కన్నీటి కృష్ణమ్మ
► శ్రీశైలం జలాశయంలో అట్టడుగుకు నీటిమట్టం
► 2002 తర్వాత మళ్లీ ఈ ఏడాది అదే పరిస్థితి
► తాగునీటి అవసరాల పేరిట తరలింపు
► రాయలసీమ గోడు పట్టని పాలకులు
వేసవి ప్రారంభంలోనే శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం అట్టడుగుకు చేరుకుంది. జలాశయంలో పురాతన కట్టడాలు బయటపడుతుండటం తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం ఉన్న నీటితో మే నెలాఖరు వరకు తాగునీటి అవసరాలను కొంత వరకు తీర్చుకునే అవకాశం ఉంది. ఆలోపు వర్షాలు రాకపోతే పరిస్థితి ఏమిటనే విషయమై నీటి పారుదల శాఖ అధికారులే ఆందోళన చెందుతుండటం గమనార్హం. ఇక ఆగస్టు 2, 2002న అనూహ్యంగా 752.50 అడుగులకు పడిపోయిన నీటిమట్టం.. ప్రస్తుతం అదే స్థాయిలో పడిపోవడం, రెండు సందర్భాల్లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబే కావడం యాదృచ్ఛికమే.
సాక్షి, కర్నూలు: తెలుగు రాష్ట్రాల ప్రధాన జలవనరు శ్రీశైలం జలాశయం. పూర్థి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. 215.85 టీఎంసీల సామర్థ్యం ఉంది. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో జలాశయంలోకి నీటి చేరిక పూర్తిగా తగ్గిపోయింది. శుక్రవారం నాటికి జలాశయంలో నీటి మట్టం 784.80 అడుగులకు చేరుకోగా.. 22.2200 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాధారణంగా మే నెల ఆఖరుకు జలాశయం డెడ్ స్టోరేజీకి చేరుకుంటుంది. అలాంటిది మార్చి మొదటి వారంలోనే ఆ పరిస్థితి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిలోనూ తాగునీటి పేరిట సాగర్‌కు శ్రీశైలం నీరు తరలిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత మూడున్నర దశాబ్దాల్లో మొదటిసారిగా ఈ సంవత్సరం 58 టీఎంసీల నీరు మాత్రమే డ్యాంలోకి వచ్చి చేరింది. జలాశయం కనీస నీటి మట్టం 854 అడుగులు.
1996లో ఈ మట్టాన్ని 834 అడుగులకు తగ్గిస్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు జీఓ 69 జారీ చేశారు. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జీఓ 107తో నీటి మట్టం 885 అడుగులకు పెంచారు. గత నాలుగు సంవత్సరాలుగా శ్రీశైలం జలాశయ కనీస నీటి మట్టం ఎవ్వరూ పట్టించుకోని పరిస్థితి. వాస్తవానికి కృష్ణా డెల్టాలో తాగునీటి ఇబ్బందుల దృష్ట్యా కృష్ణా బోర్డును కూడా తప్పుదోవ పట్టించి నీటిని దిగువకు పారిస్తున్నారు. వాస్తవానికి కోస్తాతో పోలిస్తే రాయలసీమలోనే తాగునీటి సమస్యలు అధికం.
రాయలసీమకు కన్నీళ్లే..
తెలంగాణ, కృష్ణా డెల్టాలో తాగునీటి ఇక్కట్ల పేరుతో జలాశయం నీటిని తరలిస్తున్న పాలకులు.. గొంతెండిన రాయలసీమను ఏమాత్రం పట్టించుకోకపోవడం ఇక్కడి ప్రజలపై చూపుతున్న ప్రేమకు నిదర్శనం. కనీసం ఇక్కడి పరిస్థితిని కృష్ణా బోర్డుకు వివరించే ప్రయత్నం కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. సీమకు శ్రీశైలం జలాశయం నీరు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి పారించాల్సి ఉంది. జలాశయంలో 841 అడుగలకు పైగా నీటి మట్టం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.
గత ఏడాది 841 అడుగులకు చేరక ముందు నుంచే ఒకవైపు తెలంగాణ.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి అవసరాల పేరిట నీరు వినియోగించారు. నీటి మట్టం 845 అడుగులకు చేరుకున్న సమయంలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టడం.. కర్నూలు ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంతో పోతిరెడ్డిపాడుకు కంటితుడుపుగా నీరు విడుదల చేశారు. ఈలోపు నీటి మట్టం 841 అడుగులకు చేరుకోగానే నీటి విడుదల నిలిపేశారు.
సా..గుతున్న ముచ్చుమర్రి
ప్రస్తుతం శ్రీశైలంలో 784 అడుగులకు నీటి మట్టం చేరినా.. సీమకు కృష్ణా జలాలను తరలించే అవకాశం ఉంది. ఇందుకు ముందుచూపుతో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంలో కనీసం రెండు మోటార్ల పనులు పూర్తి చేసినప్పుడే సాధ్యమవుతుంది. అయితే ఈ పథకం విషయంలో ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది.