- పారిశుద్ధ్య లోపం, కలుషిత తాగునీటితో రోగాల పడగ
- రోగులతో పాడేరు ప్రాంతీయ ఆసుపత్రి కిటకిట
పాడేరు రూరల్ : మన్యంలో వర్షాలతో గ్రామా ల్లో లోపించిన పారిశుద్ధ్యం, కలుషిత నీరు తాగడం ప్రధాన కారణాలతో రోగాలు పడగవిప్పాయి. ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట, జి.మాడుగుల, పాడేరు మండలాలకు చెందిన పలువురు గిరిజనులు రోగాల బారినపడ్డారు.
పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిలో కేవలం ఓపీ సమయంలోనే గత మూడు రోజుల్లో దాదాపు 700 మంది వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరో వంద మంది ఆసుపత్రిలో చేరి వైద్య చికిత్స పొందుతున్నారు. దీంతో వార్డులన్నీ కిక్కిరిసిపోయాయి. ఒక్కో బెడ్‌ను ఇద్దరేసి రోగులకు ఇస్తున్నారు. చివరకు వార్డుల్లో ఖాళీలేక ఆస్పత్రి వరండాలోనూ బెడ్‌లు వేసి రోగులకు వైద్యం చేస్తున్నారు.
మరోవైపు గిరిజన సంక్షేమ ఆశ్ర మ వసతిగృహాల్లోని విద్యార్థులు కూడా అనారోగ్యం పాలవుతున్నారు. స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో పది మంది చేరారు. కొంతమంది ఆస్పత్రి ఓపీ సమయంలో వచ్చి వైద్యసేవలు పొందుతున్నారు. జ్వరాల తీవ్రత పెరగడంతో పాడేరు ఇన్‌చార్జి ఏడీఎంహెచ్‌వో డాక్టర్ లీలాప్రసాద్ బుధవారం ప్రాంతీయ ఆస్పత్రిని సం దర్శించారు. మందుల స్టాక్‌పై ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను, సిబ్బందిని ఆదేశించారు.