
భూ తగాదాలలో యువకుడు బలి
చాట్రాయి(కృష్ణా జిల్లా): భూమి విషయమై జరిగిన ఘర్షణలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన పావన వరప్రసాద్, పావన సత్యనారాయణల మధ్య కొంతకాలంగా భూమి విషయమై గొడవలు జరుగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం కూడా పొలంలో వారికి తగవు జరిగింది. తరువాత ఇరు కుటుంబాల సభ్యులు ఇంటికి చేరుకున్నారు. అనంతరం సాయంత్రం సత్యనారాయణ భార్య సీతామహాలక్ష్మి, కొడుకు నాగకల్యాణ కుమార్ కలసి వరప్రసాద్ కుమారుడు పవన్‌కుమార్, వెంకటరమణలపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో పవన్‌కుమార్(17) అక్కడికక్కడే మృతి చెందగా వెంకట రమణకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను 108 వాహనం ద్వారా నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
దాడి జరుగుతున్న సమయంలో పవన్ తమ్ముడు సాయికుమార్‌ను ఇరుగుపొరుగు వారు దాచటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, నిందితులు పావన సత్యనారాయణ, సీతామహలక్ష్మి, నాగకల్యాణకుమార్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.