సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సీట్లు మిగిలితే వాటిని ఇతరులకు కేటాయించాలంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు స్పీకర్ కోడెల శివప్రసాదరావు వినతిపత్రం ఇవ్వడం సిగ్గు చేటు అని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి విమర్శించారు. ఢిల్లీలో అక్టోబర్ 10న స్పీకర్ కోడెల ఈ మేరకు వినతిపత్రాన్ని ఇచ్చారని, ఇంతకన్నా దుర్మార్గం మరొకటి లేదని అన్నారు.
తన నియోజకవర్గ పరిధిలోని కేంద్రీయ విద్యాలయంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సీట్లు ఎందుకు మిగిలిపోయాయో ఆలోచించి, వారిని చేర్చేలా చర్యలు తీసుకోవడానికి బదులు.. మిగిలిన సీట్లన్నీ ఇతరులకు లాటరీ పద్ధతిలో కేటాయించేలా జీవో ఇవ్వాలంటూ విన్నవించడం దళిత వ్యతిరేక చర్య తప్ప మరొకటి కాదని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయంలో సీట్లు మిగిలి పోవడానికి ప్రభుత్వ ప్రచారం లేకపోవడమే కారణమన్నారు. ఒక బాధ్యతగల ప్రజా ప్రతినిధిగా వున్న స్పీకర్ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి దళిత కాలనీలకు వెళ్లి కేంద్రీయ విద్యావిధానంపై అవగాహన కల్పించలేకపోయారని, వారిని ఆ విద్యాలయంలో చేర్చేలా చర్యలు తీసుకోలేకపోయారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment