సాక్షి, సిటీబ్యూరో: నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొత్త కేసులు లేకపోవడం, యూఐ కేసుల దర్యాప్తునకు ఆటంకం ఏర్పడంతో బందోబస్తు విధులు పోగా మిగిలిన వారు పాత కేసుల ‘దుమ్ము’ దులుపుతున్నారు. కొలిక్కి చేరే, తాజా అరెస్టులు చోటు చేసుకునే ఆస్కారం లేని వాటిని మూసేసేందుకు అర్హమైన వాటిని గుర్తించి, క్లోజ్ చేసేందుకు అనుమతులు కోరుతూ ప్రతిపాదనలు పంపుతున్నారు. కమిషనరేట్ పరిధిలో పోలీస్ స్టేషన్‌గా భావించే సీసీఎస్ సిటీ పోలీసు విభాగానికి గుండెకాయ వంటిది. రూ.30 లక్షలకు పైబడిన చోరీ, దోపిడీ, బందిపోటు దొంగతనాలతో పాటు రూ.75 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో ముడిపడిన మోసాల కేసులతో పాటు తీవ్రమైన నేరాలకు సంబంధించినవీ దర్యాప్తు నిమిత్తం ఈ విభాగానికే బదిలీ అవుతూ ఉంటాయి. కొత్త కీలక కేసులను సీసీఎస్ అధికారులే నేరుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటారు. ఈ పోలీసులు దర్యాప్తు చేసే కేసుల పరిధి వివిధ జిల్లాలు, రాష్ట్రాలతో ముడిపడి ఉంటుంది. ప్రతి ఏడాదీ సీసీఎస్ పోలీసులు దాదాపు 400 కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుంటారు.
కరోనా వ్యాప్తి నిరోధానికి మార్చి 23 నుంచి లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది. ఆ తర్వాత సీసీఎస్‌కు వచ్చిన కొత్త కేసులు లేవు. అంతకు ముందు వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ప్రాథమిక విచారణ పూర్తి చేసిన అ«ధికారులు ఒకటి రెండు ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్ చేశారు. దీంతో కొత్త కేసులకు పూర్తిగా బ్రేక్ పడింది. దర్యాప్తు దశలో ఉన్న (యూఐ) కేసులపై లాక్‌డౌన్ ప్రభావం పడింది. ఆధారాల సేకరణ, నిందితుల అరెస్టుల కోసం బయటి ప్రాంతాలకు వేళ్లే ఆస్కారం లేకపోవడం, ఫోరెన్సిక్ ల్యాబ్ సహా ఇతర ఏజెన్సీలు పూర్తి స్థాయిలో పని చేయకపోవడంతో వీటి దర్యాప్తు ఆగిపోయింది. లాక్‌డౌన్ అమలుకు సంబంధించిన బందోబస్తు విధుల్లో దాదాపు 30 శాతం మంది సీసీఎస్ అధికారులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన సిబ్బందికి ఉన్నతాధికారులు ఓ టాస్క్ అప్పగించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ‘వాంటెడ్’ కేటగిరీకి చెందిన వాటిలో 2000 కంటే ముందు నమోదైన/బదిలీ అయిన వాటిని గుర్తించాలని, వీటిలో ముందుకు వెళ్లే ఆస్కారం లేకపోతే మూసివేతకు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
ఉదాహరణకు 1999లో నమోదైన ఓ కేసులో మొత్తం ముగ్గురు నిందితులు ఉన్నారు. అప్పట్లో కేవలం ఒకే నిందితుడు అరెస్టు కావడంతో మిగిలిన ఇద్దరినీ కేసు నుంచి వేరు చేసి (స్లి్పట్) దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఆ ఒక్కడి పైనా ఉన్న కేసు సైతం న్యాయస్థానంలో వీగిపోయింది. అయితే ఈ కేసులో ఇద్దరు నిందితులు వాంటెడ్‌గా ఉండటంతో ఇప్పటికీ ఈ కేసు యూఐ కేటగిరీలో పెండింగ్‌గా ఉండిపోయింది. దాదాపు 20 ఏళ్ల క్రితం చిక్కని నిందితులు ఇప్పుడు చిక్కడం దుర్లభమే. అయితే కేసు పెండింగ్‌లో ఉండిపోవడంతో కొన్ని సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటి కేసుల్ని గుర్తిస్తున్న అధికారులు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. వీటిని క్షుణ్ణంగా సమీక్షించే ఉన్నతాధికారులు అర్హమైన వాటిని మూసేయడానికి అనుమతిస్తున్నారు. ఈ స్థాయిలో కేసుల్ని మూసివేయాలంటే ప్రాసిక్యూషన్ విత్‌డ్రా ఒకటే మార్గం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన నివేదికల్ని రూపొందిస్తున్న ఉన్నతాధికారులు నగర కొత్వాల్‌తో పాటు ప్రభుత్వానికి పంపిస్తున్నారు. లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించుకోవడంపై సీసీఎస్ అధికారులు దృష్టి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment