లంచం తీసుకుంటూ కర్నూలు అర్బన్ తాలూకా సీఐగా పని చేసిన ఇస్మాయిల్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు.
♦ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న అభియోగంపై నంద్యాల డీఎస్పీగా పని చేసిన హరినాథరెడ్డిపై ఏసీబీ అధికారు లు కేసు నమోదు చేసి జైలుకు పంపారు.
♦ భార్యాభర్త కేసులో కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ పెద్దయ్యరూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు.
♦ అక్రమ సరుకు రవాణా వాహనాన్ని విడుదల చేసేందుకు రూ.50 వేలు లంచం తీసుకుంటూ ట్రాఫిక్ విభాగంలో పని చేసిన సీఐ ఏసీబీ వలకు చిక్కారు.ఇలా కొంతకాలంగా పోలీసు అధికారులు ఏసీబీకి పట్టుబడుతూ ఆ శాఖను అప్రతిష్టను మంటగలుపుతున్నారు.
ప్రభుత్వ శాఖల్లో అవినీతి, లంచగొండితనం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఏయే శాఖల్లో అవినీతి జరుగుతోందో తెలుసుకునేందుకు ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా ఇన్‌ఫార్మర్లను నియమించుకున్నారు. వారిచ్చే సమాచారం ఆధారంగా అవినీతిపరుల భరతం పడుతున్నారు. లంచాల కోసం పట్టిపీడిస్తున్న అధికారుల జాబితాను ఏసీబీ తయారు చేసినట్లు తెలుస్తోంది. తాజా జాబితాలో మరో ఆరుగురు పోలీసు అధికారులు ఉన్నట్లు సమాచారం. లంచాలు తీసుకోవడమే కాకుండా ఆదాయానికి మించి ఆస్తులను సంపాదిస్తున్న వారిపైనా ఏసీబీ అధికారులు కన్నేసి ఉంచారు. ఈ సమాచారాన్ని ముందుగానే పసిగడుతున్న కొంతమంది..ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ శాఖల్లోని అధికారులు ముందు జాగ్రత్తగా సెలవుపై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. లంచం తీసుకుంటూ ఇటీవల కాలంలోనే ముగ్గురు పోలీసు అధికారులు పట్టుబడడం, తాజాగా సీసీఎస్ సీఐ రామయ్య నాయుడు కూడా ఏసీబీ వలకు చిక్కి.. ఆ శాఖ డీఎస్పీ నాగభూషణంపైనే తిరుగుబాటు చేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాలో ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు 19 కేసులు నమోదు చేశారు. ఈ కేసులతో సంబంధం ఉన్న సుమారు 23 మందిని రిమాండ్‌కు పంపారు. అలాగే మూడు సందర్భాల్లో ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించి అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.
నేరుగాఫిర్యాదు చేయొచ్చు
అవినీతి అధికారులపై బాధితులెవరైనా ఫోన్ ద్వారా లేదా నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. బాధితులతో పాటు సాధారణ ప్రజలకు కూడా ప్రశ్నించే అధికారం ఉంది. బాధితుల పేర్లు గోప్యంగా ఉంచి.. వారికి పూర్తి రక్షణ కల్పిస్తాం. – నాగభూషణంఏసీబీ డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment