ccs station
-
మొండికేస్తున్న సోమాలియన్లు...
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అక్రమంగా నివాసం ఉంటూ పోలీసులకు పట్టుబడిన సోమాలియన్లలో ఒకరు ఇంకా నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని డిపోర్టేషన్ సెంటర్లోనే ఉండిపోయారు. ఇతడితో సహా మొత్తం ఎనిమిది మంది తమ స్వదేశానికి వెళ్లడానికి విముఖత చూపడంతో సిటీ అధికారులు ఐక్యరాజ్య సమితి సహాయం కోరారు. యూనైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ (యుఎన్‌హెచ్‌ఆర్‌సీ) జోక్యంతో ఏడుగురికి వివిధ స్కాండెనేవియన్ దేశాలు శరణార్థులుగా ఆశ్రయం కల్పించగా.. ఒకరికి మాత్రం ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో అతను ఇక్కడే ఉండిపోయాడు. అతడికి తోడు మరో ఇద్దరు బంగ్లాదేశీయులు ప్రస్తుతం ఈ డిపోర్టేషన్ సెంటర్లో ఉన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు రెండు నెలలుగా వీరి డిపోర్టేషన్ ప్రక్రియ ఆగిపోయింది. సక్రమంగా వచ్చి అక్రమంగా మారి... నగరం విద్య, వైద్య, వృత్తి, వ్యాపార, పర్యాటక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో పాటు దేశాలకు చెందిన వారు ఇక్కడికి వస్తున్నారు. స్టడీ, విజిట్, బిజినెస్, మెడికల్ వీసాలపై వచ్చిన వారిలో కొందరు అక్రమంగా ఇక్కడే ఉండిపోతున్నారు. మరికొందరు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా వివిధ మార్గాల్లో నగరానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న వారిలో ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రధానంగా సూడాన్, సోమాలియా, నైజీరియా, యమన్, కెన్యా, జిబౌటీ తదితర దేశాల నుంచి వస్తున్న వారితోనే ఇబ్బంది ఎక్కువగా ఉంటోంది. ఆయా దేశాల్లో ఉన్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడే అక్రమంగా స్థిరపడాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం వివిధ రకాలైన వీసాలపై ఇక్కడికి వచ్చేస్తున్నారు. మొండికేస్తున్న సోమాలియన్లు... ఈ ఏడాది జనవరిలో చిక్కిన సోమాలియా తదితర దేశాలకు చెందిన వారు డిపోర్టేషన్ సెంటర్‌కు చేరారు. మిలిగిన వారు తమ దేశాలకు వెళ్లిపోగా.. సోమాలియా దేశానికి చెందిన ఎనిమిది మంది మాత్రం తమ స్వదేశానికి వెళ్లేందుకు విముఖత చూపారు. దీంతో వారి విషయంలో అధికారులు యుఎన్‌హెచ్‌ఆర్‌సీ సహాయం తీసుకున్నారు. ఏడుగురి వద్ద సోమాలియా జాతీయులుగా నిరూపించడానికి అవసరమైన పత్రాలు లభించాయి. దీంతో యుఎన్‌హెచ్‌ఆర్‌సీ వీరికి వివిధ స్కాండినేవియన్ దేశాల్లో శరణార్థులుగా ఆశ్రయం కల్పించింది. ఒకరు మాత్రం దాదాపు 13 ఏళ్ల క్రితమే సోమాలియా నుంచి నగరానికి వచ్చేయడంతో ఇతడికి సంబంధించి ఆ దేశ రాయబార కార్యాలయం ఎలాంటి ధ్రువీకరణలు ఇవ్వలేకపోయింది. ఫలితంగా శరణార్థిగా మారే అర్హత లేక డిపోర్టేషన్ సెంటర్లోనే ఉండిపోయాడు. ఇతడితో పాటు దాదాపు రెండున్నర నెలల క్రితం చిక్కిన ఇద్దరు బంగ్లాదేశీయులు కూడా డిపోర్టేషన్ కోసం ఇక్కడికి వచ్చారు. లాక్డౌన్ నేపథ్యంలో డిపోర్టేషన్ ప్రక్రియలు జరగట్లేదు. ఇవి ఎప్పుడు ప్రారంభం అవుతాయో చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. అప్పటి వరకు వారు సీసీఎస్ ఆ«ధీనంలోనే ఉండాల్సి ఉంది. డిపోర్టేషన్ సెంటర్‌గా సీసీఎస్... అక్రమంగా నివసిస్తూ పట్టుబడిన విదేశీయులతో పాటు వివిధ నేరాల్లో చిక్కిన వారినీ పోలీసులు అరెస్టు చేయడం, తమ ఆధీనంలోకి తీసుకోవడం చేస్తారు. వీరిపై సంబంధిత కేసులు నమోదు చేసిన తర్వాత దాని తీరును బట్టి తదుపరి చర్యలు తీసుకుంటారు. వీరిని ఆయా దేశాలకు బలవంతంగా తిప్పి పంపడానికి (డిపోర్టేషన్) ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అప్పటి వరకు డిపోర్టేషన్ సెంటర్లో వారిని ఉంచుతారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సెంటర్ విశాఖపట్నంలో ఉండేది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సీసీఎస్ డిపోర్టేషన్ సెంటర్‌గా మారింది. విదేశీయులు పట్టుబడితే వారిని వెంటనే వారి దేశాలకు పంపడం సాధ్యం కాదు. చిక్కిన వారి వివరాలను ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు (ఎఫ్ఆర్ఆర్ఓ) పంపి, అక్కడి నుంచి ఆయా దేశాలకు చెందిన ఎంబసీలకు సమాచారం ఇవ్వడం ద్వారా వివరాలు పొంది, వారి సాయంతోనే డిపోర్ట్ చేయాలి. -
లాక్డౌన్ సమయం సద్వినియోగం!
సాక్షి, సిటీబ్యూరో: నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొత్త కేసులు లేకపోవడం, యూఐ కేసుల దర్యాప్తునకు ఆటంకం ఏర్పడంతో బందోబస్తు విధులు పోగా మిగిలిన వారు పాత కేసుల ‘దుమ్ము’ దులుపుతున్నారు. కొలిక్కి చేరే, తాజా అరెస్టులు చోటు చేసుకునే ఆస్కారం లేని వాటిని మూసేసేందుకు అర్హమైన వాటిని గుర్తించి, క్లోజ్ చేసేందుకు అనుమతులు కోరుతూ ప్రతిపాదనలు పంపుతున్నారు. కమిషనరేట్ పరిధిలో పోలీస్ స్టేషన్‌గా భావించే సీసీఎస్ సిటీ పోలీసు విభాగానికి గుండెకాయ వంటిది. రూ.30 లక్షలకు పైబడిన చోరీ, దోపిడీ, బందిపోటు దొంగతనాలతో పాటు రూ.75 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో ముడిపడిన మోసాల కేసులతో పాటు తీవ్రమైన నేరాలకు సంబంధించినవీ దర్యాప్తు నిమిత్తం ఈ విభాగానికే బదిలీ అవుతూ ఉంటాయి. కొత్త కీలక కేసులను సీసీఎస్ అధికారులే నేరుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటారు. ఈ పోలీసులు దర్యాప్తు చేసే కేసుల పరిధి వివిధ జిల్లాలు, రాష్ట్రాలతో ముడిపడి ఉంటుంది. ప్రతి ఏడాదీ సీసీఎస్ పోలీసులు దాదాపు 400 కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుంటారు. కరోనా వ్యాప్తి నిరోధానికి మార్చి 23 నుంచి లాక్డౌన్ అమలులోకి వచ్చింది. ఆ తర్వాత సీసీఎస్‌కు వచ్చిన కొత్త కేసులు లేవు. అంతకు ముందు వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ప్రాథమిక విచారణ పూర్తి చేసిన అ«ధికారులు ఒకటి రెండు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు. దీంతో కొత్త కేసులకు పూర్తిగా బ్రేక్ పడింది. దర్యాప్తు దశలో ఉన్న (యూఐ) కేసులపై లాక్డౌన్ ప్రభావం పడింది. ఆధారాల సేకరణ, నిందితుల అరెస్టుల కోసం బయటి ప్రాంతాలకు వేళ్లే ఆస్కారం లేకపోవడం, ఫోరెన్సిక్ ల్యాబ్ సహా ఇతర ఏజెన్సీలు పూర్తి స్థాయిలో పని చేయకపోవడంతో వీటి దర్యాప్తు ఆగిపోయింది. లాక్డౌన్ అమలుకు సంబంధించిన బందోబస్తు విధుల్లో దాదాపు 30 శాతం మంది సీసీఎస్ అధికారులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన సిబ్బందికి ఉన్నతాధికారులు ఓ టాస్క్ అప్పగించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ‘వాంటెడ్’ కేటగిరీకి చెందిన వాటిలో 2000 కంటే ముందు నమోదైన/బదిలీ అయిన వాటిని గుర్తించాలని, వీటిలో ముందుకు వెళ్లే ఆస్కారం లేకపోతే మూసివేతకు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఉదాహరణకు 1999లో నమోదైన ఓ కేసులో మొత్తం ముగ్గురు నిందితులు ఉన్నారు. అప్పట్లో కేవలం ఒకే నిందితుడు అరెస్టు కావడంతో మిగిలిన ఇద్దరినీ కేసు నుంచి వేరు చేసి (స్లి్పట్) దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఆ ఒక్కడి పైనా ఉన్న కేసు సైతం న్యాయస్థానంలో వీగిపోయింది. అయితే ఈ కేసులో ఇద్దరు నిందితులు వాంటెడ్‌గా ఉండటంతో ఇప్పటికీ ఈ కేసు యూఐ కేటగిరీలో పెండింగ్‌గా ఉండిపోయింది. దాదాపు 20 ఏళ్ల క్రితం చిక్కని నిందితులు ఇప్పుడు చిక్కడం దుర్లభమే. అయితే కేసు పెండింగ్‌లో ఉండిపోవడంతో కొన్ని సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటి కేసుల్ని గుర్తిస్తున్న అధికారులు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. వీటిని క్షుణ్ణంగా సమీక్షించే ఉన్నతాధికారులు అర్హమైన వాటిని మూసేయడానికి అనుమతిస్తున్నారు. ఈ స్థాయిలో కేసుల్ని మూసివేయాలంటే ప్రాసిక్యూషన్ విత్‌డ్రా ఒకటే మార్గం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన నివేదికల్ని రూపొందిస్తున్న ఉన్నతాధికారులు నగర కొత్వాల్‌తో పాటు ప్రభుత్వానికి పంపిస్తున్నారు. లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించుకోవడంపై సీసీఎస్ అధికారులు దృష్టి పెట్టారు. -
ఖాకీకి అవినీతి మకిలి
కర్నూలుకు చెందిన గోపాల్‌రెడ్డి అనే చిట్‌ఫండ్ వ్యాపారిపై నమోదైన చీటింగ్ కేసులో అతనిపై రౌడీషీట్ తెరవకుండా ఉండేందుకు సీసీఎస్ సీఐ రామయ్య నాయుడు లంచం డిమాండ్ చేసి సోమ వారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డా డు. ఆయన తరఫున మధ్యవర్తిగా వ్యవహరించిన న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డిని కూడా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కర్నూలు: గోస్పాడు మండలం కానాలపల్లెకు చెందిన పుల్లయ్య కుమారుడు శత్రుఘ్న శశాంక్ పదో తరగతి టీసీని పోలీస్ స్టేషన్ ద్వారా పొందేందుకు ప్రయత్నించాడు. అయితే ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి రూ.30 వేలు డిమాండ్ చేశాడు. ఆ మొత్తం ఇచ్చేందుకు పుల్లయ్య అంగీకరించి ఆగస్టు 11న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కానాలపల్లె సమీపంలోని గోదాము వద్ద కానిస్టేబుల్ హరినాథ్ వచ్చి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతన్ని విచారణ చేయగా ఎస్ఐ ఆదేశాల మేరకే తాను డబ్బు తీసుకున్నానని చెప్పాడు. ♦ హెడ్ కానిస్టేబుల్ సూర్య నారాయణరెడ్డి ద్వారా ఓ కేసు విషయంలో రూ.20 వేల లంచం తీసుకుంటూ కర్నూలు అర్బన్ తాలూకా సీఐగా పని చేసిన ఇస్మాయిల్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. ♦ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న అభియోగంపై నంద్యాల డీఎస్పీగా పని చేసిన హరినాథరెడ్డిపై ఏసీబీ అధికారు లు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ♦ భార్యాభర్త కేసులో కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ పెద్దయ్యరూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ♦ అక్రమ సరుకు రవాణా వాహనాన్ని విడుదల చేసేందుకు రూ.50 వేలు లంచం తీసుకుంటూ ట్రాఫిక్ విభాగంలో పని చేసిన సీఐ ఏసీబీ వలకు చిక్కారు.ఇలా కొంతకాలంగా పోలీసు అధికారులు ఏసీబీకి పట్టుబడుతూ ఆ శాఖను అప్రతిష్టను మంటగలుపుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి, లంచగొండితనం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఏయే శాఖల్లో అవినీతి జరుగుతోందో తెలుసుకునేందుకు ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా ఇన్ఫార్మర్లను నియమించుకున్నారు. వారిచ్చే సమాచారం ఆధారంగా అవినీతిపరుల భరతం పడుతున్నారు. లంచాల కోసం పట్టిపీడిస్తున్న అధికారుల జాబితాను ఏసీబీ తయారు చేసినట్లు తెలుస్తోంది. తాజా జాబితాలో మరో ఆరుగురు పోలీసు అధికారులు ఉన్నట్లు సమాచారం. లంచాలు తీసుకోవడమే కాకుండా ఆదాయానికి మించి ఆస్తులను సంపాదిస్తున్న వారిపైనా ఏసీబీ అధికారులు కన్నేసి ఉంచారు. ఈ సమాచారాన్ని ముందుగానే పసిగడుతున్న కొంతమంది..ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ శాఖల్లోని అధికారులు ముందు జాగ్రత్తగా సెలవుపై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. లంచం తీసుకుంటూ ఇటీవల కాలంలోనే ముగ్గురు పోలీసు అధికారులు పట్టుబడడం, తాజాగా సీసీఎస్ సీఐ రామయ్య నాయుడు కూడా ఏసీబీ వలకు చిక్కి.. ఆ శాఖ డీఎస్పీ నాగభూషణంపైనే తిరుగుబాటు చేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాలో ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు 19 కేసులు నమోదు చేశారు. ఈ కేసులతో సంబంధం ఉన్న సుమారు 23 మందిని రిమాండ్‌కు పంపారు. అలాగే మూడు సందర్భాల్లో ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించి అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. నేరుగాఫిర్యాదు చేయొచ్చు అవినీతి అధికారులపై బాధితులెవరైనా ఫోన్ ద్వారా లేదా నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. బాధితులతో పాటు సాధారణ ప్రజలకు కూడా ప్రశ్నించే అధికారం ఉంది. బాధితుల పేర్లు గోప్యంగా ఉంచి.. వారికి పూర్తి రక్షణ కల్పిస్తాం. – నాగభూషణంఏసీబీ డీఎస్పీ -
ఉపరాష్ట్రపతి నకిలీ పీఏ అరెస్ట్
సాక్షి, హైద్రాబాద్ : ఉపరాష్రపతి పీఏగా చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడు విజయనగరం జిల్లాకు చెందిన నవీన్ అలియాస్ అర్జున్ రావ్‌గా గుర్తించారు. ఉపరాష్రపతి పీఏను అంటూ మెడికల్ సీట్లు, బదిలీల్లో సహాయం చేయాలని సంబంధిత అధికారులను నవీన్ బెదిరించాడు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఈ నెల 13న సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో అప్రమత్తమైన సీసీఎస్ పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
సీసీఎస్ స్టేషన్ ఎదుట గర్భిణీ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ ఏడు నెలల గర్భిణి మంగళవారం ఎలుకల మందు తాగి సీసీఎస్‌కు వచ్చింది. సంయుక్త పోలీసు కమిషనర్ (జేసీపీ) ఛాంబర్ వద్ద ఆమె కుప్పకూలడంతో పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కథనం ప్రకారం... నిజామాబాద్ జిల్లా ధర్నారం గ్రామానికి చెందిన రేష్మ (27) అదే గ్రామానికి చెందిన అక్తర్ అహ్మద్ (29)ను ఆరేళ్ల క్రితం ప్రేమించి, మతాంతర వివాహం చేసుకుంది. ప్రస్తుతం అక్తర్ సెకండ్‌హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తుండగా... వీరు జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరిలో నివాసం ఉంటున్నారు. రేష్మ ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. నాలుగేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. రెండేళ్లుగా భర్త అక్తర్ కట్నం కోసం వేధించడం మొదలెట్టాడు. దీంతో రేష్మ తల్లిదండ్రులు రూ.3 లక్షల వరకు చెల్లించారు. అదనపు కట్నం కోసం అక్తర్ వేధింపులు అధికం కావడంతో రేష్మ ఈ నెల 20న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్తర్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు. కొన్నాళ్లు మంచిగా ఉన్న అక్తర్ మళ్లీ పాతపంథానే అనుసరించాడు. దీంతో రేష్మ మంగళవారం సీసీఎస్‌లోని మహిళా ఠాణాలో ఫిర్యాదు చేయడానికి ఓ సహాయకుడితో కలిసి వచ్చింది. సంయుక్త పోలీసు కమిషనర్ డాక్టర్ టి.ప్రభాకరరావును కలిసేందుకు ఆయన ఛాంబర్ వద్ద వేచి ఉన్న ఆమె మంచినీళ్లు తాగేందుకు వెళ్తూ కుప్పకూలిపోయింది. అక్కడున్న పోలీసు అధికారులు హుటాహుటిన ఆమె వద్దకు వచ్చి సపర్యలు చేశారు. ఇంతలో ఆమెతో వచ్చిన వ్యక్తి రేష్మ ఎలుకల మందు తాగిందని చెప్పడంతో హుటాహుటిన కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు ఎలుకల మందు బయటికి తీయడానికి ప్రయత్నించగా రేష్మ సహకరించలేదు. రేష్మ ఏడు నెలల గర్భవతి కావడంతో ఉస్మానియా వైద్యులు జాగ్రత్తగా చికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, అయితే గర్భిణి కావడంతో రెండు రోజులు అబ్జర్వేషన్ తర్వాతే పూర్తి వివరాలు చెప్పగలమని ఉస్మానియా ఆసుపత్రి సీఎంఓ ధనుంజయ తెలిపారు. రేష్మ విషయంపై జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ఎస్.వెంటకరెడ్డిని వివరణ కోరగా... ఈ నెల 20న తన భర్త కనిపించట్లేదంటూ ఫిర్యాదు చేసింది. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసి, లుక్ఔట్ నోటీసులు సైతం జారీ చేశాం. అక్తర్ ఆచూకీ కోసం ఎస్సై విజయ్‌కుమార్ నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశామని చెప్పారు.