'ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాటకం'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో సీఎం చంద్రబాబు లాలూచీ పడ్డారని న్యాయవాది శంకరయ్య ఆరోపించారు. చంద్రబాబు నాటకం ఆడి ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్నారని అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో గుత్తిరోడ్డులోని వీజేఆర్ ఫంక‌్షన్ హాల్‌లో జరుగుతున్న యువభేరిలో ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదా అవసరం లేదని చంద్రబాబు చెప్పడం శోచనీయమని విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టినప్పుడు పార్లమెంట్ సాక్షిగా హోదా ఇస్తామన్నారని హామీయిచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా తెస్తామని మేనిఫెస్టోలో పెట్టలేదా అని అధికార పార్టీలను ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి అన్నివిధాలుగా మేలు జరుగుతుందన్నారు. కేంద్ర నుంచి వచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంటుగా, 10 శాతం లోనుగా ఇస్తారని వివరించారు. పారిశ్రామిక, రవాణా సదుపాయాల్లో రాయితీలు ఇస్తారని తెలిపారు. ప్రత్యేక హోదా కారణంగానే హిమచల్ ప్రదేశ్ లో 10 వేల పరిశ్రమలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ప్రత్యేక హోదా ఇవాల్సిందేనని కేవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.