బినామీల కోసమే భూసేకరణ
► రైతుల భూములతో ప్రభుత్వం రియల్ వ్యాపారం
►చందనాడ బహిరంగ సభలో అఖిలపక్ష నాయకులు
►ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదు
► రైతులకు అండగా నిలుస్తాం
నక్కపల్లి: రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూ ములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్‌వ్యాపారం చేస్తోంద ని, తమ పార్టీకి చెందిన వారితో బినామీ కంపెనీలు ఏర్పాటు చేయించి కారు చౌకగా కట్టబెడుతోందని అఖిల పక్ష నాయకులు ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏకపక్షంగా చేపడుతున్న బలవంతపు భూసేకరణను అడ్డుకుని తీరుతామని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. విశాఖ చెన్నై మధ్య ఏర్పాటు చే స్తున్న ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వం ఏకపక్షంగా నక్కపల్లి మండలంలో 6వేల ఎకరాలను సేకరించడానికి పూనుకుంది. భూములు ఇవ్వడానికి రైతులు వ్యతిరేకిస్తూ కో ర్టును ఆశ్రయించారు. అయినా ప్రభుత్వం మొండిగా ముందు జిరాయితీ భూములను సర్వే చేయడంతోపాటు, ఆరేళ్లుగా పోరాటం చేస్తున్న రైతుల్లో చీలిక తెచ్చి టీడీపీ అనుకూలంగా ఉన్న రైతుల నుంచి భూములు ఇవ్వడానికి ఒప్పించింది. దీన్ని నిరసిస్తూ అఖిలపక్షరైతులు వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీలకు చెందిన జిల్లా నాయకులతో గురువారం చందనాడలో బారీ బహిరంగ సభ నిర్వహించారు. రాజయ్యపేట, చం దనాడ, అమలాపురం, వేంపాడు, డి.ఎల్.పురం గ్రామా ల నుంచి వందలాది మంది రైతులు హాజరయ్యారు.
మాటతప్పడం చంద్రబాబుకు అలవాటే...
మాజీ మంత్రి బాలరాజు మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగ ప్రతిపక్షంలో మరోలాగ మాట్లాడటం చంద్రబాబుకు అలవాటేనన్నారు. భూసేకరణవిషయంలో చంద్రబాబుతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులను కూడా నిలదీయాలన్నారు. జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు తీరు సిగ్గుచేటు: మాజీ ఎమ్మెల్సీ డి.వి. సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ ఇక్కడి భూముల ను అధికారంలో ఉన్న పెద్దలకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం భూసేకరణ మంత్రం ఉపయోగిస్తోందన్నారు. ప్ర తిపక్షంలో ఉన్నప్పుడు భూసేకరణను వ్యతిరేకించిన చం ద్రబాబు అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించడం సిగ్గుచేటన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాటం చేయడం వైఎస్సార్‌సీపీ లక్ష్యమన్నారు.
చంద్రబాబు బినామీలే భూములు కొంటున్నారు
సీపీఐ కార్యదర్సి జె.వి. సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ భూసేకరణ చట్టానిక తూట్లు పొడుస్తూ సీఎం చంద్రబాబు బినామీలే భూములు కొంటున్నారని ఆరోపించారు. శాంతియుతంగా కాదని ఉద్యమాల ద్వారానే హక్కులు, భూములు కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
విదేశాల్లో రద్దు చేసిన పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు చేస్తారా?
సీపీఎం నాయకుడు నర్సింగరావు మాట్లాడుతూ విదేశాల్లో రద్దుచేసిన పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారన్నారు. భూసేకరణలో భాగంగా ఎకరాకు మొదట్లో ఆరు లక్షలు, పోరాటం చేస్తే రూ.10లక్షలు, కోర్టుకు వెళ్లగా రూ.18లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోందన్నారు. రైతుల్లో చీలిక తెచ్చి తన చేతకాని తనాన్ని నిరూపించుకుందని విమర్శించారు. పార్టీ ఒత్తిడికి తలొగ్గి భూములు ఇవ్వడానికి ముందుకొచ్చిన రైతులనూ నిల దీయాలన్నారు. అన్ని పార్టీలూ ఎదురు తిరగడంవల్లే నరేంద్రమోదీ సైతం భూసేకరణ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు ఎ. మణిరాజు, సీపీఐ జిల్లా కార్యదర్సి స్టాలిన్, వ్యవసాయ కార్మిక సంఘనాయకులు బాలకృష్ణ, రావు జగ్గారావు, మహిళా విభాగం నాయకురాలు ఎ.విమల, డీహెచ్‌పీఎస్ నాయకులు జె.వి.ప్రభాకర్, రైతు నాయకులు లొడగల చంద్రరావు, పి. పాపారావు, శివాజీ రాజు, ఎం. అప్పలరాజు, సర్పంచ్‌లు జి. బాబూరావు, తిరుపతిరావు, గోవిందు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.