జిల్లాలోని దామవరం వద్ద అత్యంత ఆధునిక వసతులతో విమానాశ్రయం నిర్మిస్తామని ఇదిగో తేదీ.. అదిగో శంకుస్థాపన అంటూ సీఎం చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా చెబుతూ వచ్చారు. ఇప్పటికి రెండు దఫాలుగా శంకుస్థాపన వాయిదా వేసిన సీఎం ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో తాజాగా శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేస్తున్నారు. ఎన్నికల ముందు, ఆ తర్వాత ఇచ్చిన ఏ హామీనినిలబెట్టుకోని ముఖ్యమంత్రి ప్రజా వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి కేంద్రంపై నెపం నెడుతూ రాజధానిలో విమానాలు కావాలన్నా కేంద్రంపై ఆధార పడాలా?.. మనకు మనమే ప్రైవేట్ భాగస్వామ్యంతో ఎయిర్‌పోర్టులు నిర్మించుకుని మన సత్తా చూపుదాం అంటూ సీఎం జిల్లాల పర్యటనలో తరచూ ఆవేశ పూరిత ప్రసంగాలు చేశారు. జిల్లాలోని దగదర్తిలోవిమానాశ్రయం నిర్మించి 2019 మార్చి కల్లా కార్గొ సర్వీసు ఇక్కడ నుంచేప్రారంభమయ్యేలా చేస్తానంటూ తరచూ జిల్లాలో ఎయిర్‌పోర్టు ప్రస్తావన వచ్చినప్పుడు సీఎం వాగ్దానాలు చేశారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా మారింది. ఇంకా నూరు శాతం భూసేకరణ చేయకుండా, భూపరిహరం పంపిణీ పూర్తి కాకుండానే తరచూ ప్రభుత్వం శంకుస్థాపన పేరుతో హడావుడి చేస్తోంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని కావలి నియోజకవర్గంలో దగదర్తి మండలం దామవరం, కొత్తపల్లి కౌరుపల్లిగుంట గ్రామాల్లో విమానాశ్రయం నిర్మించాలని 2015లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి రావడంతో భూసేకరణపై దృష్టి పెట్టారు. దీనికి అనుగుణంగా రెండు గ్రామాల్లో అవసరమైన ప్రైవేట్, ప్రభుత్వ భూములు 1399.69 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా భూసేకరణ ప్రక్రియ మొదలు పెట్టారు. మొత్తం 1399.69 ఎకరాల భూమి సేకరణకు దామవరంలో 1075.86 ఎకరాలు, కొత్తపల్లికౌరుగుంటలో 323.83 ఎకరాలు భూమిని సేకరించాలని నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం ఈ భూమిలో 149.84 ఎకరాలు ప్రభుత్వ భూమి, 442.25 ఎకరాలు పోరంబోకు భూమి, 356.79 ఎకరాల ప్రైవేట్ భూమికి సంబంధించి భూసేకరణ అంతా దాదాపుగా పూర్తి చేశారు. అయితే 65 ఎకరాల ప్రైవేట్ భూమికి సంబంధించి సేకరణ పూర్తిగా జరగలేదు.
అనేక సమస్యలు అడ్డంకి
ఈ భూముల్లో దగదర్తి–ముంగమూరు కెనాల్ ఉంది. మొత్తం 26 కిలో మీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ కెనాల్ సేకరణ భూమి మూడు కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. భూసేకరణ ప్రతిపాదనలు మొదలయ్యాక ఇరిగేషన్ అధికారులు దాన్ని పరిశీలించి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ తరహాలో అండర్ గ్రౌండ్ కెనాల్‌ను మూడు కిలో మీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఇవి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. సేకరణ భూముల్లో పది కిలో మీటర్ల మేర హైటెన్షన్ విద్యుత్ లైను ఉంది. దీన్ని కూడా మార్చాలని ప్రతిపాదనలు పెట్టారు. అయితే రూ.కోట్లలో వ్యయం కానుండడంతో ఇంకా ఇవి ఖరారు కాకుండా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇలా అనేక అంశాలతో పాటు పరిహరం కూడా పంపిణీ ప్రక్రియ పూర్తి కాని పరిస్థితి. ప్రతిపాదనలు సిద్ధం అయిన క్రమంలో మొదట్లో గ్రీన్ ఫీల్ట్ ఎయిర్‌పోర్ట్ అని, అది కూడా రూ.5,068 కోట్లతో నిర్మిస్తామని ప్రకటించారు. ఇప్పుడు అది కూడా మారిపోయి కేవలం రన్‌వేకే పరిమితమైంది.
సీఎం మాత్రం చెబుతూనే ఉంటారు
ఈ ఏడాది జనవరిలో జన్మభూమి సభ నెల్లూరురూరల్ నియోజకవర్గంలో నిర్వహించి మరో రెండు నెలల్లో దగదర్తి (దామవరం) ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేస్తానని ప్రకటించారు. వెంటనే అధికారులు ఆగమేఘాల మీద రెవెన్యూ రికార్డులు సిద్ధం చేసి వాస్తవ పరిస్థితిని సీఎం పేషికి నివేదిక రూపంలో పంపారు. ఆ తర్వాత మళ్లీ నాయుడుపేటలో నిర్వహించిన బహిరంగ సభలోనూ ఇదే పాట పాడారు. ఆ తర్వాత ఈ నెల 20న నిర్వహించిన ధర్మపోరాట దీక్షలోనూ ఇదే పాట పడారు. మరో అడుగు ముందుకు వేసి డిసెంబర్ నెలలో ఎయిర్‌పోర్టు శంకుస్థాపన చేస్తానని ప్రకటించారు. గడిచిన నాలుగున్నరేళ్లుగా సీఎం జిల్లాకు ఇచ్చిన హామీలను అన్నింటిని ప్రస్తావించి అన్ని వెంటనే పూర్తి చేస్తానని ప్రకటించారు. అయితే పార్టీలో అంతర్గతంగా పరిస్థితి వేరేలా ఉంది. జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగిన ప్రతిసారి పార్టీ నేతలే సీఎం జిల్లాకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. ఏ ముఖం పెట్టుకొని వెళ్లి ఓట్లు అడుగుతాం. వీటిపై తేల్చండి అంటూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అమరనాథ్‌రెడ్డి, జిల్లా మంత్రులు సోమిరెడ్డి, నారాయణలను ప్రశ్నిస్తునే ఉన్నా.. ప్రయోజనం మాత్రం శూన్యం. దామవరం విమానాశ్రయానికి సంబంధించి అన్ని పెండింగ్‌లోనే ఉన్నా.. సీఎం యథావిధిగా శంకుస్థాపన ప్రకటించి వెళ్లడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment