సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అక్రమంగా నివాసం ఉంటూ పోలీసులకు పట్టుబడిన సోమాలియన్లలో ఒకరు ఇంకా నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని డిపోర్టేషన్ సెంటర్‌లోనే ఉండిపోయారు. ఇతడితో సహా మొత్తం ఎనిమిది మంది తమ స్వదేశానికి వెళ్లడానికి విముఖత చూపడంతో సిటీ అధికారులు ఐక్యరాజ్య సమితి సహాయం కోరారు. యూనైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ (యుఎన్‌హెచ్‌ఆర్‌సీ) జోక్యంతో ఏడుగురికి వివిధ స్కాండెనేవియన్ దేశాలు శరణార్థులుగా ఆశ్రయం కల్పించగా.. ఒకరికి మాత్రం ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో అతను ఇక్కడే ఉండిపోయాడు. అతడికి తోడు మరో ఇద్దరు బంగ్లాదేశీయులు ప్రస్తుతం ఈ డిపోర్టేషన్ సెంటర్‌లో ఉన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో దాదాపు రెండు నెలలుగా వీరి డిపోర్టేషన్ ప్రక్రియ ఆగిపోయింది.
సక్రమంగా వచ్చి అక్రమంగా మారి...
నగరం విద్య, వైద్య, వృత్తి, వ్యాపార, పర్యాటక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో పాటు దేశాలకు చెందిన వారు ఇక్కడికి వస్తున్నారు. స్టడీ, విజిట్, బిజినెస్, మెడికల్ వీసాలపై వచ్చిన వారిలో కొందరు అక్రమంగా ఇక్కడే ఉండిపోతున్నారు. మరికొందరు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా వివిధ మార్గాల్లో నగరానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న వారిలో ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రధానంగా సూడాన్, సోమాలియా, నైజీరియా, యమన్, కెన్యా, జిబౌటీ తదితర దేశాల నుంచి వస్తున్న వారితోనే ఇబ్బంది ఎక్కువగా ఉంటోంది. ఆయా దేశాల్లో ఉన్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడే అక్రమంగా స్థిరపడాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం వివిధ రకాలైన వీసాలపై ఇక్కడికి వచ్చేస్తున్నారు.
మొండికేస్తున్న సోమాలియన్లు...
ఈ ఏడాది జనవరిలో చిక్కిన సోమాలియా తదితర దేశాలకు చెందిన వారు డిపోర్టేషన్ సెంటర్‌కు చేరారు. మిలిగిన వారు తమ దేశాలకు వెళ్లిపోగా.. సోమాలియా దేశానికి చెందిన ఎనిమిది మంది మాత్రం తమ స్వదేశానికి వెళ్లేందుకు విముఖత చూపారు. దీంతో వారి విషయంలో అధికారులు యుఎన్‌హెచ్‌ఆర్‌సీ సహాయం తీసుకున్నారు. ఏడుగురి వద్ద సోమాలియా జాతీయులుగా నిరూపించడానికి అవసరమైన పత్రాలు లభించాయి. దీంతో యుఎన్‌హెచ్‌ఆర్‌సీ వీరికి వివిధ స్కాండినేవియన్ దేశాల్లో శరణార్థులుగా ఆశ్రయం కల్పించింది. ఒకరు మాత్రం దాదాపు 13 ఏళ్ల క్రితమే సోమాలియా నుంచి నగరానికి వచ్చేయడంతో ఇతడికి సంబంధించి ఆ దేశ రాయబార కార్యాలయం ఎలాంటి ధ్రువీకరణలు ఇవ్వలేకపోయింది. ఫలితంగా శరణార్థిగా మారే అర్హత లేక డిపోర్టేషన్ సెంటర్‌లోనే ఉండిపోయాడు. ఇతడితో పాటు దాదాపు రెండున్నర నెలల క్రితం చిక్కిన ఇద్దరు బంగ్లాదేశీయులు కూడా డిపోర్టేషన్ కోసం ఇక్కడికి వచ్చారు. లాక్‌డౌన్ నేపథ్యంలో డిపోర్టేషన్ ప్రక్రియలు జరగట్లేదు. ఇవి ఎప్పుడు ప్రారంభం అవుతాయో చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. అప్పటి వరకు వారు సీసీఎస్ ఆ«ధీనంలోనే ఉండాల్సి ఉంది.
డిపోర్టేషన్ సెంటర్‌గా సీసీఎస్...
అక్రమంగా నివసిస్తూ పట్టుబడిన విదేశీయులతో పాటు వివిధ నేరాల్లో చిక్కిన వారినీ పోలీసులు అరెస్టు చేయడం, తమ ఆధీనంలోకి తీసుకోవడం చేస్తారు. వీరిపై సంబంధిత కేసులు నమోదు చేసిన తర్వాత దాని తీరును బట్టి తదుపరి చర్యలు తీసుకుంటారు. వీరిని ఆయా దేశాలకు బలవంతంగా తిప్పి పంపడానికి (డిపోర్టేషన్) ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అప్పటి వరకు డిపోర్టేషన్ సెంటర్‌లో వారిని ఉంచుతారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సెంటర్ విశాఖపట్నంలో ఉండేది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సీసీఎస్ డిపోర్టేషన్ సెంటర్‌గా మారింది. విదేశీయులు పట్టుబడితే వారిని వెంటనే వారి దేశాలకు పంపడం సాధ్యం కాదు. చిక్కిన వారి వివరాలను ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) పంపి, అక్కడి నుంచి ఆయా దేశాలకు చెందిన ఎంబసీలకు సమాచారం ఇవ్వడం ద్వారా వివరాలు పొంది, వారి సాయంతోనే డిపోర్ట్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment