నరసాపురం అర్బన్ : నరసాపురంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన భూ మోసం వ్యవహారంలో డొంక కదులుతోంది. దీనిపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి మంత్రి పీతల సుజాతతోపాటు, పోలీసు అధికారులు స్పందించారు. ఈ కేసులో నిందితులు మంత్రి సుజాత పేరును వాడుకోవడంతో ఆమె సీరియస్ అయ్యారు. నిజనిజాలు నిగ్గుతేల్చాలని పోలీసులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఇద్దరిని రెండురోజుల క్రితం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మిగిలినవారి కోసం గాలింపు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
పట్టణంలోని పొన్నపల్లికి చెందిన కొల్లాటి నర్శింహారావు సోదరులను కొందరు మాయమాటలతో మోసగించి రూ.70లక్షల విలువైన ఇళ్లస్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ సమయంలో సొమ్ముకు బదులు చెక్కులు ఇచ్చి, మళ్లీ వాటిని తెలివిగా తీసేసుకున్నారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వైనాన్ని సాక్షి 20 రోజుల క్రితం ప్రచురించింది. దీంతో డొక కదిలింది.
మరిన్ని మోసాలు...
నరసాపురం ప్రాంతంలో ఈ తరహా మోసాలు అనేకం జరుగుతున్నట్టు తెలుస్తోంది. పట్టణానికి చెందిన భూస్వామి అశ్వద్ధామనాయుడును కిడ్నాప్‌చేసి, ఆయన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటన గత ఏడాది పట్టణంలో సంచలనం కలిగించింది. అప్పుడు కూడా బాధితులు కోర్టు ద్వారా న్యాయపోరాటం చేపట్టారు. ఇప్పుడు అదే తరహా మోసం వెలుగు చూసింది. తాజా కేసులో బాధితులు ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులే కాకుండా, మరికొంత మంది తెరవెనుక ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వారి కనుసన్నల్లోనే నరసాపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా మరికొన్ని భూమోసాలు జరిగి నట్టుగా చెబుతున్నారు. పరారీలో ఉన్న నింది తులు దొరికితే, మరిన్ని మోసాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో కీలక నిందితులను తప్పించే యత్నాలూ సాగుతున్నట్టు సమాచారం.
భూ మోసంపై కదులుతున్న డొంక
Published Thu, Apr 7 2016 12:06 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement
Advertisement